పర్యావరణ పరిరక్షణ గురించి మాటలు కాదు, చేతల్లో చూపించండి అని గ్రేటాథన్ బర్గ్ గళం విప్పింది. ఈ మాటను తూ.చ. తప్పకుండా ఆచరిస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది మాన్యా. అందుకే మాన్యను ‘అంతర్జాతీయ యూత్ ఇకో– హీరో’ అవార్డు వరించింది.
పర్యావరణ సమస్యలను పరిష్కరించే ఎనిమిది నుంచి పదహారేళ్ళలోపు వయసు వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా పదిహేడు మంది యువతీ యువకులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా మన దేశం నుంచి మాన్యహర్షను ఏరికోరి ఈ అవార్డు వరించింది. మాన్య చేపట్టిన ‘సన్‌షైన్ ప్రాజెక్టుకు గానూ ఇంతటి గుర్తింపు లభించింది. 27 దేశాలు, 32 అమెరికా రాష్ట్రాల్లో... ఇరవై ఏళ్లుగా పర్యావరణం గురించి కృషిచేస్తోన్న... 339 మందిని గుర్తించి వారిలో పదిహేడు మందికి ఇకో హీరో అవార్డులు ఇచ్చారు.
బెంగళూరుకు చెందిన పదిహేడేళ్ళ మాన్య గోల్డెన్ బీ ఆఫ్ విబ్జిఆర్ హైస్కూల్లో చదువుతోంది. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం. మాన్యకు నాలుగేళ్లు ఉన్నప్పుడు నానమ్మ రుద్రమ్మ మాన్యతో మొక్కను నాటిస్తూ... ‘‘ప్రకృతినీ, పర్యావరణాన్నీ ప్రేమగా చూసుకోవాలి. మనతో పాటు మొక్కలు, జంతువులను బతకనిస్తే మనం బావుంటాము’’ అని ఆమె మాన్యకు చెప్పింది. అప్పటినుంచి మాన్యకు పర్యావరణంపై మక్కువ ఏర్పడింది. చిన్నప్పటి నుంచి పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనేది.
లాక్‌డౌన్ సమయంలో...
కరోనా వైరస్ చెడు చేసినప్పటికీ సరికొత్త పనులు చేయడానికి కొంతమందికి వెసులుబాటు కల్పించింది. ఈ వెసులు బాటును వాడుకున్న మాన్య.. పిల్లల కోసం ‘సన్‌షైన్’ అనే మ్యాగజైన్‌ను ప్రారంభించింది. ప్రింట్, డిజిటల్ కాపీల ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. ఈ మ్యాగజైన్‌ను బెంగళూరులోని మాంటిస్సోరి, ఇతర స్కూళ్లల్లోని పిల్లలకు ఉచితంగా అందిస్తోంది.
వివిధ కార్యక్రమాలను పరిచయం చేస్తూ పర్యావరణ ప్రాధాన్యత గురించి వివరిస్తోంది. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్ క్యాంపెయిన్’, ‘పేపర్ మేకింగ్ వర్క్‌షాప్’, ‘పిల్లలు నీటిని ఎలా కాపాడగలరు?’, ‘న్యూఇండియా సస్టెయినబుల్ క్యాంపెయిన్’,ప్లాస్టిక్ ఫ్రీ జూలై రైటింగ్ కాంపిటీషన్’, ఎర్త్‌డే రోజు పెయింటింగ్ పోటీల వంటివాటిని మ్యాగజైన్ ద్వారా నిర్వహిస్తూ పర్యావరణంపై చక్కని అవగాహన కల్పిస్తోంది. తన యూట్యూబ్ ఛానెల్లో కూడా పర్యావరణ కార్యక్రమ వీడియోలు షేర్ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
పీల్స్‌తో పేపర్స్..
అనేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు వంటింట్లో మిగిలిపోయే కూరగాయ తడి వ్యర్థాలను ప్యాకింగ్ పేపర్స్‌గా మారుస్తోంది. కూరగాయ తొక్కలను ఉపయోగించి, పెన్సిల్స్, పేపర్‌లు రూపొందిస్తోంది. ఇప్పటిదాకా రెండు వందలకు పైగా వెజిటేబుల్ పీల్ పేపర్లను తయారు చేసింది. ఇందుకోసం వంటింట్లో మిగిలిపోయిన వ్యర్థాలు, పండుగల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సేకరించి, వాటిని గ్రైండ్ చేసి పేపర్‌గా మార్చడం విశేషం. పాత జీన్స్ ప్యాంట్లను డెనిమ్ పేపర్‌లుగా తీర్చిదిద్దుతోంది. మాన్యా స్వయంగా తయారు చేయడమే గాక, వర్క్‌షాపుల ద్వారా పేపర్‌ల తయారీ గురించి పిల్లలకు నేర్పిస్తోంది.
అనేక అవార్డులు..
నాలుగున్నరవేలకు పైగా మొక్కలను నాటి, ఏడువేల మొక్కలు పంపిణీ చేసింది. ఐదువేల విత్తనాలను నాటింది. ఎనిమిదివేలకు పైగా ఆర్గానిక్, కాటన్ సంచులను పంచింది. సిటీ, హైవే రోడ్లు, నీటి కుంటలను శుద్ధిచేసే కార్యక్రమాలను చేపట్టింది. వీటన్నింటికి గుర్తింపుగా మాన్యకు అనేక అవార్డులు వచ్చాయి. వెజిటేబుల్ పేపర్‌కు గ్రీన్ ఇన్నోవేటర్, జల వనరుల మంత్రిత్వ శాఖ 2020 సంవత్సరానికి గాను ‘వాటర్ హీరో’, ఎర్త్‌డాట్ ఓ ఆర్జీ ఇండియా నెట్‌వర్క్ నుంచి రైజింగ్ స్టార్, హ్యూమానిటేరియన్ ఎక్స్‌లెన్స్ అవార్డులు వచ్చాయి.
పృథ్వి మేళా, అక్షయ్‌కల్ప్ రీసైక్లింగ్ మేళా, లయన్స్ క్లబ్, బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్, బైజూస్ పేపర్ బ్యాగ్ డే వంటి కార్యక్రమాల్లో పర్యావరణంపై ప్రసంగించింది. ఇవన్నీగాక మాన్య ప్రకృతిమీద ఏడు పుస్తకాలు రాసింది. 2019 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ యంగెస్ట్ పోయెట్, ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకుంది. ‘‘ఈ అవార్డు నా కృషిని గుర్తించి మరింత స్ఫూర్తిని ఇచ్చింది. భవిష్యత్‌లో నా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తాను’’ అని చెబుతూ ఎంతోమందిని ఆలోచించేలా చేస్తోంది మాన్య.
Comments
Please login to add a commentAdd a comment