
జింబాబ్వే మాజీ స్విమ్మర్ కిర్‌స్టీ కొవెంట్రీకి అరుదైన గౌరవం
కోస్టా నవారినో (గ్రీస్): విశ్వ క్రీడలకు సంబంధించి అత్యున్నత పదవి తొలిసారి మహిళను వరించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలిగా జింబాబ్వేకు చెందిన విఖ్యాత స్విమ్మర్, ప్రస్తుతం జింబాబ్వే ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా ఉన్న కిర్‌స్టీ కొవెంట్రీ ఎన్నికయింది. ఈ అత్యున్నత పదవి కోసం ఏడుగురు పోటీపడగా... బరిలో ఉన్న ఏకైక మహిళా ప్రతినిధి 41 ఏళ్ల కిర్‌స్టీ కొవెంట్రీ తొలి రౌండ్‌లోనే స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుంది.
ఐఓసీలోని 97 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా... విజయానికి అవసరమైన 49 ఓట్లు కొవెంట్రీకి తొలి రౌండ్‌లోనే లభించాయి. ఒలింపిక్ దినోత్సవమైన జూన్ 23న ఐఓసీ అధ్యక్ష పదవిని అలంకరించనున్న కొవెంట్రీ ఎనిమిదేళ్లపాటు (2033 వరకు) ఈ పదవిలో కొనసాగుతుంది.
ప్రస్తుతం ఐఓసీ అధ్యక్షుడిగా ఉన్న థామస్ బాచ్ ఈ పదవిలో గరిష్టంగా 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. కొవెంట్రీ అధ్యక్షతన 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్, 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్ జరుగుతాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఎంపిక కూడా కొవెంట్రీ హయాంలోనే ఖరారవుతుంది.
ఏడు ఒలింపిక్ పతకాలు...
ఐఓసీ అత్యున్నత పదవి దక్కించుకున్న తొలి ఆఫ్రికన్‌గా గుర్తింపు పొందిన కొవెంట్రీకి విశ్వ క్రీడల్లో ఘనమైన రికార్డు ఉంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పోటీపడిన ఆమె మొత్తం 7 పతకాలు (2 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం) సాధించింది.
ఏథెన్స్ ఒలింపిక్స్‌లో కొవెంట్రీ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణం, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజతం, 200 మీటర్ల మెడ్లీలో కాంస్యం దక్కించుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కొవెంట్రీ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పసిడి పతకం సాధించగా... 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజతం, 200 మీటర్ల మెడ్లీలో రజతం, 400 మీటర్ల మెడ్లీలో రజతం కైవసం చేసుకుంది.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 7 స్వర్ణాలు, 5 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 13 పతకాలు ఆమె సంపాదించింది. 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో 200 మీటర్ల మెడ్లీలో స్వర్ణం నెగ్గిన కొవెంట్రీ... ఆల్ ఆఫ్రికా గేమ్స్‌లో 14 స్వర్ణాలు, 7 రజతాలు, 1 కాంస్యం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment