తండ్రి లేడు... అమ్మ టైలర్‌ | Sailing national Champion Special Story | Sakshi
Sakshi News home page

అలలపై సంచలనం

Published Thu, Aug 1 2019 8:19 AM | Last Updated on Thu, Aug 1 2019 9:51 AM

Sailing national Champion Special Story - Sakshi

ప్రీతి : ఒడుపు తెలిసిన క్రీడా నావికురాలు

పదేళ్ల అమ్మాయి మూడున్నరేళ్ల క్రితం సెయిలింగ్‌ నేర్చుకుంది. ఇది భూమి ఉపరితలంపై ఆడే ఆటకాదు. కొలనులో ఈది గెలిచే స్విమ్మింగ్‌ కాదు. అలలపై తేలియాడుతూ గాలి ఉదుటున తెరచాపను తెలివిగా తిప్పే సెయిలింగ్‌. అలాంటి క్రీడలో అచిర కాలంలోనే పట్టుసాధించింది. పద్నాలుగేళ్లకే జాతీయస్థాయిలో విజేతగా నిలిచింది. ఆ టీనేజ్‌ సంచలనమే ప్రీతి కొంగరి.

ఒక రేసుతో ముగియదు. రెండో రేస్‌తో ఫలితం వచ్చేయదు. కనీసం ఏడెనిమిది రేసుల్లో నిలకడగా రాణిస్తేనే గెలిచే ఆట సెయిలింగ్‌. తెరచాపే స్టీరింగ్‌. అలా అని సీట్‌లో కూర్చొని తిప్పడం కుదరనే కుదరదు. ఒంటిని విల్లులా మార్చాలి. గాలి వేగానికి అనుగుణంగా పడవ (సెయిలింగ్‌ బోట్‌)ను నీటిపై పరుగెత్తించాలి. ఇలాంటి భిన్నమైన క్రీడలో 14 ఏళ్ల ప్రీతి ప్రతిభ అపారం. ఈస్ట్‌ మారేడ్‌పల్లిలోని నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న ప్రీతి కేవలం మూడున్నర ఏళ్ల కృషితోనే జాతీయ స్థాయిలో మెరిసింది. తాజాగా హుస్సేన్‌సాగర్‌లో నిర్వహించిన జాతీయ ర్యాంకింగ్‌ మాన్‌సూన్‌ రెగెట్టాలో హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌ (వైసీహెచ్‌)కు చెందిన ప్రీతి విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా 131 మంది యువ సెయిలర్లు బరిలో ఉన్న ఈ పోటీల్లో హైదరాబాద్‌ చిన్నది గెలవడం ఆషామాషీ కాదు.

అనుకోకుండా అలలపైకి
నీళ్లంటే ప్రీతికి భయం. అందుకే వాటర్‌స్పోర్ట్స్‌ వైపు కన్నెత్తి చూడలేదు. సెయిలర్‌ కావాలన్న ప్రణాళిక కూడా లేదు. కానీ ఇలాంటి భయభీతులున్న ఆమె అనుకోకుండా అలలకు పరిచయమైంది. పదేళ్ల వయసుదాకా ఇల్లే తన ప్రపంచం. అమ్మే ఆమెకు అందమైన లోకం. స్నేహితులతోనే సంతోషం. అలాంటి ప్రీతికి యాట్‌ క్లబ్‌ (వైసీహెచ్‌) కోచ్, వ్యవస్థాపకుడు సుహీమ్‌ షేక్‌ చేయూత నిచ్చారు. సెయిలింగ్‌లో నడిపించారు. ఇప్పుడామెకు నీళ్లంటే భయంలేదు. సెయిలింగే జీవితం. పోటీలే తనముందున్న ప్రపంచం. గెలుపే ఆమె లక్ష్యం.

కోచ్‌ సుహీమ్‌ షేక్‌తో... ప్రీతి
తండ్రి లేడు... అమ్మ టైలర్‌
పేదింటి అమ్మాయి ప్రీతి. తండ్రి లేడు. అమ్మ విజయలక్ష్మి టైలర్‌. ఇది చాలు ఆమె ఆర్థికస్థోమతేంటో తెలుసుకోడానికి..! కడుపునిండా తినడానికి, చదువుకోవడానికే అష్టకష్టాలు పడుతున్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె పట్టుదల ముందు ఆర్థిక నేపథ్యం ఓడిపోయింది. ఆమె లక్ష్యఛేదనలో ఎదురైన సవాళ్లన్ని నీట మునిగాయి. ఆమె మాత్రం జాతీయ చాంపియన్‌. అదికూడా అచిర కాలంలోనే!

బెస్ట్‌ సెయిలర్‌ ప్రీతి
జాతీయ ఈవెంట్‌లో అమె రెండు చాంపియన్‌షిప్‌ ట్రోఫీలు గెలుచుకుంది. ఆప్టిమిస్ట్‌లో చాంపియన్‌గా నిలిచిన ఆమె బాలికల ఆప్టిమిస్ట్‌ ఫ్లీట్‌ కేటగిరిలో ఓవరాల్‌ ట్రోఫీ కూడా గెలుచుకుంది. ఒక రేసులోనూ విఫలమవకుండా పూర్తి చేయడం ద్వారా ‘ఉత్తమ సెయిలర్‌’ అవార్డు కూడా అందుకుంది. అంతకుముందు ఈ నెలారంభంలో జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి సెయిలింగ్‌ రెగెట్టాలో ప్రీతి రెండు విభాగాల్లో విజేతగా నిలిచింది. ఇందులో వందమందికి పైగా సెయిలర్లు పాల్గొన్నారు.

లక్ష్యమే నన్ను నడిపిస్తోంది
‘‘సెయిలింగే నా జీవితం. ప్రాక్టీస్‌ తప్ప మరో ఆలోచన లేదిపుడు. నీళ్లలో దిగిన ప్రతిరోజు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలన్న లక్ష్యమే నన్ను నడిపిస్తుంది. తప్పకుండా గత రేసుకు కొత్త రేసుకు తేడా చూపాలనుకుంటాను. పోటీకి దిగితే మెరుగైన ప్రదర్శన తప్ప మిగతా వాటి గురించి ఆలోచించను.’’ – ప్రీతి కొంగరి

అంతర్జాతీయ పోటీలకు
సెయిలింగ్‌ మెరిక అయిన ప్రీతి ఇప్పుడు అంతర్జాతీయ సెయిలింగ్‌ పోటీలపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది చివర్లోగానీ లేదంటే 2020 ఆరంభంలోగానీ ఆ పోటీలు జరుగుతాయి. అప్పటిదాకా క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌లో నిమగ్నం కావాలనుకుంటోంది. ప్రతీరేసులో విజయాన్ని ఆస్వాదించాలని ఆశిస్తోంది. అలాగే చదువును అలక్ష్యం చేయనని చెబుతోంది. కెరీర్‌ను ఉన్నత చదువులకు ఇబ్బంది కాకుండా మలచుకుంటానని చెప్పింది.– యెల్లా రమేశ్‌సాక్షి స్పోర్ట్స్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement