
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాతో గొడవ పడ్డ ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్‌కు జాక్‌పాట్ తగిలింది. 2025-26 సంవత్సరానికి గానూ క్రికెట్ ఆస్ట్రేలియా కొన్‌స్టాస్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. కొన్‌స్టాస్‌తో పాటు వివాదాస్పద బౌలింగ్ శైలి కలిగిన మాథ్యూ కుహ్నేమన్, ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ కూడా కొత్తగా క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.
ఈ ముగ్గురి చేరికతో క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల సంఖ్య 23కు చేరింది. కొన్‌స్టాస్, కుహ్నేమన్, వెబ్‌స్టర్ ఇటీవల ఆస్ట్రేలియా తరఫున అద్భుత ప్రదర్శనలు చేశారు. ఈ కారణంగా వారు క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ పొందారు. కొన్‌స్టాస్, వెబ్‌స్టర్ భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటగా.. కుహ్నేమన్ ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్‌లో చెలరేగిపోయాడు. ఆ సిరీస్‌లో కుహ్నేమన్ 2 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. ఫలితంగా ఆసీస్ శ్రీలంకను వారి సొంతగడ్డపైఏ 2-0 తేడాతో ఓడించింది.
కొన్‌స్టాస్ విషయానికొస్తే.. ఇతగాడు తన టెస్ట్ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత కొన్‌స్టాస్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయనప్పటికీ.. బుమ్రాతో మాటల యుద్దం కారణంగా బాగా పాపులర్ అయ్యాడు.
వెబ్‌స్టర్ విషయానికొస్తే.. ఇతగాడు కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లోనే అరంగేట్రం చేశాడు. వెబ్‌స్టర్ కూడా తన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో కూడా రాణించాడు. మిచెల్ మార్ష్, కెమారూన్ గ్రీన్ గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వెబ్‌స్టర్ తన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ పట్టాడు.
2025-26 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆసీస్ ఆటగాళ్లు..
పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, నాథన్ లియాన్, అలెక్స్ కారీ, సామ్ కొన్‌స్టాస్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, జై రిచర్డ్‌సన్, స్కాట్ బోలాండ్, లాన్స్ మోరిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్నస్ లబూషేన్, ఉస్మాన్ ఖవాజా, మిచెల్ మార్ష్, బ్యూ వెబ్‌స్టర్, కామెరూన్ గ్రీన్, జేవియర్ బార్ట్‌లెట్