బుమ్రా సారథ్యంలో... | Team Indias first Test under the captaincy of Jasprit Bumrah | Sakshi
Sakshi News home page

బుమ్రా సారథ్యంలో...

Published Mon, Nov 18 2024 3:58 AM | Last Updated on Mon, Nov 18 2024 3:58 AM

Team Indias first Test under the captaincy of Jasprit Bumrah

తొలి టెస్టు బరిలోకి భారత్‌ 

మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ దూరం 

తప్పుకున్న గిల్, కోలుకున్న రాహుల్‌ 

పెర్త్‌: ప్రతిష్టాత్మక బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు రెగ్యులర్‌ టాప్‌–3 బ్యాటర్లలో ఇద్దరు లేకుండానే బరిలోకి దిగడం ఖాయమైంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్‌ శర్మ, గాయంతో శుబ్‌మన్‌ గిల్‌ తొలి టెస్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ టాపార్డర్‌లో ఆడటం ఖాయమైంది. రెండో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం దక్కవచ్చు. 

మరో వైపు పేస్‌ బౌలర్, వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సారథ్యంలో టీమిండియా తొలి టెస్టు ఆడనుంది. కెరీర్‌లో 40 టెస్టులు ఆడిన బుమ్రా ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. రోహిత్‌ శర్మ కోవిడ్‌ బారిన పడటంతో అతను ఈ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. 

2022లో ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఓడింది. భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 22 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. సోమవారం భారత్‌ తమ ప్రాక్టీస్‌కు విరామం ఇచ్చి మంగళవారం నుంచి మ్యాచ్‌ వేదిక అయిన ఆప్టస్‌ స్టేడియంలో సాధన చేస్తుంది.  

రెండో టెస్టునుంచి అందుబాటులోకి... 
సహచరులతో పాటు ఆ్రస్టేలియాకు వెళ్లకపోవడంతో రోహిత్‌ తొలి టెస్టు ఆడటంపై సందేహాలు ఉన్నాయి. అతను కూడా బీసీసీఐకి ముందే సమాచారం అందించాడు. అయితే శుక్రవారమే అతనికి కొడుకు పుట్టగా...మ్యాచ్‌కు మరో వారం రోజుల సమయం ఉండటంతో మళ్లీ రోహిత్‌ ఆడటంపై చర్చ జరిగింది. దీనికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ కెప్టెన్‌ తుది నిర్ణయం తీసుకున్నాడు. 

మరికొంత సమయం కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపించిన అతను తొలి మ్యాచ్‌నుంచి తప్పుకున్నాడు. డిసెంబర్‌ 6 నుంచి అడిలైడ్‌లో జరిగే రెండో (డే అండ్‌ నైట్‌) టెస్టుకు తాను అందుబాటులో ఉంటానని...నవంబర్‌ 30నుంచి ఆ్రస్టేలియన్‌ పీఎం ఎలెవన్‌తో జరిగే రెండు రోజుల పింక్‌ బాల్‌ వార్మప్‌ మ్యాచ్‌ కూడా ఆడతానని బోర్డుకు చెప్పినట్లు సమాచారం.  

ఈశ్వరన్‌కూ అవకాశం! 
శనివారం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా శుబ్‌మన్‌ గిల్‌ ఎడమ చేతి బొటన వేలు విరిగింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను కూడా పెర్త్‌ టెస్టునుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు కేఎల్‌ రాహుల్‌ గాయంనుంచి పూర్తిగా కోలుకోవడం భారత్‌కు సానుకూలాంశం. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతూ శుక్రవారం మోచేతికి గాయం కావడంతో రాహుల్‌ మైదానం వీడాడు. దాంతో అతని గాయంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఎక్స్‌రే అనంతం ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. 

