
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy-2025) గాయాల బెడద పట్టుకుంది. మెగా టోర్నీకి స్టార్ పేసర్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే అన్రిచ్ నోర్జే, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, క్రిస్ వోక్స్, లోకీ ఫెర్గూసన్, గెరాల్డ్ కొయెట్జీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కాగా.. తాజాగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వైదొలిగారు.
వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లంతా దూరమైతే మెగా టోర్నీ కళ తప్పే ప్రమాదముంది. అన్ని జట్ల కంటే గాయాల సమస్య ఆస్ట్రేలియాను (Australia) ఎక్కువగా వేధిస్తుంది. ఆ జట్టులో ఏకంగా ఐదుగురు స్టార్ ఆటగాళ్లు గాయపడ్డారు. ఒకరు (Marcus Stoinis) ఏకంగా వన్డే క్రికెట్‌కే రిటైర్మెంట్ ప్రకటించారు. జట్టులో సగానికి పైగా రెగ్యులర్ ఆటగాళ్లు దూరం కావడం ఆస్ట్రేలియా విజయావకాశాలను దెబ్బతీస్తుంది. అసలే గత రెండు ఎడిషన్లలో ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు లేదు. 2013, 2017 ఎడిషన్లలో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు.
పేలవ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన ఆస్ట్రేలియా, అనుభవం లేని జట్టుతో బరిలోకి దిగి ఏ మేరకు విజయాలు సాధిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుత ఎడిషన్‌లో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఆసీస్ సెలెక్టర్లు కీలక ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను ప్రకటించారు. బెన్ డ్వార్షుయిష్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్ కొత్తగా జట్టులోకి వచ్చారు. వీరికంతా అనుభవం అంతంతమాత్రమే.
బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. హర్షిత్ ఇటీవలే వన్డే అరంగ్రేటం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మహ్మద్ షమీ ఒక్కడే అనుభవజ్ఞుడు. అర్షదీప్ సింగ్ ఉన్నా, అతను ఆడింది కేవలం 8 వన్డేలే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో భారత్ మరో మార్పు చేసింది. యశస్వి జైస్వాల్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు.
ఆఫ్ఘనిస్తాన్‌నూ వదలని గాయాల సమస్య
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాల సమస్య ఆఫ్ఘనిస్తాన్‌ను కూడా వదల్లేదు. గాయం కారణంగా ఆ జట్టు స్పిన్ సంచలనం అల్లా ఘజన్‌ఫర్ మెగా టోర్నీకి దూరమయ్యాడు. 18 ఏళ్ల ఘజన్‌ఫర్ గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఘజన్‌ఫర్‌కు వెన్నుపూసలో పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీని కారణంగా ఘజన్‌ఫన్ నాలుగు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఘజన్‌ఫర్ ఐపీఎల్ 2025లో పాల్గొనేది కూడా అనుమానమే అని తెలుస్తుంది.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఘజన్‌ఫర్‌ను రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఘజన్‌ఫర్‌కు ప్రత్యామ్నాయంగా నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు.
కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.
ఈ టోర్నీలో ఆసీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు గ్రూప్-బిలో ఉండగా.. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment