పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ నజమ్ సేథీ రోజుకో మాట మారుస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఒప్పుకున్న వెంటనే కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసిన నజమ్ సేథీ తాజాగా వన్డే వరల్డ్‌కప్ ఆడడంపై ఒక ఆసక్తికర ప్రకటన చేశారు.
అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు అంతా సిద్దమవుతుంది. పీసీబీ ప్రతిపాదన మేరకు పాక్ జట్టు తాము ఆడాల్సిన మ్యాచ్‌ల్లో ఎక్కువ భాగం సౌత్‌లోనే ఆడాల్సి ఉండగా.. భారత్-పాక్ మ్యాచ్ మాత్రం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. అయితే తాజాగా నజమ్ సేథీ భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్‌కప్ ఆడుతామా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమంటూ పెద్ద బాంబ్ పేల్చారు.
ఆసియా కప్ విషయంలో బీసీసీఐ ఆవలంభించిన వైఖరిని ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు చేయనున్నట్లు సమాచారం. నిన్నటి ప్రెస్‌మీట్‌లో ఏసీసీకి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ''బీసీసీఐ పరిస్థితి అర్థమైందని.. వాళ్లు మా దేశంలో ఆడాలంటే ముందు వాళ్ల ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృశ్యా భారత్ పాక్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతించదు. అయితే మా పరిస్థితి కూడా ఇప్పుడు అదే. భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్‌కప్ ఆడాలంటే మా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే.
ఐసీసీకి ఇదే వివరించాం. మేము అనుకున్న వేదికల్లో అహ్మదాబాద్ లేదు. కానీ భారత్‌తో మ్యాచ్ అక్కడే జరగనుంది. అయితే అహ్మదాబాద్‌లో ఆడాలా వద్దా అనేది తర్వాత ఆలోచిస్తాం. ముందు వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాలి. అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. 2016లో భారత్ పాక్‌లో పర్యటించేందుకు ఆసక్తి చూపలేదు. కానీ అదే ఏడాది భారత్‌లో జరిగిన టి20 వరల్డ్‌కప్ ఆడేందుకు వెళ్లాం. అయితే ముందుగా అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిశాం.
ఆయన ఆడేందుకు అనుమతించడంతో ముందు మేము ఆడే మ్యాచ్ వేదికలను పరిశీలించడానికి ఒక స్పెషల్ టీం వెళ్లింది. కాగా అప్పట్లో మేము ఆడాల్సిన ఒక మ్యాచ్ వేదికను దర్శశాల నుంచి కోల్‌కతాకు మార్పించాం. ఆ తర్వాత భారత్‌కు పయనమయ్యాం. అందుకే ముందు వరల్డ్‌కప్ ఆడడంపై క్లియరెన్స్ రానివ్వండి.. అప్పుడు మేం ఆడాల్సిన వేదికలపై చర్చించుకుంటాం'' అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment