కష్టాల్లో హైదరాబాద్ ఆడపడుచు
హైదరాబాద్: బతుకుదెరువుకు పరాయిదేశం వెళ్లి కష్టాల్లో ఇరుక్కుంది హైదరాబాద్ మహిళ. ఏజెంటు చేసిన మోసానికి యజమాని చేతిలో మానసిక, శారీరక హింసలను ఎదుర్కోంటోంది. సాల్మాబేగం(39) హైదరాబాదులోని బాబానగర్లో ఉంటోంది. బ్రతుకుదెరువుకోసం ఇద్దరు ఏజెంట్లు అక్రమ్, షఫీ ద్వారా సౌదీ అరేబియాలోని షేక్ ఇంట్లో పనిమనిషిగా ఈఏడాది జనవరి నెలలో వెళ్లింది.
అక్కడకు వెళ్లనప్పటి నుంచి యజమాని చేతిలో చిత్ర హింసలు అనుభవిస్తోంది. దీంతో తిరిగి ఇండియాకు రావాలని ప్రయత్నిస్తే అందుకు యజమాని అంగీకరించట్లేదు. దీంతో ఏజెంట్లు మోసం చేశారని గ్రహించిన సాల్మా తన కూతురు షమీనాకు వాయిస్ మెస్సేజ్ చేసింది. యజమాని తను చిత్ర హింసలు పెడుతున్నాడని తిరిగి ఇంటికి రానివ్వట్లేదని కూతురు షమీనాకు తెలియచేసింది. దీనిపై ఆమె కూతురు వీసా ఇచ్చిన ఏజెంటు దగ్గరకు వెళ్లి తన తల్లిని ఇండియాకు తిరగి రప్పించాలని బ్రతిమాలినా ఫలితం లేదు. వీరిపై కాంచన్‌బాగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని షమీనా వాపోయింది.
ఏజెంట్లు తన తల్లిని మూడు లక్షలకు అమ్మేశారని షమీనా తెలిపింది. కాంట్రాక్టు పెళ్లికి అంగీకరించలేదని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఏజెంట్లపై పోలీసులకు పలు సార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ వారిపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించింది. తన తల్లిని వెనక్కి తీసుకురావడానికి శాయశక్తులా పోరాడతానని షమీనా తెలిపారు. తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తన తల్లిని విడిపించాలని కోరింది.
గల్ఫ్ కార్పోరేషన్ కౌన్సిల్ (జీసీసీ) లోని దేశాల్లో కఫిల్ విధానం అమలులో ఉంది. దీనికింద ఇంట్లో పనిమనుషులను యజమానులు ఇతర దేశాలనుంచి పిలిపించుకునే సదుపాయం ఆదేశాల ప్రజలకు ఉంది. అక్కడ ఇతర దేశాల వారు శాశ్వతంగా ఉండటానికి వీలు లేదు.