2027లో తొలిసారి ఆతిథ్యం
లుసానే (స్విట్జర్లాండ్): మొట్టమొదటి ఒలింపిక్స్ ఇ–స్పోర్ట్స్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వబోతోంది. 2027లో సౌదీ రాజధాని రియాద్‌లో ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ విశ్వక్రీడలు జరుగనున్నాయి. గతేడాది పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఈ ఏడాదే ఇ–స్పోర్ట్స్ మెగా ఈవెంట్ నిర్వహించాలని మొదట అనుకున్నారు. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు ఇంకో రెండేళ్లు ఆలస్యమవుతుంది.
అయితే 2027 నుంచి రెగ్యులర్‌గా ప్రతీ రెండేళ్లకోసారి మెగా ఈవెంట్ ఇ–స్పోర్ట్స్ నిర్వహించేందుకు సౌదీ ప్రభుత్వం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో 12 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో రియాద్‌లో ఇ–స్పోర్ట్స్ ప్రపంచకప్ జరిగింది. కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్‌నైట్, స్ట్రీట్ ఫైటర్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అయితే ఇందులో సాధారణ షూటర్లకు అనుమతించేది లేనిది తేలలేదు.
త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. సౌదీ క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజిజ్ బిన్ తుర్కీ అల్ ఫైజల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఒలింపిక్స్ ఇ–స్పోర్ట్స్ క్రీడాంశాలపై చర్చించనుంది. ఇటీవల ఐఓసీ చైర్మన్ థామస్ బాచ్, సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ల మధ్య చర్చలు ఫలప్రదంగా జరగడంతో తాజాగా ఇ–స్పోర్ట్స్ విశ్వక్రీడలపై ప్రకటన వెలువడింది. అయితే ఇంకో రెండేళ్లలో జరిగే ఈ పోటీల కోసం ఈ ఏడాది నుంచే క్వాలిఫయింగ్ పోటీలు మొదలవుతాయని ఐఓసీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment