(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) : నిత్యం రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో నిండు ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. మితివీురిన వేగం, నిద్ర మత్తు లాంటి మానవ తప్పిదాలే దీనికి ప్రధాన కారణం. వీటిని దాదాపు సంపూర్ణంగా అరి కట్టడంతోపాటు వాహనం స్టార్ట్ చేసిన దగ్గ ర నుంచి గమ్యస్థానం వరకు ఆటోపైలట్ మోడ్‌లో పనిచేసే పూర్తి అటానమస్ కార్లను రూపొందించే ప్రయత్నాలు ఊపందుకున్నా యి. వీటికి డ్రైవర్ల అవసరం ఉండదు. ఈ ప్రయోగాలకు ఇప్పటి వరకు అమెరికాలోనే 7,500 కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనా. అక్కడ 30 సంస్థలు ఈ ప్రయోగాల్లో నిమగ్నమయ్యాయి. మిగతా దేశాల్లోనూ ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
లెవల్–5లో పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు
అమెరికాలో 26 కంపెనీలు 1,174 అటానమస్ కార్లను ప్రయోగాత్మకంగా 64 లక్షల కిలోమీటర్లు రోడ్ల మీద నడిపినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిని పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లతో తయారు చేసినప్పటికీ నాలుగు కంపెనీలు మాత్రమే డ్రైవర్ లేకుండా 16 వాహనాలను దాదాపు 40 వేల కిలో మీటర్లు తిప్పి పరీక్షించాయి.
అమెరికా మో టారు వెహికల్ డిపార్ట్‌మెంట్ రూపొందించిన నిబంధనల ప్రకారం ‘లెవల్ జీరో నుంచి లెవల్ 5’ వరకు మొత్తం ఆరు స్థాయిలు గా ఈ వాహనాలను వర్గీకరించారు. లెవల్ జీరోలో ప్రస్తుత సంప్రదాయ కార్లు ఉండగా లెవల్–5లో పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లుంటాయి. వివిధ కంపెనీల ప్రయోగ ఫలితాలను విశ్లేషిస్తే ప్రస్తుతం లెవల్–3 స్థాయి వరకే చేరుకున్నట్లు వెల్లడవుతోంది.
త్వరలో సాకారం..
సైన్స్ ఫిక్షన్‌కే పరిమితమైన సెల్ఫ్ డ్రైవ్ వాహనాలు త్వరలో రోడ్డెక్కుతాయని ‘ది గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ ఇంజనీరింగ్ అసోసియేషన్’(ఎస్‌ఏఈ) ఆశాభావంతో ఉంది. అటానమస్ వాహనాల తయారీ కంపెనీలకు ఈ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉంది. లెవల్–4 వాహనాలు రోడ్డెక్కిన కొంత కాలం త ర్వాత నిజమైన అటానమస్ వాహనాల (లెవల్ 5) స్వప్నం సాకారమవుతుందని అంచనా వేస్తోంది.
ఉపయోగాలెన్నో..
సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దూసుకెళ్లే పూర్తి సెల్ఫ్ డ్రైవ్ వాహనాల కల సాకారమైతే రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. మానవ తప్పిదాలతో పోలిస్తే సాఫ్ట్‌వేర్ తప్పిదాల సంఖ్య బహు స్వల్పం. పూర్తిస్థాయి అటానమస్ వాహనాలు రోడ్డెక్కితే విలువైన ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
డ్రైవింగ్ ఆటోమేషన్‌లో ‘లెవల్స్’ ఇలా
లెవల్ జీరో: వాహనం పూర్తిగా డ్రైవర్ నియంత్రణలో ఉంటుంది. అధిక వేగం హెచ్చరికలు, స్థిరత్వం కోల్పోతున్నప్పుడు వచ్చే ‘బీప్’ శబ్దాలకే ఆటోమేషన్ పరిమితం. ప్రస్తుతం రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలు దాదాపు ‘లెవల్ జీరో’లోనే ఉన్నాయి.
లెవల్ 1: డ్రైవర్‌కు సహాయకారిగా సపోర్టింగ్ వ్యవస్థ ఉంటుంది. నిర్ధారిత వేగంలో ప్రయాణించేలా క్రూజ్ కంట్రోల్’, లేన్ ఫాలోయింగ్ అసిస్టెన్స్ లాంటివి ఉంటాయి. అవసరమైనప్పుడు తక్షణం స్పందించి వాహనాన్ని నియంత్రించేలా డ్రైవర్ పూర్తి అప్రమత్తంగా ఉండాలి. అధునాతన కార్లలో ఈ సదుపాయాలున్నాయి.
లెవల్ 2: డ్రైవర్ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే కానీ.. అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టం(ఏడీఏఎస్) ద్వారా బ్రేకింగ్, వేగం పెంచడం, స్టీరింగ్ నియంత్రణ తదితర పనులు డ్రైవర్ ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి. ‘టెస్లా ఆటోపైలట్’ ఫీచర్ ఈ స్థాయి కిందకు వస్తుంది.
లెవల్ 3: ఈ స్థాయి కార్లకు అత్యవసర పరిస్థితుల్లో స్పందించడానికి డ్రైవర్ అవసరమే కానీ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, వ్యవస్థ విఫలమైనప్పుడు డ్రైవర్ అవసరం ఉంటుంది. సాధారణ సందర్భాల్లో కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో వాహనమే డ్రైవింగ్ ప్రక్రియ పూర్తి చేస్తుంది. హోండా ట్రాఫిక్ జామ్ పైలట్, మెర్సిడెస్–బెంజ్ డ్రైవ్ పైలట్ తదితర కార్లు మాత్రమే ఈ స్థాయిలో ఉన్నాయి.
లెవల్ 4: స్టీరింగ్, పెడల్స్ లేకుండా నడిచే కారు ఈ స్థాయి కిందకు వస్తుంది. పరిమిత వేగం, నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే ఇది నడుస్తుంది. వ్యవస్థ విఫలమయినా, అత్యవసర పరిస్థితి తలెత్తినా వాహన వేగం నెమ్మదించి ఆగిపోతుంది. సెల్ఫ్ డ్రైవ్ ట్యాక్సీలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని అనుమతుల కోసం కొన్ని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నా ఇంకా పూర్తిస్థాయి ఆమోదం లభించలేదు.
లెవల్ 5: పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవ్ కార్లు ఈ స్థాయిలో ఉంటాయి. గమ్యస్థానాన్ని సెట్ చేసి నింపాదిగా కూర్చోవడమే మనుషుల పని. పేపర్ చదువుకుంటూ, సినిమా చూస్తూ కూర్చుంటే కారు గమ్యస్థానానికి చేరుస్తుంది. మానవ ప్రమేయం అవసరమే ఉండదు. వేగానికి పరిమితులు ఉండవు.
ఏ ప్రాంతంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సురక్షితంగా ప్రయాణించగల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయి వాహనాల సొంతం. ఇవి ఇంకా ప్రయోగాల దశ దాటలేదు. వీటిని అభివృద్ధి చేయడానికి విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment