
‘ఎగిసే అలలతో పోరాటం.. అమ్మాయిలకు సాధ్యమయ్యే పనేనా’ అనే చిన్నపాటి ఆలోచనలను కూడా దరిచేరనివ్వడం లేదు నవతరం. ఆకాశమే హద్దుగా నీటి మీదనే తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. క్లిష్టమైన సెయిలింగ్ క్రీడా పోటీలలో తమ సత్తా చాటుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ యువ సెయిలర్ల సాహసం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుంది.
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉండే పూతన మాన్య రెడ్డి మొదట స్కూల్ స్థాయిలో స్విమ్మింగ్ నేర్చుకుంది. స్విమ్మింగ్ పోటీలో పాల్గొంటూ సెయిలింగ్‌పై ఆసక్తి కలిగి, శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. సెయిలింగ్‌కి అనుకూలమైన వాతావరణం కోసం గోవా, మైసూర్..లలో ప్రాక్టీస్ చేసింది. సీనియర్లు ఉపయోగించే బోటుకు మారి, జాతీయ స్థాయిలో ఇప్పటికే 5 పతకాలు సొంతం చేసుకుంది. షిల్లాంగ్ నేషనల్ ర్యాంకింగ్ రెగెట్టా, తెలంగాణ జాతీయ జూనియర్ రెగెట్టాలోనూ కాంస్యాలను సాధించింది. థాయ్‌లాండ్, పోర్చుగల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నుంచిప్రాతినిధ్యం వహించింది. ఇటీవల మలేషియాలోని లంకాగ్వి అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని, బంగారు పతకాన్ని సాధించింది.
సాహసాలు చేసే శక్తిని ఇస్తుంది
ఈ క్రీడల్లో పాల్గొనడానికి చాలా శక్తి కావాలని, ఆరోగ్యసమస్యలు వస్తాయని, ఆడపిల్లలకు సరైనది కాదని చాలామంది నిరాశ పరిచారు. కానీ, సెయిలింగ్ ఎంత ఉత్సాహవంతమైన క్రీడనో, సాహసాన్ని ప్రదర్శించడమే కాదు సముద్రమంత ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుందని తెలిసింది. అంతేకాదు భవిష్యత్తు ఎంతో ఉత్తమంగా మార్చుకునే అవకాశాలనూ ఇస్తుంది. ఒలింపిక్స్ సెయిలింగ్ పోటీలో పాల్గొని పతకాలని సాధించేందుకు కృషి చేస్తున్నాను. ట్రైనింగ్, పోటీలు.. అంటూ నీళ్లతోనే మా సావాసం కాబట్టి అందుకు తగిన వ్యాయామం, సమతుల ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకుంటాను. లెవన్త్ గ్రేడ్ చదువుతున్నాను. వాయిలెన్ మరో ఇష్టమైన హాబీ, స్కూల్ ఎన్జీవోలో యాక్టివ్ మెంబర్‌ని.
– పూతన మాన్యరెడ్డి
నీళ్లు చూస్తే భయం వేసింది
నాలుగేళ్ల క్రితం మా స్కూల్లో ‘సెయిలింగ్‌లో శిక్షణ ఇస్తున్నార’ని చెబితే, ఆసక్తితో నా పేరు ఇచ్చాను. మొదట నీళ్లను చూస్తే భయం వేసింది. కానీ, ఒక్కసారి నీటిలో ప్రయాణించాక, మరోసారి పాల్గొనేలా ఆసక్తి కలిగింది. సెయిలింగ్ ఖర్చుతో కూడుకున్న క్రీడ. యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మాకు సపోర్ట్ చేస్తోంది. మా అమ్మ వంటలు చేస్తూ మమ్మల్ని చదివిస్తోంది. మా చదువుకు క్రీడలు కూడా తోడయితే మరిన్ని విజయాలు సాధించవచ్చు.. అని తెలుసుకున్నాం. అందుకే ధైర్యంగా నీటి అలలపై మమ్మల్ని మేం నిరూపించుకుంటున్నాం.
– కొమరవెల్లి దీక్షిత
అక్కను చూసి...
అక్కను చూసి నేనూ సెయిలింగ్ స్పోర్ట్స్‌లోకి వచ్చేశాను. అండర్–15 కేటగిరీలో పాల్గొంటున్నాను. మలేషియాలో జరిగిన సెయిలింగ్ పోటీలో వివిధ దేశాల నుంచి వచ్చిన 102 మంది సెయిలర్స్ పాల్గొన్నారు. ఒమన్‌లో జరిగిన పోటీలో రజత పతకం సాధించాను.
– కొమరవెల్లి లహరి
భారత్‌తో పాటు సౌత్‌కొరియాలలో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని స్వర్ణ, ర జిత పతకాలు సాధించిన ఈ అక్కాచెల్లెళ్లకు హైదరాబాద్‌లోని సెయిలింగ్ యాట్ క్లబ్ మద్దతునిస్తోంది.
హైదరాబాద్ ఈస్ట్‌మారేడ్‌పల్లిలో ఉంటున్న ప్రీతి కొంగర ఓపెన్ డిగ్రీ చేస్తూ సీనియర్ సెయిలింగ్ స్పోర్ట్స్‌లో సంచనాలు సృష్టిస్తోంది. చైనాలో జరిగిన ఏషియన్ క్రీడలో పాల్గొంది. హైదరాబాద్, ముంబైలలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో రజత, స్వర్ణ పతకాలు సాధించింది.
పేదరికం అడ్డుకాదు
‘11 ఏళ్ల వయసులో సెయిలింగ్‌లోకి అడుగుపెట్టాను. సెయిలింగ్ అనేది చాలా ఓర్పుతో కూడుకున్న క్రీడ. దీనికి ఫిట్‌నెస్ చాలా అవసరం. ట్రైనింగ్‌లో భాగంగా రోజూ 4–5 గంటలుప్రాక్టీస్ చేస్తాను. ఈ క్రీడలో అబ్బాయిలు ఎంత కష్టపడాలో, అమ్మాయిలూ అంత కష్టపడాల్సిందే. అన్ని స్పోర్ట్స్ కన్నా ఇది చాలా భిన్నమైంది. సవాల్‌తో కూడుకున్నది. అందుకే సెయిలింగ్‌ని ఎంచుకున్నాను. ఏప్రిల్‌లో జరగబోయే ఒలింపిక్ సెయిలింగ్‌లో పాల్గొనడానికి శిక్షణ తీసుకుంటున్నాను.
– ప్రీతి కొంగర
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment