‘డ్రీమ్ బిగ్... అచీవ్ బిగ్’ అన్నారు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. గొప్ప కల కనాలి... ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రమించాలి. ఈ రెండు మాటలనూ ఒంట పట్టించుకుందా అమ్మాయి. తనకిష్టమైన టెన్నిస్ రాకెట్‌ని చేతిలోకి తీసుకుంది. టెన్నిస్‌ని ప్రేమిస్తోంది... టెన్నిసేప్రాణం అంటోంది... కానీ... ‘టాలెంట్ ఉంటేనే సరిపోతుందా’ అని పరిహసిస్తోంది రూపాయి. ప్రత్యర్థి మీద గెలవడం ఆమెకు ఏ మాత్రం చాలెంజ్ కాదు. ఆర్థిక పరిస్థితితో నిత్యపోరాటమే ఆమెను కుంగదీస్తోంది.
తిరుపతికి చెందిన చందన పోతుగారి టెన్నిస్ ప్లేయర్. నేషనల్ ర్యాంకింగ్‌లో టాప్ 30లో ఉంది. మనదేశంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లు మాత్రమే ఆడుతోంది. దేశం దాటి వెళ్లడానికి చేతిలో డబ్బు లేదు. ‘దేశంలో ఎక్కడికైనా సరే ట్రైన్‌లో జనరల్ కంపార్ట్‌మెంట్‌లో వెళ్లిపోతాను, విదేశాల్లో ఆడాలంటే విమానం టికెట్ కొనుక్కోలేను’ అంటున్నప్పుడు చందన కళ్లలో టెన్నిస్ ఆట పట్ల ప్రేమతోపాటు తన ఆర్థిక పరిస్థితి పట్ల నిస్సహాయత వ్యక్తమైంది. ఈ మాణిక్యం మట్టిలో పుట్టింది.
వెలుగు–చీకటి
సామాన్య కుటుంబంలో పుట్టిన చందన ఎనిమిదేళ్ల వయసులో టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. లెక్కకు మించిన విజయాలతో సాగిపోతోంది. ఆటలో రాణించాలంటే మెరుగైన శిక్షణ అవసరమని నాలుగేళ్ల కిందట కుటుంబం హైదరాబాద్‌కి వచ్చింది. గణేశ్ రామన్ టెన్నిస్ అకాడమీలో చేరింది. చందనలో ఆట పట్ల ఉన్న అంకితభావం, వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న కోచ్ ఫీజు గురించి పట్టుపట్టకుండా దేశం మెచ్చే క్రీడాకారిణిని తయారు చేయడానికి సిద్ధమయ్యారు.
సరిగ్గా ఇక్కడే చందనకు కాలం కొత్త పరీక్షలు పెట్టింది. జీవితంలోకి వెలుగు–చీకటి ఒక్కసారిగా వచ్చినట్లయింది. ‘శిక్షణ కోసం నగరానికి వెళ్లడమేంటి, వయసు వచ్చిన ఆడపిల్ల తెలియని మనుషుల మధ్య మెలగడమేంటి’... అని బంధువులు ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. వారి మాటలను పట్టించుకోలేదు, కానీ తండ్రి కూడా ‘ఇక ఆట చాలు, పెళ్లి చేస్తాను’ అనడంతో హతాశురాలైంది. ఆమె కన్నీళ్లు తల్లికి అర్థమయ్యాయి. కానీ తండ్రిని కరిగించలేకపోయాయి. కుటుంబం రెండయింది. తల్లి మునిలక్ష్మి ఒంటరిగా కూతురి బాధ్యత మోస్తోంది.
దేశం తరఫున ఆడాలి!
‘ఇంటర్నేషనల్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్‌లో భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించి గెలవాలనేది నా లక్ష్యం’ అంటున్న చందన టోర్నమెంట్‌లో గెలిచినప్పుడు వచ్చిన డబ్బును బస చేసిన గదికి అద్దె చెల్లించేసి తిరుగు ప్రయాణానికి డబ్బులు లెక్క చూసుకుంటూ జనరల్ టికెట్ కొనుక్కుని ఇంటికి వస్తోంది. చందనకు కొత్త రాకెట్ కూడా లేదని, తోటి క్రీడాకారులిచ్చిన రాకెట్, దుస్తులు, షూస్‌తో టోర్నమెంట్‌కు వెళ్తున్నదని, టెన్నిస్ కోసం చందన పడుతున్న కష్టాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది మునిలక్ష్మి. భగవంతుడి దయ వల్ల స్పాన్సర్స్ ముందుకు వస్తే రాకెట్‌లా దూసుకుపోతానని, దేశానికి మెడల్స్ సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది చందన.
రాయలసీమ టోర్నీ నుంచి ఇంటర్నేషనల్ టోర్నీల వరకు
నొవాక్ జొకోవిచ్, సెరీనా విలియమ్స్ తన రోల్ మోడల్స్ అంటున్న చందన అండర్ 12, అండర్ 14, అండర్ 16 కేటగిరీల్లో ఆరుసార్లు స్టేట్ చాంపియన్. అండర్ 12 ఏజ్ గ్రూప్‌లో రాయలసీమ టోర్నమెంట్ గెలిచింది. అండర్ 14లో చిత్తూరు, చెన్నై, పులివెందుల టైటిల్స్ సొంతం చేసుకుంది. చందన తొలి డబుల్స్ టైటిల్ కూడా పులివెందుల నుంచే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నేషనల్స్‌లో నాలుగు సార్లు పాల్గొన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించింది.
ఇంటర్నేషనల్ టోర్నీలు 15 ఆడింది. ఈ రైట్ హ్యాండెడ్ ప్లేయర్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఉమెన్స్ డబుల్స్ (21), సింగిల్స్ (35), ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఒన్ లాక్ రుపీస్ ఉమెన్స్ టోర్నమెంట్ సింగిల్స్‌లో 5 సార్లు విజేతగా, మరో 12 సార్లు ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఆరుదఫాలు డబుల్స్ ఫైనలిస్ట్. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా రాకెట్‌ని వదల్లేదు చందన. సరైన ఆహారం లేక కళ్లు తిరుగుతున్నా అలాగే టోర్నమెంట్ ఆడి, మజిల్ క్రాంప్‌తో కడుపు నొప్పితో బాధపడినప్పుడు కూడా ‘టెన్నిస్ అంటే నాకుప్రాణం’ ఆట కోసంప్రాణమైనా ఇస్తానన్నది చందన.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment