వంద మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఆ ఒక్క అడుగు పడే సమయం కూడా అంతే కీలకమైనది. పదేళ్లు నిండేలోపే కొన్ని అడుగులు నడిచేసింది మాన్యాహర్ష. అవగాహన అడుగులు తాను వేసింది, తోటి పిల్లలతో వేయించింది. తాను చెప్పగలిగిన విషయాన్ని అలతి అలతి పదాలతో ఐదు పుస్తకాలు రాసింది. వాటికి బొమ్మలు వేసింది. గేయాలను స్వరపరుచుకుంది. స్వయంగా పాడి వినిపిస్తోంది. తాజాగా వ్యర్థం కూడా అర్థవంతమేనని నిరూపించింది.
మాన్యా హర్ష ఎకో యాక్టివిస్ట్. క్లైమేట్ అండ్ వాటర్ విభాగంలో పని చేస్తోంది. యాక్టివిస్ట్ అంటే సమస్య మీద గళం విప్పి ఊరుకోవడం కాదు... పరిష్కారం చూపించడం అని నిరూపిస్తోంది. పరిష్కారాన్ని కూడా మాటల్లో కాదు... చేతల్లో చూపిస్తోంది. ఇంట్లో వాడి పారేసే వ్యర్థాలతో పేపర్ తయారు చేసి చూపిస్తోంది.
బెంగళూరులో ఆరవ తరగతి చదువుతున్న మాన్య పిల్లల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించడానికి 2018లో ‘ద వరల్డ్ వాటర్ కన్జర్వేషన్ డే (మార్చి 22) నాడు బెంగళూరు, జేపీ నగర్ వీథుల్లో వాకథాన్ నిర్వహించింది. తల్లిదండ్రులు, పుట్టెనహల్లి లేక్ నిర్వహకుల సహకారంతో దొరసాని ఫారెస్ట్ నుంచి పుట్టెనహల్లి సరస్సు వరకు పిల్లలతో కలిసి మొక్కలు నాటింది. మార్కోనహల్లి డ్యామ్, వర్కా బీచ్ పరిశుభ్రత కార్యక్రమంలో పనిచేసింది. ఇదే సమయంలో నగరంలో కొండల్లా పేరుకుపోతున్న వ్యర్థాలను చూసినప్పుడు వాటిని ఉపయోగంలోకి తీసుకురావడం ఎలా... అనే ప్రశ్న తలెత్తింది.
ఆ ప్రయత్నం ఇంటి నుంచే మొదలు పెట్టింది. పది ఉల్లిపాయల తొక్కల్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి తగినంత నీరు పోసి కుకర్‌లో ఉడికించింది. ఆ తరవాత మెత్తగా గ్రైండ్ చేసింది. ఆ గుజ్జును ఒక పలుచని వస్త్రం మీద సమంగా పరిచి ఆరబెట్టింది. అదనపు నీరు ఇగిరిపోయి గుజ్జు మాత్రం లేత వంగపండు పేపర్‌గా మారింది. మాన్య తన ప్రయోగాన్ని మరింత విస్తరించింది. లేత పసుపు రంగు పేపర్ కోసం మొక్కజొన్న, లేత ఆకుపచ్చ కాగితం కోసం బఠాణి గింజల తొక్కలతోనూ విజయవంతంగా ప్రయోగం చేసింది. పండుగల సమయంలో ఉపయోగించే పూలు, తమలపాకులతో మృదువైన పేపర్‌ని చేసి చూపించింది. పాత దినపత్రికల తో క్యారీ బ్యాగ్‌లు చేసి ప్లాస్టిక్ బ్యాగ్‌లకు బదులుగా వాడమని వీథి పక్కన పండ్లు, కూరగాయలమ్ముకునే వాళ్లకిచ్చింది.
కరోనా డైరీస్
మాన్య తొలి పుస్తకం పేరు ‘నేచర్ అవర్ ఫ్యూచర్’. ప్రకృతి గురించి ఇంగ్లిష్‌లో రాసిన గేయాలకు యూఎన్ వాటర్ విభాగం నుంచి ప్రశంసలందుకుంది. రెండవ పుస్తకం ‘ద వాటర్ హీరోస్’. నీటి ఆవశ్యకత, నీటికొరత మీద రాసింది. దీనికి కేంద్ర జల శక్తి విభాగం అవార్డు వచ్చింది. మూడవ పుస్తకం పేరు ‘నీరిన పుతాని సంరక్షకారు’. ఇది రెండవ పుస్తకానికి కన్నడ వెర్షన్. ఇక కోవిడ్ సమయంలో స్కూళ్లు బంద్ అయ్యాయి. ఈ సుదీర్ఘ విరామంలో మాన్య ‘వన్స్ అప్ ఆన్ ఎ టైమ్ ఇన్ 2020’ అంటూ కరోనా డైరీస్ మొదలు పెట్టింది. దానికి కన్నడ వెర్షన్ కూడా రాసింది. మొత్తం ఐదింటిలో మూడు ఇంగ్లిష్, రెండు కన్నడ భాషల్లో వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ప్రకృతి ఇతివృత్తంగా ఆరవ పుస్తక రచనలో ఉంది. చైల్డ్ ప్రాడిజీ మ్యాగజైన్ టాప్ హండ్రెడ్ చైల్డ్ ప్రాడిజీల జాబితాలో మాన్యను ‘ద నేచర్ హీరో’ టైటిల్‌తో చేర్చింది.
పది రికార్డులు
మూడు పూలు ఆరు కాయలన్నట్లుగా సాగుతోన్న మాన్య ప్రకృతి ఉద్యమంలో ఇప్పటి వరకు పది రికార్డులు అందుకుంది.
► ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మూడు
► ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ∙వజ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్
► వరల్డ్ రికార్ట్స్ ఇండియా ∙గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్
► ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్
► కర్నాటక అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్
అక్షరంతోనే చైతన్యం!
‘‘అమ్మానాన్నలతో కలిసి అనేక ప్రదేశాలకు వెళ్లాను. సరస్సులు, నదులు చాలా చోట్ల చెత్తతో నిండిపోయి ఉంటున్నాయి. చెత్తను లారీల్లో తెచ్చి నీటిలోకి పోయడం కూడా చూశాను. ఎందుకలా చేస్తున్నారని చాలా బాధ కలిగేది. కోపం వచ్చేది. అప్పుడు మా నాన్న ‘మనం అనుకున్న దాన్ని సాధించడానికి గొడవ పడడం మార్గం కానే కాదు. అక్షరం కత్తికంటే పదునైనది. నీ కోపాన్ని అక్షరాల్లో చూపిస్తే నీ కళ్ల ముందు నీటిలో చెత్తను పోసే వాళ్లను మాత్రమే కాక, ఎంతోమందిని చైతన్యవంతం చేయవచ్చు’ అని చెప్పారు. ఎలా రాయాలో కూడా నేర్పించారు. నేను నమ్మేది ఒక్కటే... ఈ ప్రకృతిలో వ్యర్థం అంటూ ఏదీ ఉండదు. మనం దానిని వ్యర్థం అనే భావనతో చూడడం తప్ప’’.
– మాన్యహర్ష, బాల ఉద్యమకారిణి
Comments
Please login to add a commentAdd a comment