manya
-
సెయిలింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మాన్య
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన యువ సెయిలర్ మాన్య రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఇంటర్నేషనల్ లేజర్ క్లాస్ అసోసియేషన్ 4 (లేజర్ 4.7) యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఆమె ఎంపికైంది. జూన్ 22నుంచి 30 వరకు పోర్చుగల్‌లోని వియానా డి కాస్టెలోలో ఈ టోర్నీ జరుగుతుంది. 15 ఏళ్ల మాన్య గత కొంత కాలంగా సెయిలింగ్ పోటీల్లో నిలకడగా రాణిస్తోంది. హుస్సేన్ సాగర్ జలాల్లో సెయిలింగ్ నేర్చుకున్న ఈ అమ్మాయి తొలి జూనియర్ రెగెట్టాలోనే రజతం సాధించింది. జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో వరుస విజయాలు సాధించిన ఆమె ఇటీవల షిల్లాంగ్‌లో జరిగిన ర్యాంకింగ్ టోర్నీలో కాంస్యం గెలుచుకుంది. వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం భారత్‌నుంచి ఎంపికైన ఇద్దరు సెయిలర్లలో ఒకరిగా మాన్యకు అవకాశం దక్కింది. ఈ టోర్నీ కోసం ప్రస్తుతం మాన్య సిద్ధమవుతోంది. అయితే వరల్డ్ చాంపియన్íÙప్ స్థాయి టోర్నీలో పాల్గొనడం, ఇతర సన్నాహకాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే తన ఈవెంట్ కోసం మాన్య స్పాన్సర్ల సహాయాన్ని ఆశిస్తోంది. ప్రయాణ, వసతి, ఎక్విప్మెంట్, శిక్షణ కోసం తనకు అండగా నిలవాలని ఆమె కోరుతోంది. ఈ నేపథ్యంలో మాన్యకు స్పాన్సర్షిప్ అందించాలని భావించేవారు ఝ్చ్చny్చట్ఛఛీఛీy20ఃజఝ్చజీ .ఛిౌఝ ద్వారా సంప్రదించవచ్చు. -
మిగిలిపోయిన కూరగాయలతో ప్యాకింగ్ పేపర్స్, ఆదర్శంగా నిలుస్తున్న మాన్య
పర్యావరణ పరిరక్షణ గురించి మాటలు కాదు, చేతల్లో చూపించండి అని గ్రేటాథన్ బర్గ్ గళం విప్పింది. ఈ మాటను తూ.చ. తప్పకుండా ఆచరిస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది మాన్యా. అందుకే మాన్యను ‘అంతర్జాతీయ యూత్ ఇకో– హీరో’ అవార్డు వరించింది. పర్యావరణ సమస్యలను పరిష్కరించే ఎనిమిది నుంచి పదహారేళ్ళలోపు వయసు వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా పదిహేడు మంది యువతీ యువకులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా మన దేశం నుంచి మాన్యహర్షను ఏరికోరి ఈ అవార్డు వరించింది. మాన్య చేపట్టిన ‘సన్‌షైన్ ప్రాజెక్టుకు గానూ ఇంతటి గుర్తింపు లభించింది. 27 దేశాలు, 32 అమెరికా రాష్ట్రాల్లో... ఇరవై ఏళ్లుగా పర్యావరణం గురించి కృషిచేస్తోన్న... 339 మందిని గుర్తించి వారిలో పదిహేడు మందికి ఇకో హీరో అవార్డులు ఇచ్చారు. బెంగళూరుకు చెందిన పదిహేడేళ్ళ మాన్య గోల్డెన్ బీ ఆఫ్ విబ్జిఆర్ హైస్కూల్లో చదువుతోంది. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం. మాన్యకు నాలుగేళ్లు ఉన్నప్పుడు నానమ్మ రుద్రమ్మ మాన్యతో మొక్కను నాటిస్తూ... ‘‘ప్రకృతినీ, పర్యావరణాన్నీ ప్రేమగా చూసుకోవాలి. మనతో పాటు మొక్కలు, జంతువులను బతకనిస్తే మనం బావుంటాము’’ అని ఆమె మాన్యకు చెప్పింది. అప్పటినుంచి మాన్యకు పర్యావరణంపై మక్కువ ఏర్పడింది. చిన్నప్పటి నుంచి పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనేది. లాక్డౌన్ సమయంలో... కరోనా వైరస్ చెడు చేసినప్పటికీ సరికొత్త పనులు చేయడానికి కొంతమందికి వెసులుబాటు కల్పించింది. ఈ వెసులు బాటును వాడుకున్న మాన్య.. పిల్లల కోసం ‘సన్‌షైన్’ అనే మ్యాగజైన్‌ను ప్రారంభించింది. ప్రింట్, డిజిటల్ కాపీల ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. ఈ మ్యాగజైన్‌ను బెంగళూరులోని మాంటిస్సోరి, ఇతర స్కూళ్లల్లోని పిల్లలకు ఉచితంగా అందిస్తోంది. వివిధ కార్యక్రమాలను పరిచయం చేస్తూ పర్యావరణ ప్రాధాన్యత గురించి వివరిస్తోంది. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్ క్యాంపెయిన్’, ‘పేపర్ మేకింగ్ వర్క్‌షాప్’, ‘పిల్లలు నీటిని ఎలా కాపాడగలరు?’, ‘న్యూఇండియా సస్టెయినబుల్ క్యాంపెయిన్’,ప్లాస్టిక్ ఫ్రీ జూలై రైటింగ్ కాంపిటీషన్’, ఎర్త్‌డే రోజు పెయింటింగ్ పోటీల వంటివాటిని మ్యాగజైన్ ద్వారా నిర్వహిస్తూ పర్యావరణంపై చక్కని అవగాహన కల్పిస్తోంది. తన యూట్యూబ్ ఛానెల్లో కూడా పర్యావరణ కార్యక్రమ వీడియోలు షేర్ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పీల్స్‌తో పేపర్స్.. అనేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు వంటింట్లో మిగిలిపోయే కూరగాయ తడి వ్యర్థాలను ప్యాకింగ్ పేపర్స్‌గా మారుస్తోంది. కూరగాయ తొక్కలను ఉపయోగించి, పెన్సిల్స్, పేపర్లు రూపొందిస్తోంది. ఇప్పటిదాకా రెండు వందలకు పైగా వెజిటేబుల్ పీల్ పేపర్లను తయారు చేసింది. ఇందుకోసం వంటింట్లో మిగిలిపోయిన వ్యర్థాలు, పండుగల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సేకరించి, వాటిని గ్రైండ్ చేసి పేపర్‌గా మార్చడం విశేషం. పాత జీన్స్ ప్యాంట్లను డెనిమ్ పేపర్లుగా తీర్చిదిద్దుతోంది. మాన్యా స్వయంగా తయారు చేయడమే గాక, వర్క్‌షాపుల ద్వారా పేపర్ల తయారీ గురించి పిల్లలకు నేర్పిస్తోంది. అనేక అవార్డులు.. నాలుగున్నరవేలకు పైగా మొక్కలను నాటి, ఏడువేల మొక్కలు పంపిణీ చేసింది. ఐదువేల విత్తనాలను నాటింది. ఎనిమిదివేలకు పైగా ఆర్గానిక్, కాటన్ సంచులను పంచింది. సిటీ, హైవే రోడ్లు, నీటి కుంటలను శుద్ధిచేసే కార్యక్రమాలను చేపట్టింది. వీటన్నింటికి గుర్తింపుగా మాన్యకు అనేక అవార్డులు వచ్చాయి. వెజిటేబుల్ పేపర్‌కు గ్రీన్ ఇన్నోవేటర్, జల వనరుల మంత్రిత్వ శాఖ 2020 సంవత్సరానికి గాను ‘వాటర్ హీరో’, ఎర్త్డాట్ ఓ ఆర్జీ ఇండియా నెట్వర్క్ నుంచి రైజింగ్ స్టార్, హ్యూమానిటేరియన్ ఎక్స్‌లెన్స్ అవార్డులు వచ్చాయి. పృథ్వి మేళా, అక్షయ్కల్ప్ రీసైక్లింగ్ మేళా, లయన్స్ క్లబ్, బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్, బైజూస్ పేపర్ బ్యాగ్ డే వంటి కార్యక్రమాల్లో పర్యావరణంపై ప్రసంగించింది. ఇవన్నీగాక మాన్య ప్రకృతిమీద ఏడు పుస్తకాలు రాసింది. 2019 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ యంగెస్ట్ పోయెట్, ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకుంది. ‘‘ఈ అవార్డు నా కృషిని గుర్తించి మరింత స్ఫూర్తిని ఇచ్చింది. భవిష్యత్‌లో నా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తాను’’ అని చెబుతూ ఎంతోమందిని ఆలోచించేలా చేస్తోంది మాన్య. -
Manya Harsha: అక్షరాలా చైతన్యం
వంద మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఆ ఒక్క అడుగు పడే సమయం కూడా అంతే కీలకమైనది. పదేళ్లు నిండేలోపే కొన్ని అడుగులు నడిచేసింది మాన్యాహర్ష. అవగాహన అడుగులు తాను వేసింది, తోటి పిల్లలతో వేయించింది. తాను చెప్పగలిగిన విషయాన్ని అలతి అలతి పదాలతో ఐదు పుస్తకాలు రాసింది. వాటికి బొమ్మలు వేసింది. గేయాలను స్వరపరుచుకుంది. స్వయంగా పాడి వినిపిస్తోంది. తాజాగా వ్యర్థం కూడా అర్థవంతమేనని నిరూపించింది. మాన్యా హర్ష ఎకో యాక్టివిస్ట్. క్లైమేట్ అండ్ వాటర్ విభాగంలో పని చేస్తోంది. యాక్టివిస్ట్ అంటే సమస్య మీద గళం విప్పి ఊరుకోవడం కాదు... పరిష్కారం చూపించడం అని నిరూపిస్తోంది. పరిష్కారాన్ని కూడా మాటల్లో కాదు... చేతల్లో చూపిస్తోంది. ఇంట్లో వాడి పారేసే వ్యర్థాలతో పేపర్ తయారు చేసి చూపిస్తోంది. బెంగళూరులో ఆరవ తరగతి చదువుతున్న మాన్య పిల్లల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించడానికి 2018లో ‘ద వరల్డ్ వాటర్ కన్జర్వేషన్ డే (మార్చి 22) నాడు బెంగళూరు, జేపీ నగర్ వీథుల్లో వాకథాన్ నిర్వహించింది. తల్లిదండ్రులు, పుట్టెనహల్లి లేక్ నిర్వహకుల సహకారంతో దొరసాని ఫారెస్ట్ నుంచి పుట్టెనహల్లి సరస్సు వరకు పిల్లలతో కలిసి మొక్కలు నాటింది. మార్కోనహల్లి డ్యామ్, వర్కా బీచ్ పరిశుభ్రత కార్యక్రమంలో పనిచేసింది. ఇదే సమయంలో నగరంలో కొండల్లా పేరుకుపోతున్న వ్యర్థాలను చూసినప్పుడు వాటిని ఉపయోగంలోకి తీసుకురావడం ఎలా... అనే ప్రశ్న తలెత్తింది. ఆ ప్రయత్నం ఇంటి నుంచే మొదలు పెట్టింది. పది ఉల్లిపాయల తొక్కల్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి తగినంత నీరు పోసి కుకర్‌లో ఉడికించింది. ఆ తరవాత మెత్తగా గ్రైండ్ చేసింది. ఆ గుజ్జును ఒక పలుచని వస్త్రం మీద సమంగా పరిచి ఆరబెట్టింది. అదనపు నీరు ఇగిరిపోయి గుజ్జు మాత్రం లేత వంగపండు పేపర్‌గా మారింది. మాన్య తన ప్రయోగాన్ని మరింత విస్తరించింది. లేత పసుపు రంగు పేపర్ కోసం మొక్కజొన్న, లేత ఆకుపచ్చ కాగితం కోసం బఠాణి గింజల తొక్కలతోనూ విజయవంతంగా ప్రయోగం చేసింది. పండుగల సమయంలో ఉపయోగించే పూలు, తమలపాకులతో మృదువైన పేపర్ని చేసి చూపించింది. పాత దినపత్రికల తో క్యారీ బ్యాగ్‌లు చేసి ప్లాస్టిక్ బ్యాగ్‌లకు బదులుగా వాడమని వీథి పక్కన పండ్లు, కూరగాయలమ్ముకునే వాళ్లకిచ్చింది. కరోనా డైరీస్ మాన్య తొలి పుస్తకం పేరు ‘నేచర్ అవర్ ఫ్యూచర్’. ప్రకృతి గురించి ఇంగ్లిష్‌లో రాసిన గేయాలకు యూఎన్ వాటర్ విభాగం నుంచి ప్రశంసలందుకుంది. రెండవ పుస్తకం ‘ద వాటర్ హీరోస్’. నీటి ఆవశ్యకత, నీటికొరత మీద రాసింది. దీనికి కేంద్ర జల శక్తి విభాగం అవార్డు వచ్చింది. మూడవ పుస్తకం పేరు ‘నీరిన పుతాని సంరక్షకారు’. ఇది రెండవ పుస్తకానికి కన్నడ వెర్షన్. ఇక కోవిడ్ సమయంలో స్కూళ్లు బంద్ అయ్యాయి. ఈ సుదీర్ఘ విరామంలో మాన్య ‘వన్స్ అప్ ఆన్ ఎ టైమ్ ఇన్ 2020’ అంటూ కరోనా డైరీస్ మొదలు పెట్టింది. దానికి కన్నడ వెర్షన్ కూడా రాసింది. మొత్తం ఐదింటిలో మూడు ఇంగ్లిష్, రెండు కన్నడ భాషల్లో వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ప్రకృతి ఇతివృత్తంగా ఆరవ పుస్తక రచనలో ఉంది. చైల్డ్ ప్రాడిజీ మ్యాగజైన్ టాప్ హండ్రెడ్ చైల్డ్ ప్రాడిజీల జాబితాలో మాన్యను ‘ద నేచర్ హీరో’ టైటిల్‌తో చేర్చింది. పది రికార్డులు మూడు పూలు ఆరు కాయలన్నట్లుగా సాగుతోన్న మాన్య ప్రకృతి ఉద్యమంలో ఇప్పటి వరకు పది రికార్డులు అందుకుంది. ► ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మూడు ► ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ∙వజ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ ► వరల్డ్ రికార్ట్స్ ఇండియా ∙గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ► ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్ ► కర్నాటక అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అక్షరంతోనే చైతన్యం! ‘‘అమ్మానాన్నలతో కలిసి అనేక ప్రదేశాలకు వెళ్లాను. సరస్సులు, నదులు చాలా చోట్ల చెత్తతో నిండిపోయి ఉంటున్నాయి. చెత్తను లారీల్లో తెచ్చి నీటిలోకి పోయడం కూడా చూశాను. ఎందుకలా చేస్తున్నారని చాలా బాధ కలిగేది. కోపం వచ్చేది. అప్పుడు మా నాన్న ‘మనం అనుకున్న దాన్ని సాధించడానికి గొడవ పడడం మార్గం కానే కాదు. అక్షరం కత్తికంటే పదునైనది. నీ కోపాన్ని అక్షరాల్లో చూపిస్తే నీ కళ్ల ముందు నీటిలో చెత్తను పోసే వాళ్లను మాత్రమే కాక, ఎంతోమందిని చైతన్యవంతం చేయవచ్చు’ అని చెప్పారు. ఎలా రాయాలో కూడా నేర్పించారు. నేను నమ్మేది ఒక్కటే... ఈ ప్రకృతిలో వ్యర్థం అంటూ ఏదీ ఉండదు. మనం దానిని వ్యర్థం అనే భావనతో చూడడం తప్ప’’. – మాన్యహర్ష, బాల ఉద్యమకారిణి -
లిటిల్ తైక్వాండో స్టార్స్
ఆటలో రాణిస్తోన్న మాన్య, ధ్రువ హైదరాబాద్: నగరానికి చెందిన అక్కా తమ్ముళ్లు తైక్వాండోలో సత్తా చాటుతున్నారు. భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన చిన్నారులు ఎన్. మాన్య , ధ్రువ తైక్వాండోలో ఇటీవల వివిధ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓపెన్ ఇండియన్ కప్ అండర్–12 విభాగంలో ఈ చిన్నారులు పసిడి పతకాలతో సత్తాచాటారు. ఈ టోర్నీలో చెరో రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. చిరుప్రాయం నుంచే క్రీడలపై ఆసక్తి కనబరిచే వీరిద్దరూ గత మూడు సంవత్సరాలుగా పాఠశాలలోనే తైక్వాండో ఈవెంట్లో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మాన్య ఆరో తరగతి చదువుతుండగా... ఆమె తమ్ముడు ధ్రువ మూడో తరగతిలో ఉన్నాడు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యంగా కోచ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిరోజూ 2గంటల పాటు సాధనలో శ్రమిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోన్న ఈ చిన్నారులను పాఠశాల యాజమాన్యం కూడా ప్రోత్సహిస్తోంది. క్రీడల్లోనే కాకుండా చ దువుల్లోనూ మంచి ప్రతిభను కనబరుస్తున్నారని స్కూల్ ప్రిన్సిపల్ రమాదేవి అన్నారు. -
మన్యంలో నిషేధిత క్యాట్‌ఫిష్ అమ్మకాలు
హుకుంపేట: నిషేధిత క్యాట్‌ఫిష్ విక్రయాలు విశాఖ మన్యంలో భారీగా జరుగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని చేపల చెరువుల్లో జంతు కళేబరాలను మేతగా వేసి పెంచే క్యాట్ఫిష్ల్ని ప్రభుత్వం నిషేధించింది. వీటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు నిర్ధారించారు. మైదాన ప్రాంతాల్లో వీటి అమ్మకాలపై పూర్తి నిషేధం ఉండడంతో వ్యాపారులు మన్యానికి తెచ్చి వారపు సంతల్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. హుకుంపేటతో పాటు, పాడేరు, గుత్తులపుట్టు, జి.మాడుగుల, మారుమూల మద్దిగరువు, అన్నవరం, లోతుగెడ్డ, కోరుకొండ, పెదబయలు, కించుమండ వారపు సంతల్లో వ్యాపారులు విచ్చలవిడిగా క్యాట్‌ఫిష్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఏజెన్సీలో క్యాట్‌ఫిష్, ఇతర నిల్వ చేపల అమ్మకాలపై దృష్టి సారించిన కలెక్టర్, ఐటీడీఏ పీవోలు ఎపిడిమిక్ సీజన్ ముగిసేంత వరకు చేపల అమ్మకాల్ని ఏజెన్సీలో నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. గత వారం అన్ని వారపు సంతల్లోనూ చేపల అమ్మకాల్ని అడ్డుకున్నారు. క్యాట్‌ఫిష్‌లను విక్రయించొద్దని వ్యాపారుల్ని అధికారులు హెచ్చరించారు. కానీ అధికారులు సంత నుంచి వెళ్లిన మరుక్షణమే వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు. ఇప్పటికైనా క్యాట్‌ఫిష్ అమ్మకాల్ని నిషేధించాలని గిరిజనులు కోరుతున్నారు. -
పోలీసులూ షాక్ తిన్నారు!
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు మేము చేస్తున్న ప్రయత్నమిది... హోరున వర్షం. ఆ వర్షంలో తడుచుకుంటూనే ఇంటికి చేరుకున్నాను. తడిసి ముద్దైన నన్ను చూస్తూనే కంగారుపడ్డాడు నాన్న. ఏంటీ పిచ్చిపని అంటూ నాలుగు చీవాట్లు కూడా వేశాడు. కానీ అవి నన్ను బాధపెట్టలేదు. ఎందుకంటే, అంతకంటే పెద్ద బాధ నా మనసును మెలిపెట్టేస్తోంది. అది తెలియని నాన్న ఆరోగ్యమంటే లెక్కలేదు నీకు అంటూ అరుస్తున్నాడు. ఎలా చెప్పను నాన్నకి... ఆయన కూతురికి జరిగిన అవమానం? చేయని తప్పిదానికి మూటకట్టుకున్న అపమానం? నాకో గొప్ప సంబంధం దొరికినందుకు... కట్నం కోరకుండా, పెళ్లి ఖర్చులకు వెరవకుండా, నన్ను నన్నుగా తీసుకెళ్లడానికి సిద్ధపడిన వ్యక్తి తనకు అల్లుడిగా రాబోతున్నందుకు మురిసిపోతున్నాడు తను. కానీ అదే వ్యక్తి నా శీలాన్ని శంకించాడని, ఛీకొట్టి పొమ్మన్నాడనీ ఎలా చెప్పేది! తన కలల మీద కన్నీళ్లు ఎలా చల్లేది! ఏదో మాట్లాడాలి రమ్మంటూ కిశోర్ ఫోన్ చేస్తే, ఆఫీసు అవగానే వెళ్లాను. నా గురించి ఎవరో రాసిన తప్పుడు రాతలను మెయిల్లో చూపించి, మానమర్యాదలు లేనిదానిగా జమకట్టేశాడు. నా సమాధానం వినలేదు. నా సంజాయిషీ కోరలేదు. నన్ను ముద్దాయిలా నిలదీశాడు. నేరస్థురాలిలా నిలబెట్టేశాడు. పెళ్లి రద్దు చేయడమే నీకు శిక్ష అంటూ తీర్పు చెప్పి వెళ్లిపోయాడు. నా మనసు ముక్కలైపోయింది. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు... ఇలా ఎన్నిసార్లు? ఎన్నోసార్లు! ప్రతిసారీ సంబంధం కుదరడం... వారం తిరిగేలోపు పెళ్లికొడుక్కి ఎవరో నా గురించి తప్పుడు విషయాలు మెయిల్ ద్వారా తెలపడం, అతడు నన్ను కాదనడం, అవమానించి నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం! ఇలా జరిగిన ప్రతిసారీ నాన్న పడుతోన్న వేదనను చూడలేక మనసు విలవిల్లాడుతోంది. తెలిసి నేనెవరికీ ఏ చెడూ చేయలేదు. మరి ఎవరు నామీద ఇలా బురద చల్లుతున్నారు? పదుల సంఖ్యలో పెళ్లి సంబంధాలు చెడిపోయాక పోలీసులను ఆశ్రయించాను. సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు వెళ్లి, డీసీపీగారితో నా బాధను విన్నవించుకున్నాను. ఈ పనికి పాల్పడుతున్నవారు ఎవరైనా సరే, పట్టుకుని శిక్షిస్తానని ఆయన మాట ఇచ్చారు. ‘‘ఇంకెంతసేపు సర్. అతను నిజంగానే దొరికాడా?’’... ఆతృతనాపుకోలేక అడిగాను. ‘‘మావాళ్లు అతన్ని తీసుకొస్తున్నారమ్మా, కాసేపట్లో వచ్చేస్తారు’’... అన్నారు డీసీపీ. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని నాకు చాలా ఆదుర్దాగా ఉంది. ఇన్నాళ్ల ఆవేదన నాలో ఆవేశంలా ఉప్పొంగుతోంది. అతడు రాగానే కాలర్ పట్టుకుని కడిగేయాలి. నా జీవితాన్ని ఎందుకు నరకంలోని తోసేశావ్ అని నిలదీయాలి... ఇలా అనుకుంటుండగానే ఆ వ్యక్తి వచ్చాడు. కానీ అతడిని చూశాక... మాట పెగలలేదు. ఎందుకంటే... ఆ వచ్చిన వ్యక్తి, కాదు... పోలీసులు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో కాదు... నాన్న! అమ్మ అర్ధంతరంగా చనిపోతే నన్ను, అన్నయ్యలను కళ్లలో పెట్టుకుని పెంచినవాడు. ఖాకీల మధ్య ఖైదీలా నిలబడ్డాడు. నేను విస్తుపోయి చూస్తున్నాను. ‘‘ఎవరు సార్ వాడు? ఎవరు నా కూతురి శీలంపై మచ్చ వేసినవాడు? వాడిని నేను వదిలిపెట్టను.’’ నాన్న అరుపులను బట్టి పోలీసులు తనకి ఏం చెప్పి స్టేషన్‌కి తీసుకొచ్చారో అర్థమైంది నాకు. ఎలా స్పందించాలో తెలియక డీసీపీగారి వైపు చూశాను. ఆయన చిన్నగా నవ్వి నాన్నతో అన్నారు. ‘‘అదిగో... అక్కడున్నాడు చూడండి.’’ డీసీపీగారు చూపించిన వైపు చూసిన నాన్న... అక్కడ గోడకు వేళ్లాడుతున్న అద్దంలో తన ప్రతిబింబం చూసి అవాక్కయ్యాడు. ‘‘ఏంటి సార్... ఏం మాట్లాడుతున్నారు? నేనెందుకిలా చేస్తాను’’ అంటూ విరుచుకుపడ్డాడు. కానీ డీసీపీగారు చెప్పిన వివరాలు విన్న తర్వాత కిక్కురుమనలేదు. పెళ్లికొడుకులందరికీ రకరకాల ఐడీల నుంచి మెయిల్స్ వెళ్లాయి. కానీ అన్ని మెయిల్సూ ఒకే ల్యాప్‌టాప్ నుంచి వెళ్లాయి. దాని ఐపీ అడ్రస్ ట్రేస్ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. ఎందుకంటే... ఆ ల్యాప్‌టాప్ ఎవరిదో కాదు, నాదే. అందుకే నాన్న, అన్నయ్యల మీద నిఘా వేశారు. దాంతో నాన్న దొరికిపోయాడు. నేను స్నానం చేసేటప్పుడు, ఇంటి పని చేసుకుంటున్నప్పుడు నాకు తెలియకుండా నా ల్యాప్‌టాప్ నుంచే మెయిల్స్ పంపాడు నాన్న. పాము తన పిల్లల్ని మింగేస్తుందని తెలుసుగానీ... కన్నతండ్రే తన కూతురి జీవితాన్ని బలి తీసుకుంటాడని నేనెక్కడా వినలేదు. ఏం మాట్లాడగలను నేను? కన్నతండ్రికి శిక్ష వేయమని ఎలా కోరగలను? అందుకే కంప్లయింట్ వెనక్కి తీసుకున్నాను. అయితే నాన్నను ఒక ప్రశ్న మాత్రం అడిగాను... ‘‘ఇలా ఎందుకు చేశావ్ నాన్నా’’ అని. దానికి తను చెప్పిన సమాధానం విని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అన్నయ్యలకు మంచి ఉద్యోగాలు లేవు. నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా బాగా సంపాదిస్తున్నాను. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఆ సంపాదన తనకు దక్కదు అన్న ఉద్దేశంతో చేశాడట. ఇల్లు నడపడం కష్టమవుతుందని భయపడ్డాడట. పిచ్చి నాన్న! ఈమాత్రం దానికి నా శీలాన్ని వేలం వేయాలా? నా మర్యాదకు పాతరేయాలా? నాతో ఒక్క మాట చెబితే పెళ్లి అన్న ఆలోచనను మనసులోంచి తుడిచేయనూ! రక్తాన్ని చెమటగా మార్చి మమ్మల్ని పెంచిన తన కోసం ఆ మాత్రం త్యాగం చేయలేనూ! ఆ మాటే అంటే తల దించుకున్నాడు. ఆ తర్వాత తను ఎప్పుడూ తలెత్తి నా కళ్లలోకి చూడలేదు!! - మాన్య, హైదరాబాద్ (బాధితురాలి పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి