Hyderabad women
-
మిసెస్ గ్లోబల్ షో టాపర్‌గా చైతన్య
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన చైతన్య పోలోజు ప్రతిష్టాత్మకమైన మిసెస్ గ్లోబల్ షో టాపర్–2020గా నిలిచారు. అమెరికాలో వర్చువల్‌గా నిర్వహించిన మిసెస్ గ్లోబల్ షో పోటీల్లో తెలంగాణకు చెందిన ఎన్నారై మహిళ చైతన్య ఈ కిరీటాన్ని అందుకున్నారు. 2019లో జరిగిన మిసెస్ భారత్ న్యూయార్క్ పోటీల్లోనూ ఆమె విజేతగా నిలిచారు. ప్రస్తుతం ప్రపంచ తెలుగు కల్చరల్ ఫెస్టివల్‌కు ఆమె అందాల సుందరి కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. మై డ్రీం గ్లోబల్ ఫౌండేషన్ వర్జీనియా చాప్టర్ కో ఆర్డినేటర్‌గానూ సేవలందజేస్తున్నారు. టాటా వారి “తారల ఇంట్లో సందడి’ షోలో స్పెషల్ గెస్ట్‌గా, జ్యూరీగానూ వ్యవహరించారు. బంజారా మహిళా ఎన్జీవో వంటి సంస్థలతో కలిసి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
జన్మ చరితార్థం
భయంలో ఉన్న వారికి ధైర్యం చెప్పాలి. కష్టాల్లో ఉన్న వారికి సాయం చెయ్యాలి. ఉపాధి లేని వారికి ఓ దారి చూపించాలి. ఇదీ.. చరితారెడ్డి ధ్యేయం.. లక్ష్యం.. గమ్యం. అయితే.. అవేవీ నెరవేరకుండానే.. కలల రెక్కలతో యూఎస్ వెళ్లిన చరిత.. కన్నీటి చెక్కపెట్టెలో ఇండియాకు చేరింది. ఆదివారం ఆమె మృతదేహం ఇంటికి చేరుకోడానికి కొన్ని గంటల ముందు ‘సాక్షి’ ఆమె తల్లిదండ్రులతో మాట్లాడింది. సికింద్రాబాద్ నేరేడ్మెట్ రేణుకానగర్‌లోని ఆ ఇంటి ముందుకు వెళ్లగానే తెలియని ఉద్విగ్నత మనసును కమ్మేసింది. ఆ ఇంటి సభ్యులను పలకరించినప్పుడు, తీరని విషాదాన్ని దిగమింగుకోడానికి వారు చేస్తున్న ప్రయత్నం గుండెను చెమ్మగిల్లేలా చేసింది. కిందటి నెల 27వ తేదీన అమెరికాలోని మిచిగావ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎల్ల చరితారెడ్డి అమ్మానాన్నల ఇల్లు అది. ఇప్పుడా ఇంటిలో చరిత లేదు. చరిత జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. చరిత చుట్టూ బలంగా అల్లుకుని ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా ఆ కుటుంబాన్ని అడిగి తెలుసుకోవడం కాస్త కష్టమైన పనే అయింది. ‘ప్రపంచమంతా తెలియాలనేది’ ‘‘గూగుల్ సెర్చ్‌లో చరితారెడ్డి అని వెతికితే ప్రపంచమంతా తెలిసిపోవాలమ్మా. అంతటి ఉన్నత స్థాయికి చేరుకోవాలి’ అనేది చరిత. ఇప్పుడిలా అవయవదానంతో ప్రపంచమంతా తెలిసేలా నిలిచింది’’... దుఃఖాన్ని ఆపుకుంటూ కూతురి గురించి తల్లి శోభ చెప్పిన మొదటి మాట ఇది. చరిత ఆ ఇంటికి పెద్ద కూతురు. పాతికేళ్ల వయసు. సాఫ్ట్వేర్ రంగంలో ఎదగాలనే కలలను రెక్కలుగా కట్టుకొని అమెరికా చేరుకుంది. కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేసి, తర్వాత ఇండియా వచ్చి స్థిరపడాలని ఆమె ఆలోచన. కూతురికి ఘనంగా పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేయాలని ఆ తల్లిదండ్రులూ కలలు కన్నారు. ఇంతలోనే ఊహించని ఉత్పాతం. ‘‘కూతుళ్లకు అమ్మలు ఫ్రెండ్‌లా ఉండాలంటారు. కానీ, నా కూతురు తన చిన్నప్పటి నుంచీ నాకో మంచి ఫ్రెండ్‌లా ఉండేది. స్కూల్లో, కాలేజీలో జరిగిన విషయాలు, స్నేహితుల ముచ్చట్లు అన్నీ నాతో చెప్పేది. చాలా చురుకు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెబితే.. ‘అమ్మా.. మార్కులు ఎక్కువ స్కోర్ చేయడం కాదు.. నాలెడ్జ్‌ని స్కోర్ చేయాలి’ అనేది. