పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్ నజామ్ సేథీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌ను మా జట్టు బహిష్కరిస్తే పీసీబీ ఆదాయంలో మూడు అమెరికన్ మిలియన్ డాలర్లు(సుమారు రూ.25 కోట్ల రూపాయలు) నష్టపోతుందని తెలిపాడు. మేము చేసిన ప్రతిపాదనకు ఒకవేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అంగీకరించకుంటే ఆసియాకప్‌ను బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని.. దీనివల్ల కోట్ల రూపాయల నష్టం వచ్చినా భరించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపాడు.
''ఆసియా కప్ విషయంలో మా వైఖరి ఏంటో ఇప్పటికే ఏసీసీకి క్లియర్‌గా చెప్పాం. హైబ్రిడ్ మోడ్‌లో టోర్నీ నిర్వహించడంపై మాకు అభ్యంతరం లేదు. హైబ్రిడ్ మోడ్‌లో భారత్ తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఆడుకోవచ్చు.. మిగతా మ్యాచ్‌లు మాత్రం(ఫైనల్‌తో పాటు) పాక్‌లో జరిగేలా చూడాలని చెప్పాం. అయితే దీనివల్ల మేము ఆతిథ్య హక్కులు కోల్పోకుండా ఉంటాం. ఒకవేళ ఆసియా కప్‌కు మరో షెడ్యూల్‌ను ప్రకటిస్తే మేము ఒప్పుకోం. ఆసియా కప్‌ను బహిస్కరిస్తాం. ఇక దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. అయితే తమ దేశంలో ఆసియాకప్ ఆడడానికి భద్రతాపరమైన కారణాలు చూపిస్తున్న బీసీసీఐ ఒక విషయంలో క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
మా దేశంలో భద్రత కరువయ్యిందని వారు ప్రూఫ్స్ చూపిస్తే బాగుండు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి జట్లు మా దేశంలో ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పనప్పుడు.. భారత్ మాత్రం ఎందుకు ఈ కారణం చూపిస్తుందో అర్థం కావడం లేదు. అయితే ఏసీసీలో 80 శాతం ఆదాయం పాకిస్తాన్, భారత్‌ల మ్యాచ్‌ల వల్లే వస్తుంది.
ఒకవేళ మా ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించకపోతే వచ్చే నష్టాన్ని భరించడానికి సిద్దంగా ఉన్నాం'' అని పేర్కొన్నాడు. నజామ్ సేథీ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ''ఇంత మొండితనం పనికిరాదేమో.. నష్టం భరిస్తామనడం మంచి పద్దతి కాదు.. బీసీసీఐతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటే మంచిది'' అంటూ హితబోధ చేశారు.
చదవండి: ODI WC 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. హైదరాబాద్ స్టేడియానికి మహర్దశ
Comments
Please login to add a commentAdd a comment