జన్మ చరితార్థం | Hyderabad Woman Killed In USA In A Road Accident | Sakshi
Sakshi News home page

జన్మ చరితార్థం

Published Mon, Jan 6 2020 1:04 AM | Last Updated on Mon, Jan 6 2020 1:04 AM

Hyderabad Woman Killed In USA In A Road Accident - Sakshi

భయంలో ఉన్న వారికి ధైర్యం చెప్పాలి. కష్టాల్లో ఉన్న వారికి సాయం చెయ్యాలి. ఉపాధి లేని వారికి ఓ దారి చూపించాలి. ఇదీ.. చరితారెడ్డి ధ్యేయం.. లక్ష్యం.. గమ్యం. అయితే.. అవేవీ నెరవేరకుండానే.. కలల రెక్కలతో యూఎస్‌ వెళ్లిన చరిత.. కన్నీటి చెక్కపెట్టెలో ఇండియాకు చేరింది. ఆదివారం ఆమె మృతదేహం ఇంటికి చేరుకోడానికి కొన్ని గంటల ముందు ‘సాక్షి’ ఆమె తల్లిదండ్రులతో మాట్లాడింది.

సికింద్రాబాద్‌ నేరేడ్‌మెట్‌ రేణుకానగర్‌లోని ఆ ఇంటి ముందుకు వెళ్లగానే తెలియని ఉద్విగ్నత మనసును కమ్మేసింది. ఆ ఇంటి సభ్యులను పలకరించినప్పుడు, తీరని విషాదాన్ని దిగమింగుకోడానికి వారు చేస్తున్న ప్రయత్నం గుండెను చెమ్మగిల్లేలా చేసింది. కిందటి నెల 27వ తేదీన అమెరికాలోని మిచిగావ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఎల్ల చరితారెడ్డి అమ్మానాన్నల ఇల్లు అది. ఇప్పుడా ఇంటిలో చరిత లేదు. చరిత జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. చరిత చుట్టూ బలంగా అల్లుకుని ఉన్న అనుబంధాన్ని  జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా ఆ కుటుంబాన్ని అడిగి తెలుసుకోవడం కాస్త కష్టమైన పనే అయింది.  

‘ప్రపంచమంతా తెలియాలనేది’
‘‘గూగుల్‌ సెర్చ్‌లో చరితారెడ్డి అని వెతికితే ప్రపంచమంతా తెలిసిపోవాలమ్మా. అంతటి ఉన్నత స్థాయికి చేరుకోవాలి’ అనేది చరిత. ఇప్పుడిలా అవయవదానంతో ప్రపంచమంతా తెలిసేలా నిలిచింది’’... దుఃఖాన్ని ఆపుకుంటూ కూతురి గురించి తల్లి శోభ చెప్పిన మొదటి మాట ఇది. చరిత ఆ ఇంటికి పెద్ద కూతురు. పాతికేళ్ల వయసు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎదగాలనే కలలను రెక్కలుగా కట్టుకొని అమెరికా చేరుకుంది. కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేసి, తర్వాత ఇండియా వచ్చి స్థిరపడాలని ఆమె ఆలోచన. కూతురికి ఘనంగా పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేయాలని ఆ తల్లిదండ్రులూ కలలు కన్నారు.  ఇంతలోనే ఊహించని ఉత్పాతం.
‘‘కూతుళ్లకు అమ్మలు ఫ్రెండ్‌లా ఉండాలంటారు.

కానీ, నా కూతురు తన చిన్నప్పటి నుంచీ నాకో మంచి ఫ్రెండ్‌లా ఉండేది. స్కూల్‌లో, కాలేజీలో జరిగిన విషయాలు, స్నేహితుల ముచ్చట్లు అన్నీ నాతో చెప్పేది. చాలా చురుకు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెబితే.. ‘అమ్మా.. మార్కులు ఎక్కువ స్కోర్‌ చేయడం కాదు.. నాలెడ్జ్‌ని స్కోర్‌ చేయాలి’ అనేది. ఇంగ్లీష్‌ బాగా మాట్లాడుతుంది. బిజినెస్‌ బుక్క్‌ ఎక్కువగా చదువుతుండేది. ఏ పని చేసినా తనకో ప్లానింగ్‌ ఉంటుంది. దేనికీ హడావిడి పడదు. మర్చిపోయాను అనే మాటే ఉండదు.   చరిత చేతి రాత అందంగా ఉంటుంది. కానీ ఆ దేవుడు రాసిన రాతే...’’ అంటూ ఆగి, ‘‘మూడేళ్లయ్యింది చరిత అమెరికా వెళ్లి. ఇండియా వచ్చాక పదిమందికి ఉపాధి కల్పించాలని అనుకుంది..’’ అని చెప్పారు చరిత తల్లి.

‘మల్లారెడ్డిగారూ.. అనేది’
‘‘ఇప్పుడు నన్ను మల్లారెడ్డిగారూ.. అని పిలవడానికి నా మనవరాలు లేదు. కానీ, తను అలా పిలుస్తున్నట్టుగానే ఉంది’’ అంటూ  చరితారెడ్డి తాత మల్లారెడ్డి మనవరాలిని తలుచుకున్నారు. ‘‘ఊహ తెలిసినప్పటి నుంచే నా మనవరాలు నన్ను తాతా అని కాకుండా మల్లారెడ్డి గారూ.. అని పిలిచేది. నాకూ అలాగే నచ్చేది. ఇంట్లో ఉన్నంత సేపు నాతో ఉండేది. రాత్రి భోజనం సమయంలో నేను తినే వరకు తను తినేది కాదు. మాట వరసకు ఎవరినైనా నేను ఏమైనా అంటే ‘ఎవరినీ ఏమి అనొద్దు మల్లారెడ్డిగారూ.. ఎవరి పరిస్థితులు ఎలాంటివో..’ అని ఆరిందాలా చెప్పేది.

అమెరికాకు వెళ్లిన తరువాత ఎప్పుడు ఫోన్‌ చేసినా ‘మల్లారెడ్డి గారూ ఎలా ఉన్నారు... ఆరోగ్యం ఎలా ఉంది’ అని ఆడిగాకే, మిగతా విషయాలు మాట్లాడేది. ప్రమాదానికి మూడు రోజుల ముందు నాకు చేతి గడియారం పంపించింది. (చేతికున్న వాచీని తడుముకుంటూ..). ఇంట్లోనే కాదు వీధులు కూడా శుభ్రంగా ఉండాలి తనకు. రోడ్ల మీద ఎక్కడైనా చిత్తు కాగితాలు కనిపిస్తే వాటిని తీసి చెత్త కుండీల్లో వేసి వచ్చేది. వీధిలో కుండీ కనిపించకపోతే వాటిని ఇంటికి తీసుకువచ్చి డస్ట్‌బిన్‌లో వేసేది. మా అమ్మనే మళ్లీ పుట్టింది అనిపించేది నాకు’’ అన్నారు మల్లారెడ్డి.

ఏకపాత్రాభినయం
‘‘చిన్నప్పటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడేది. ధైర్యంగా ఉండేది. నాయకత్వ లక్షణాలు బాగా ఎక్కువ...’’ అంటూ కూతుర్ని గుర్తుచేసుకున్నారు చంద్రారెడ్డి. ‘‘తనకు ఆర్ట్స్‌ అంటే బాగా ఇష్టం. స్కూల్‌ రోజుల్లో వాస్కోడిగామ ఏకపాత్రాభినయనం చేసి అందరినీ మెప్పించింది. కాలేజీలో ఏ సాంస్కృతిక కార్యక్రమం అయినా చరిత పర్యవేక్షణలో జరిగేది. తను ఇండియా వచ్చేలోగా మంచి సంబంధం చూడాలని ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఇంతలోనే ఇలా జరిగింది’’ అన్నారు చరిత తండ్రి చంద్రారెడ్డి. చరిత గురించి ఒక్కో విషయం తెలుస్తుంటే చరితతో ఆ ఇల్లు ఎంతగా పెనవేసుకుని పోయిందో అర్ధమైంది. ఎదుటివారు కష్టాల్లో ఉంటే సాయం చేయాలనే గుణం వల్లనే.. చివరికామెకు తను చనిపోతున్నా మరి కొన్ని ప్రాణాలను నిలబట్టే అవకాశం వచ్చిందేమో!
– నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫ్యామిలీ
– తునికి జానకిరామ్, ‘సాక్షి’, నేరేడ్‌మెట్‌

తొమ్మిది మంది చరితలు
అమెరికాలో కారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నప్పుడే అవయవ (గుండె) దానానికి చరిత సంతకం చేసింది. రోడ్డు ప్రమాదం తరువాత గుండెతో పాటు ఇతర ఆర్గాన్స్‌ కూడా బాగున్నాయని అమెరికా వైద్యులు చెప్పారు. గుండె కవాటాలు (నలుగురికి), మూత్రపిండాలు (ఇద్దరికి), నేత్రాలు (ఇద్దరికి), కాలేయం (ఒకరికి) .. ఇలా చావుబతుకుల మధ్య ఉన్న తొమ్మిదికి అవయవదానం చేయడానికి అంగీకరించాం. మా కుటుంబంలో చరిత ఇప్పుడు ఆ తొమ్మిది మందిగా చేరిపోయింది.  
– శోభ, చరిత తల్లి

‘చరితకు చెప్తాం జాగ్రత్త!’ అనేవారు
‘మనం బాగున్నాం కదా నాన్నా. మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుండాలి. అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేస్తాను’ అని చిన్న వయసు నుంచే చరిత చెబుతుండేది. కాలేజీలో తోటి ఆడపిల్లల్ని ఎవరైనా అబ్బాయిలు ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే ధైర్యంగా వెళ్లి వారిని మందలించేది. ‘మమ్మల్ని ఏమైనా అంటే చరితతో చెబుతాం జాగ్రత్త’ అని తోటి విద్యార్థినులు కూడా ఆకతాయిలను బెదిరించేవారట. వాళ్లు కలిసినప్పుడు చరిత గురించి గొప్పగా చెప్పేవారు.
– చంద్రారెడ్డి, చరిత తండ్రి

‘ఇండియాకు వచ్చాక బిజినెస్‌ చేద్దాం’ అంది
త్వరలోనే ఇండియాకు వస్తానని.. వచ్చిన తరువాత ఇద్దరం కలిసి మంచి బిజినెస్‌ చేద్దామని అక్క చెప్పింది. నాకు ఏ సబ్జెక్టులో డౌట్స్‌ ఉన్నా అక్కే తీర్చేది. అక్కకు గ్లాస్, చిన్నకుండీలపై డ్రాయింగ్‌ వేయడం అంటే చాలా ఇష్టం. కాస్త టైమ్‌ దొరికినా పెయింటింగ్‌ చేసేది. చదువుతూ కూర్చుందంటే టైమ్‌ చూసుకునేది కాదు. తెల్లార్లూ కూర్చోనేది. కిందటి నెల 25న ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌ మీద లాంగ్‌డ్రైవ్‌కు బెంగళూరుకు వెళతానని అక్కతో చెబితే వద్దంది. అక్క చెప్పినట్టే లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లలేదు. ఎప్పుడూ నాకు జాగ్రత్తలు చెబుతూనే ఉండేది.
– యశ్వంత్‌రెడ్డి, సోదరుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement