ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆసియా దేశాలైన భారత్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇరగదీస్తున్నాయి. టెస్ట్ హోదా కలిగిన ఐదు దేశాల్లో ఒక్క పాక్ మినహా మిగతా నాలుగు దేశాలు అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. వీటిలో భారత్ తిరుగులేని శక్తిగా దూసుకుపోతుండగా.. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. భారత్ ప్రత్యర్ధి ఎవరైనా చీల్చిచెండాడుతుండగా.. మిగతా మూడు దేశాలు తమకంటే మెరుగైన ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి.
భారత్ విషయానికొస్తే.. శ్రీలంక చేతిలో ఇటీవల వన్డే సిరీస్‌లో పరాజయం మినహా టీమిండియా అపజయమనేదే ఎరుగదు. టీ20 వరల్డ్‌కప్‌లో జగజ్జేతగా అవతరించిన అనంతరం భారత్ ఎదుర్కొన్న తొలి సిరీస్ పరాజయం అది.
శ్రీలంక విషయానికొస్తే.. ఈ ద్వీప దేశం ఇటీవలికాలంలో మెరుగైన క్రికెట్ ఆడుతుంది. కొత్త కోచ్ సనత్ జయసూర్య ఆథ్వర్యంలో ఈ జట్టు సంచలన విజయాలు సాధిస్తుంది. భారత్‌పై మూడు మ్యాచ్ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
అనంతరం ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయినప్పటికీ.. చివరి టెస్ట్‌లో అబ్బురపడే విజయాన్ని సాధించింది. తాజాగా శ్రీలంక స్వదేశంలో న్యూజిలాండ్‌కు తొలి టెస్ట్‌లో షాకిచ్చింది. ఇవాళ (సెప్టెంబర్ 23) ముగిసిన మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ విషయానికొస్తే.. ఒకప్పటి క్రికెట్ పసికూన ఇప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ జట్టు 2023 వన్డే వరల్డ్‌కప్ నుంచి హేమీహేమీ జట్లన్నిటికీ షాకిస్తూ లెజెండ్ కిల్లర్‌గా మారింది. టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ వరకు చేరిన ఆఫ్ఘన్లు.. అక్కడ సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి తాజాగా ప్రతీకారం తీర్చుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది.
బంగ్లాదేశ్ విషయానికొస్తే.. తమదైన రోజున ఈ జట్టు ఆటగాళ్లను ఎంత మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. బంగ్లాదేశ్ ఇటీవల పాక్‌లో పర్యటించి ఆతిథ్య దేశాన్నే 2-0 తేడాతో (టెస్ట్ సిరీస్‌లో) మట్టికరిపించింది. తాజాగా బంగ్లాదేశ్ పటిష్టమైన టీమిండియా చేతిలో ఓడింది కాని, ప్రదర్శన ప్రకారం పర్వాలేదనిపించింది.
చదవండి: ఐదేసిన జయసూర్య.. న్యూజిలాండ్‌ను ఖంగుతినిపించిన శ్రీలంక
Comments
Please login to add a commentAdd a comment