![Goyal urged people to focus on consuming environmentally sustainable products to create a better future](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/3/eco01.jpg.webp?itok=S_us5faw)
పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తులను వినియోగించడంపై ప్రజలు దృష్టి సారించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దీంతో కర్బన ఉద్గారాలను తగ్గించ వచ్చన్నారు. ఫలితంగా పర్యావరణ సంబంధిత సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో గోయల్ మాట్లాడారు.
‘ప్రస్తుత జీవన శైలి ధోరణుల కారణంగా వెలువడుతున్న వ్యర్థాలు, కర్బన ఉద్గారాల పట్ల స్పృహ కలిగి ఉండడం ఎంతో అవసరం. ప్రపంచానికి మెరుగైన భవిష్యత్‌కు ఇది కీలకం. వినియోగ ధోరణలను చక్కదిద్దుకోకపోతే సుస్థిర, పర్యావరణ సవాళ్లకు పరిష్కారం లభించదు. తయారీ రంగం వెలువరించే కర్బన ఉద్గారాల వల్లే పూర్తిగా పర్యావరణ సవాళ్లు వస్తున్నట్లు భావించకూడదు. వినియోగం కూడా అందుకు కారణం. వినియోగ డిమాండ్‌పైనే తయారీ ఆధారపడి ఉంటుంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!
వినియోగ ధోరణుల్లో మార్పు రావాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా పర్యావరణ విధ్వంసానికి దక్షిణాది దేశాలు కారణం కాదని..ఇందులో అభివృద్ధి చెందిన దేశాల పాత్రం ప్రధానమని చెప్పారు. అవి చౌక ఇంధనాలను వినియోగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక, పరిశ్రమల మంత్రి ఎంకే నిర్ బర్కత్ ఇదే సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో ఇటలీ, భూటాన్, బహ్రెయిన్, అల్జీరియా, నేపాల్, సెనెగల్, దక్షిణాప్రికా, మయన్మార్, ఖతార్, కంబోడియా దేశాల సీనియర్ మంత్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment