![Experts Warn Increase In Deadly Vehicle Crashes During Solar Eclipse - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/8/solareclipse.jpg.webp?itok=-tf2m1My)
వాషింగ్టన్: సూర్యగ్రహణం వేళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అమెరికన్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం(ఏప్రిల్ 8) ఉదయం ఉత్తర అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 2017 సూర్యగ్రహణంతో పోలిస్తే ఈ గ్రహణ సమయంలో ఘోర రోడ్డు ప్రమాదాలు 31 శాతం దాకా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీనికి కారణం 2017లో గ్రహణం పూర్తిగా కనిపించే(ద పాత్ ఆఫ్ టొటాలిటీ) 70 మైళ్ల విస్తీర్ణం. ఈ విస్తీర్ణంలోని ప్రాంతాలకు గ్రహణాన్ని చూసేందుకు వచ్చిన వారితో కోటి 20 లక్షల మంది జన సాంద్రత ఏర్పడిందని, సోమవారం ఏర్పడే గ్రహణం 115 మైళ్ల విస్తీర్ణంలో పూర్తిగా కనిపించనుండగా మొత్తం 31.6 మిలియన్ల మంది ఈ విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు వచ్చి దీనిని చూస్తారని నాసా అంచనా వేసింది.
అయితే గ్రహణం పూర్తిగా ఉన్న సమయంలో దానిని చూసేందుకు ఎక్కడి వారు అక్కడే ఆగి పోవడంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గ్రహణానికి ముందు అది పూర్తిగా కనిపించే ప్రాంతాలకు చేరుకోవడానికి, గ్రహణం తర్వాత సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
దీంతో ఈ సమయంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి 25 నిమిషాలకు సగటున ఒక ప్రమాదం జరుగుతుండగా, ప్రతి 95 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు గత అనుభవాలు చెబుతున్నాయి. 2017 సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కేవలం మూడు పెద్ద నగరాలకు మూడు గంటల దూరంలో పూర్తిగా కనిపించగా ప్రస్తుత సూర్య గ్రహణం కెనడాలోని టొరంటో సహా ఎనిమిది పెద్ద నగరాలకు 3 గంటల ప్రయాణ దూరంలో పూర్తిగా కనిపించనుంది. దీంతో దీనిని వీక్షించేందుకు అబ్జర్వేటరీలకు వెళ్లడానికి రోడ్డెక్కేవారి సంఖ్య భారీగా పెరగనుంది.
కాగా, సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని మెక్సికో, అమెరికా, కెనడాల మీద ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో గ్రహణం ప్రభావాన్ని బట్టి పూర్తిగా చీకటి కమ్ముకోనుంది. అయితే భారత్‌లో దీని ప్రభావం లేదు. భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి మంగళవారం తెల్లవారుజామున 2.22గంటల వరకు గ్రహణం ఉంటుంది.
ఇదీ చదవండి.. నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏయే రాశులకు ఏం జరుగుతుందంటే..
Comments
Please login to add a commentAdd a comment