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. బిజినెస్ బుక్క్ ఎక్కువగా చదువుతుండేది. ఏ పని చేసినా తనకో ప్లానింగ్ ఉంటుంది. దేనికీ హడావిడి పడదు. మర్చిపోయాను అనే మాటే ఉండదు. చరిత చేతి రాత అందంగా ఉంటుంది. కానీ ఆ దేవుడు రాసిన రాతే...’’ అంటూ ఆగి, ‘‘మూడేళ్లయ్యింది చరిత అమెరికా వెళ్లి. ఇండియా వచ్చాక పదిమందికి ఉపాధి కల్పించాలని అనుకుంది..’’ అని చెప్పారు చరిత తల్లి. ‘మల్లారెడ్డిగారూ.. అనేది’ ‘‘ఇప్పుడు నన్ను మల్లారెడ్డిగారూ.. అని పిలవడానికి నా మనవరాలు లేదు. కానీ, తను అలా పిలుస్తున్నట్టుగానే ఉంది’’ అంటూ చరితారెడ్డి తాత మల్లారెడ్డి మనవరాలిని తలుచుకున్నారు. ‘‘ఊహ తెలిసినప్పటి నుంచే నా మనవరాలు నన్ను తాతా అని కాకుండా మల్లారెడ్డి గారూ.. అని పిలిచేది. నాకూ అలాగే నచ్చేది. ఇంట్లో ఉన్నంత సేపు నాతో ఉండేది. రాత్రి భోజనం సమయంలో నేను తినే వరకు తను తినేది కాదు. మాట వరసకు ఎవరినైనా నేను ఏమైనా అంటే ‘ఎవరినీ ఏమి అనొద్దు మల్లారెడ్డిగారూ.. ఎవరి పరిస్థితులు ఎలాంటివో..’ అని ఆరిందాలా చెప్పేది. అమెరికాకు వెళ్లిన తరువాత ఎప్పుడు ఫోన్ చేసినా ‘మల్లారెడ్డి గారూ ఎలా ఉన్నారు... ఆరోగ్యం ఎలా ఉంది’ అని ఆడిగాకే, మిగతా విషయాలు మాట్లాడేది. ప్రమాదానికి మూడు రోజుల ముందు నాకు చేతి గడియారం పంపించింది. (చేతికున్న వాచీని తడుముకుంటూ..). ఇంట్లోనే కాదు వీధులు కూడా శుభ్రంగా ఉండాలి తనకు. రోడ్ల మీద ఎక్కడైనా చిత్తు కాగితాలు కనిపిస్తే వాటిని తీసి చెత్త కుండీల్లో వేసి వచ్చేది. వీధిలో కుండీ కనిపించకపోతే వాటిని ఇంటికి తీసుకువచ్చి డస్ట్‌బిన్‌లో వేసేది. మా అమ్మనే మళ్లీ పుట్టింది అనిపించేది నాకు’’ అన్నారు మల్లారెడ్డి. ఏకపాత్రాభినయం ‘‘చిన్నప్పటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడేది. ధైర్యంగా ఉండేది. నాయకత్వ లక్షణాలు బాగా ఎక్కువ...’’ అంటూ కూతుర్ని గుర్తుచేసుకున్నారు చంద్రారెడ్డి. ‘‘తనకు ఆర్ట్స్ అంటే బాగా ఇష్టం. స్కూల్ రోజుల్లో వాస్కోడిగామ ఏకపాత్రాభినయనం చేసి అందరినీ మెప్పించింది. కాలేజీలో ఏ సాంస్కృతిక కార్యక్రమం అయినా చరిత పర్యవేక్షణలో జరిగేది. తను ఇండియా వచ్చేలోగా మంచి సంబంధం చూడాలని ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఇంతలోనే ఇలా జరిగింది’’ అన్నారు చరిత తండ్రి చంద్రారెడ్డి. చరిత గురించి ఒక్కో విషయం తెలుస్తుంటే చరితతో ఆ ఇల్లు ఎంతగా పెనవేసుకుని పోయిందో అర్ధమైంది. ఎదుటివారు కష్టాల్లో ఉంటే సాయం చేయాలనే గుణం వల్లనే.. చివరికామెకు తను చనిపోతున్నా మరి కొన్ని ప్రాణాలను నిలబట్టే అవకాశం వచ్చిందేమో! – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫ్యామిలీ – తునికి జానకిరామ్, ‘సాక్షి’, నేరేడ్మెట్ తొమ్మిది మంది చరితలు అమెరికాలో కారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడే అవయవ (గుండె) దానానికి చరిత సంతకం చేసింది. రోడ్డు ప్రమాదం తరువాత గుండెతో పాటు ఇతర ఆర్గాన్స్ కూడా బాగున్నాయని అమెరికా వైద్యులు చెప్పారు. గుండె కవాటాలు (నలుగురికి), మూత్రపిండాలు (ఇద్దరికి), నేత్రాలు (ఇద్దరికి), కాలేయం (ఒకరికి) .. ఇలా చావుబతుకుల మధ్య ఉన్న తొమ్మిదికి అవయవదానం చేయడానికి అంగీకరించాం. మా కుటుంబంలో చరిత ఇప్పుడు ఆ తొమ్మిది మందిగా చేరిపోయింది. – శోభ, చరిత తల్లి ‘చరితకు చెప్తాం జాగ్రత్త!’ అనేవారు ‘మనం బాగున్నాం కదా నాన్నా. మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుండాలి. అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేస్తాను’ అని చిన్న వయసు నుంచే చరిత చెబుతుండేది. కాలేజీలో తోటి ఆడపిల్లల్ని ఎవరైనా అబ్బాయిలు ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే ధైర్యంగా వెళ్లి వారిని మందలించేది. ‘మమ్మల్ని ఏమైనా అంటే చరితతో చెబుతాం జాగ్రత్త’ అని తోటి విద్యార్థినులు కూడా ఆకతాయిలను బెదిరించేవారట. వాళ్లు కలిసినప్పుడు చరిత గురించి గొప్పగా చెప్పేవారు. – చంద్రారెడ్డి, చరిత తండ్రి ‘ఇండియాకు వచ్చాక బిజినెస్ చేద్దాం’ అంది త్వరలోనే ఇండియాకు వస్తానని.. వచ్చిన తరువాత ఇద్దరం కలిసి మంచి బిజినెస్ చేద్దామని అక్క చెప్పింది. నాకు ఏ సబ్జెక్టులో డౌట్స్ ఉన్నా అక్కే తీర్చేది. అక్కకు గ్లాస్, చిన్నకుండీలపై డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. కాస్త టైమ్ దొరికినా పెయింటింగ్ చేసేది. చదువుతూ కూర్చుందంటే టైమ్ చూసుకునేది కాదు. తెల్లార్లూ కూర్చోనేది. కిందటి నెల 25న ఫ్రెండ్స్‌తో కలిసి బైక్ మీద లాంగ్‌డ్రైవ్‌కు బెంగళూరుకు వెళతానని అక్కతో చెబితే వద్దంది. అక్క చెప్పినట్టే లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లలేదు. ఎప్పుడూ నాకు జాగ్రత్తలు చెబుతూనే ఉండేది. – యశ్వంత్‌రెడ్డి, సోదరుడు -
నగరవాసికి అందాల కిరీటం
సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలో ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మిసెస్ భారత్ పోటీలలో ఈ సంవత్సరానికి గాను తెలుగు మహిళ చైతన్య పోలోజు ఈ కిరీటాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని విజేత సంబంధీకులు ఓ ప్రకటనలో తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 21న ఈ పోటీ జరిగింది. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ మహిళ, పెళ్లికి మాత్రమే పరిమితమనే ఆలోచనను అందరిలో దూరం చేయడమే తన ధ్యేయమని, తన ఆశయాల సాధనలో తండ్రి ఆంజనేయులు భర్త సాయిరాం తోడవుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీలో మొదటి రన్నర్ అప్ గా కిస్మత్ బైన్స్ చాహల్, రెండవ రన్నర్ అప్ గా సీమ సింగ్ గెలుపొందగా, ప్రముఖ బాలీవుడ్ నటి షమిత శెట్టి ముఖ్య అతిథిగా, మై డ్రీం ఎంటర్ టైన్మెం రష్మి బేడి – జనక్ బేడిలు తదితరులు పాల్గొన్నారు. -
ఇదేంటి ‘నామా’?
సాక్షి, ఖమ్మం: టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ హైదరాబాద్‌కు చెందిన సుజాత అనే మహిళ ఆరోపించారు. తనపై లేనిపోని విషయాలు గుప్పించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు గురువారం ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనను చంపుతానని బెదిరించడంతో గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఈ కేసు గురించి అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదని, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలను తహశీల్దార్‌కు ఆమె సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నామా నాగేశ్వరరావు మా ఇంటికి వచ్చి నన్ను కొట్టాడు. చంపుతానని బెదిరించాడు. నగ్న చిత్రాలను బయట పెడతానంటూ బ్లాక్మెయిల్ చేశార’ని ఆమె వాపోయారు. కాగా, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదుపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. -
హైదరాబాద్ యువతిపై కీచకపర్వం
చెన్నై: హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని ఆటోడ్రైవర్ అటకాయించి, అసభ్యంగా ప్రవర్తించిన తీరు స్థానికంగా కలకలం రేపింది. పుదుచ్చేరిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువతులు చెన్నైలోని ఓ ఎలక్ట్రానిక్స్ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ ముగ్గురూ విహాయాత్ర కోసమని పుదుచ్చేరి వెళ్లారు. అక్కడ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకుని, పలు ప్రాంతాలను తిలకించారు. ఆదివారం రాత్రి వారు అన్నాసాలై ప్రాంతంలో నిలబడి మాట్లాడుకుంటుండగా.. ఆ పక్కగా నిలబడి ఉన్న ఆటో డ్రైవర్ హఠాత్తుగా ఓ యువతిని అటకాయించి, కౌగిలించుకుని ముద్దుపెట్టాడు. కీచకుడి చర్యతో నిర్ఘాంతపోయిన యువతులు కేకలు వేశారు. ఈలోపు ఆ యువకుడు ఆటోలో తప్పించుకుని పారిపోయాడు. ఆటో నంబర్‌ను నోట్ చేసుకున్న యువతులు సరాసరి ఒదియంజాలై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆటో నంబరు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. సోమవారం ఉదయం పుదుచ్చేరిలోని చిన్నయాపురం అక్కాస్వామి కోవిల్ వీధికి చెందిన స్టాలిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మద్యం మత్తులోనే తానా పని చేసినట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు స్టాలిన్‌ను అరెస్టు చేసి, ఆటో స్వాధీనం చేసుకున్నారు. -
కష్టాల్లో హైదరాబాద్ ఆడపడుచు
హైదరాబాద్: బతుకుదెరువుకు పరాయిదేశం వెళ్లి కష్టాల్లో ఇరుక్కుంది హైదరాబాద్ మహిళ. ఏజెంటు చేసిన మోసానికి యజమాని చేతిలో మానసిక, శారీరక హింసలను ఎదుర్కోంటోంది. సాల్మాబేగం(39) హైదరాబాదులోని బాబానగర్‌లో ఉంటోంది. బ్రతుకుదెరువుకోసం ఇద్దరు ఏజెంట్లు అక్రమ్, షఫీ ద్వారా సౌదీ అరేబియాలోని షేక్ ఇంట్లో పనిమనిషిగా ఈఏడాది జనవరి నెలలో వెళ్లింది. అక్కడకు వెళ్లనప్పటి నుంచి యజమాని చేతిలో చిత్ర హింసలు అనుభవిస్తోంది. దీంతో తిరిగి ఇండియాకు రావాలని ప్రయత్నిస్తే అందుకు యజమాని అంగీకరించట్లేదు. దీంతో ఏజెంట్లు మోసం చేశారని గ్రహించిన సాల్మా తన కూతురు షమీనాకు వాయిస్ మెస్సేజ్ చేసింది. యజమాని తను చిత్ర హింసలు పెడుతున్నాడని తిరిగి ఇంటికి రానివ్వట్లేదని కూతురు షమీనాకు తెలియచేసింది. దీనిపై ఆమె కూతురు వీసా ఇచ్చిన ఏజెంటు దగ్గరకు వెళ్లి తన తల్లిని ఇండియాకు తిరగి రప్పించాలని బ్రతిమాలినా ఫలితం లేదు. వీరిపై కాంచన్‌బాగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని షమీనా వాపోయింది. ఏజెంట్లు తన తల్లిని మూడు లక్షలకు అమ్మేశారని షమీనా తెలిపింది. కాంట్రాక్టు పెళ్లికి అంగీకరించలేదని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఏజెంట్లపై పోలీసులకు పలు సార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ వారిపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించింది. తన తల్లిని వెనక్కి తీసుకురావడానికి శాయశక్తులా పోరాడతానని షమీనా తెలిపారు. తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తన తల్లిని విడిపించాలని కోరింది. గల్ఫ్ కార్పోరేషన్ కౌన్సిల్ (జీసీసీ) లోని దేశాల్లో కఫిల్ విధానం అమలులో ఉంది. దీనికింద ఇంట్లో పనిమనుషులను యజమానులు ఇతర దేశాలనుంచి పిలిపించుకునే సదుపాయం ఆదేశాల ప్రజలకు ఉంది. అక్కడ ఇతర దేశాల వారు శాశ్వతంగా ఉండటానికి వీలు లేదు. -
పాక్ భర్త నుంచి విడిపించాలి..
హైదరాబాద్: భర్త పెట్టే హింసను భరిస్తూ పాకిస్తాన్లో నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన ఓ మహిళను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ పాక్‌లోని భారత హైకమిషనర్ గౌతం బొంబావాలాను కోరారు. గురువారం ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో వెల్లడించారు. నగరంలోని బండ్లగూడకు చెందిన మహమ్మది బేగం(44)కు లాహోర్‌కు చెందిన మహ్మద్ యూనిస్(60)తో 1996లో వివాహమయింది. తను పాకిస్తాన్ వాసి అనే విషయాన్ని దాచిపెట్టి..ఒమన్ దేశస్థుడి నంటూ పెళ్లి ఫోన్ ద్వారా నిఖా చేసుకున్నాడు. అనంతరం వారు మస్కట్‌లో కాపురం పెట్టారు. మెకానిక్‌గా పనిచేసే యూనిస్ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగాక తాను పాకిస్తాన్ పౌరుడిననే అసలు నిజాన్ని వెల్లడించాడు. అప్పటికే అతడి ఉద్యోగం పోవడంతో లాహోర్‌కు మకాం మార్చాడు. భార్యను తీవ్ర హింసకు గురిచేస్తున్న యూనిస్, ఆమె ఇండియా పాస్‌పోర్టును కూడా రెన్యువల్ చేయించలేదు. ఆమె హైదరాబాద్‌లోని పుట్టింటికి 2012లో వచ్చి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రికి ఫోన్ చేసి తనను భర్త చెర నుంచి విడిపించాలని వేడుకుంది. ఆమె తండ్రి మహ్మద్ అక్బర్ స్థానికంగా సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆయన తన కుమార్తె పడుతున్న కష్టాలపై ఈ ఏడాది జనవరిలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు ఒక మెయిల్ పంపారు. ఇదే విషయాన్ని స్థానిక ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్ ఖలిద్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సుష్మా భారత హైకమిషన్ అధికారులతో మాట్లాడారు. మహమ్మది బేగంను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. I have asked for a report from Indian High Commissioner in Pakistan. pic.twitter.com/IvsYNGA7LX @amjedmbt — Sushma Swaraj (@SushmaSwaraj) 16 March 2017