ఆదివారం మళ్లీ బ్యాటింగ్‌ చేసిన రాహుల్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ పూర్తి స్థాయిలో మూడు గంటల పాటు నెట్‌ సెషన్స్‌లో పాల్గొన్నాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు రాహుల్‌ స్వయంగా వెల్లడించాడు. రాహుల్‌ మూడో స్థానంలో ఆడితే యశస్వి జైస్వాల్‌తో పాటు రెండో ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌ అరంగేట్రం చేయవచ్చు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన ఈశ్వరన్‌ ఆస్ట్రేలియా బయల్దేరడానికి ముందు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 

వరుసగా నాలుగు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు చేశాడు. అయితే భారత్‌ ‘ఎ’ తరఫున బరిలోకి దిగి ఆ్రస్టేలియా ‘ఎ’పై నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 36 పరుగులే చేయడంతో అతని ఆటపై సందేహాలు రేగాయి. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఓపెనర్‌ అవకాశం దక్కవచ్చు. మరో వైపు బీసీసీఐ ముందు జాగ్రత్తగా ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఉన్న మరో టాపార్డర్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ను ఆస్ట్రేలియాలోనే ఆగిపొమ్మని చెప్పింది. 

అవసరమైతే అతనూ టెస్టు సిరీస్‌ కోసం సిద్ధంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది. పడిక్కల్‌ తన ఏకైక టెస్టును ఇంగ్లండ్‌పై ధర్మశాలలో ఆడాడు. పడిక్కల్‌తో పాటు మరో ముగ్గురు పేసర్లు నవదీప్‌ సైనీ, ఖలీల్‌ అహ్మద్, ముకేశ్‌ కుమార్‌ కూడా ఆ్రస్టేలియాలోనే ఆగిపోయారు.  

నితీశ్‌ రెడ్డికి చాన్స్‌! 
పెర్త్‌ టెస్టులో భారత జట్టులో మూడో పేసర్‌ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. బుమ్రా, సిరాజ్‌లతో పాటు మూడో పేసర్‌గా ఇప్పటి వరకు ప్రసిధ్‌ కృష్ణ పేరు వినిపించిది. ప్రాక్టీస్‌ గేమ్‌లోనూ అతను రాణించాడు. అయితే నెట్‌ సెషన్స్‌లో ఢిల్లీ పేసర్‌ హర్షిత్‌ రాణా కూడా ఆకట్టుకున్నాడు. నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేస్తున్న హర్షిత్‌ ఆ్రస్టేలియాలోని బౌన్సీ పిచ్‌లపై ‘ట్రంప్‌ కార్డ్‌’ కాగలడని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. దాంతో ప్రసిధ్, హర్షిత్‌ మధ్య పోటీ నెలకొంది. 

ప్రసిధ్‌ ఇప్పటికే భారత్‌ తరఫున 2 టెస్టులు ఆడగా...హర్షిత్‌ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టలేదు. అయితే ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి అరంగేట్రంపై కూడా చర్చ జరుగుతోంది. ప్రాక్టీస్‌ గేమ్‌లో తన స్వింగ్‌ బౌలింగ్‌లో అతను సత్తా చాటాడు. అతని బ్యాటింగ్‌ కూడా అదనపు బలం కాగలదు. ఇద్దరు సీనియర్లు దూరం కావడంతో మన బ్యాటింగ్‌ లైనప్‌ను పటిష్టపర్చేందుకు నితీశ్‌ లాంటి ఆల్‌రౌండర్‌ అవసరం ఉంది. 

ఆదివారం టీమ్‌ ప్రాక్టీస్‌లో అతని ఆటను పర్యవేక్షించిన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ సుదీర్ఘ సమయం పాటు చర్చిస్తూ తగిన సూచనలివ్వడం కనిపించింది. మరో వైపు గాయంనుంచి కోలుకొని రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడిన మొహమ్మద్‌ షమీ ఇప్పటికిప్పుడు ఆ్రస్టేలియా వెళ్లే అవకాశం లేదని...సిరీస్‌ చివర్లో జట్టుతో చేరవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement