
ఒలింపిక్స్ ఆతిథ్య దేశాల ఎంపికపై ఐఓసీ కొత్త అధ్యక్షురాలు కొవెంట్రీ కీలక వ్యాఖ్యలు
కోస్టా నవారినో (గ్రీస్): అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలిగా ఎంపికైన కిర్‌స్టీ కొవెంట్రీ భవిష్యత్తు ఒలింపిక్ ఆతిథ్య దేశాల అంశంలో కీలక వ్యాఖ్యలు చేసింది. 2036లో భారత్‌లో విశ్వక్రీడలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొవెంట్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భవిష్యత్‌లో ఒలింపిక్స్ ఆతిథ్య దేశాల అంశంలో తన ఆలోచనలను త్వరలోనే వెల్లడిస్తానని కొవెంట్రీ పేర్కొంది.
‘ఈ ప్రక్రియ సుదీర్ఘ కాలం సాగుతుంది. భవిష్యత్తు ఆతిథ్య దేశం ఎంపికలో సభ్యులందరి పాత్ర ఉంటుంది. దీనిపై నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని త్వరలోనే ఐఓసీ సభ్యులతో పంచుకుంటాను’ అని కొవెంట్రీ పేర్కంది. గురవారం జరిగిన ఐఓసీ ఎన్నికల్లో కొవెంట్రీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. జూన్ 23తో ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ పదవీ కాలం ముగిసిన అనంతరం కొవెంట్రీ పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనుంది.
జింబాబ్వేకు చెందిన 41 ఏళ్ల కిర్‌స్టీ కొవెంట్రీ ప్రస్తుతం ఆ దేశ క్రీడా శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తోంది. 2033 వరకు కొవెంట్రీ ఐఓసీ అధ్యక్షురాలిగా కొనసాగనుంది. ఆమె అధ్యక్షతన 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్, 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ జరగనున్నాయి. దీంతో పాటు 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఎంపిక కూడా కొవెంట్రీ హయాంలోనే ఖాయం కానుంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం పదికి పైగా దేశాలు పోటీ పడుతున్నాయి.
వీటిలో భారత్‌తో పాటు ఖతర్, సౌదీ అరేబియా కూడా ఉన్నాయి. ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ సమర్పించడంతో... భారత్ తమ ఆసక్తిని ఇప్పటికే వెల్లడించింది. దీనిపై ఐఓసీ పూర్తి అధ్యయనం చేయనుంది. 2036 ఒలింపిక్స్‌కు సంబంధించిన ఆతిథ్య హక్కుల అంశంలో 2026లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ సన్నాహాలపై త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతానని... ఆయన అధ్యక్షుడిగా ఉన్నపుడే 2017లో లాస్ ఏంజెలిస్‌కు ఆతిథ్య హక్కులు దక్కాయని కొవెంట్రీ తెలిపింది.
2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ద్వారా క్రికెట్ టి20 ఫార్మాట్ రూపంలో మళ్లీ విశ్వ క్రీడల్లో భాగం కానుంది. ఈ నేపథ్యంలో గ్రీస్‌లో జరిగిన ఐఓసీ సెషన్‌లో కిర్‌స్టీ కొవెంట్రీతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ జై షా మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఐఓసీ అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment