స్వదేశంలో శ్రీలంక-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్-ఏ పేసర్లు చెలరేగిపోయారు. కషిఫ్ అలీ, ఖుర్రమ్ షెహజాద్ ఇద్దరు కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 115 పరుగులకే ఆలౌటైంది.
కషిఫ్ అలీ నాలుగో ఓవర్‌లో తొలి వికెట్ (ఒషాడో ఫెర్నాండో) పడగొట్టాడు. అనంతరం ఖుర్రమ్ షెహజాద్ అహాన్ విక్రమసింఘేను పెవిలియన్‌కు పంపాడు. కొత్త బంతితో చెలరేగిపోయిన కషిఫ్ 8వ ఓవర్‌లో ఉగ్రరూపం దాల్చాడు. ఈ ఓవర్‌లో అతను రెండు వికెట్లు (నిపున్ ధనంజయ, పవన్ రత్నాయకే) పడగొట్టాడు. దీంతో శ్రీలంక జట్టు 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆతర్వాత బరిలోకి దిగిన సోనల్ దినుష (110 బంతుల్లో 30), పసిందు సూరియబండార (84 బంతుల్లో 28) కొద్ది సేపు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరి పుణ్యమా అని శ్రీలంక 100 పరుగుల మార్కును దాటింది. నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించిన కషిఫ్ ఈ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఖుర్రమ్ షెహజాద్ నాలుగు వికెట్లు నేలకూల్చాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. పాక్ ఆదిలోనే కెప్టెన్ మొహమ్మద్ హురైరా వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కొద్ది సేపటికే అబ్దుల్ ఫసీ కూడా ఔటయ్యాడు. అలీ జర్యాబ్ 18 పరుగులతో.. మొహమ్మద్ సులేమాన్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. వాతావరణం అనూకూలించని కారణంగా తొలి రోజు కేవలం 57.1 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది.
కాగా, పాక్-ఏ, శ్రీలంక-ఏ జట్లు చివరి సారిగా ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఎదురెదురుపడ్డాయి. ఆ టోర్నీ సెమీఫైనల్లో శ్రీలంక పాక్‌ను మట్టికరిపించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులు చేయగా.. శ్రీలంక కేవలం 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అహాన్ విక్రమసింఘే (52), లహీరు ఉదారా (20 బంతుల్లో 43) శ్రీలంకను గెలిపించారు.
Comments
Please login to add a commentAdd a comment