
రెండేళ్ల కిందట శ్రీలంకలో లీటర్ పాల ధర రూ.1,100. గ్యాస్ ధర రూ.2,657కి చేరుకుందనే వార్తలు వచ్చాయి. కోవిడ్ కారణంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ స్థాయిలో కాకపోయినా భారత్‌కూ ఇదే తరహా పరిస్థితి దాపురించేదే. కానీ 30 ఏళ్ల కిందట అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత్‌ను ఒడ్డున పడేశాయి.
1991 సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రిగా మన్మోహన్‌సింగ్‌లు జూన్ 25న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ అంపశయ్య మీద ఉంది. విదేశీ దిగుమతుల కోసం ఇండియా దగ్గరున్న మారకద్రవ్యం విలువ ఒక బిలియన్ డాలర్లకే పరిమితమైంది. ఈ నగదు రెండు వారాలకు మించి సరిపోదు. అప్పుడు రావ్ – సింగ్‌ల జోడీ బరిలో దిగింది. కేవలం వంద రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంది
పరపతి పెంచారు
ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే సంచలన నిర్ణయం తీసుకున్నారు మన్మోహన్‌సింగ్. భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందనే వార్తలు బయటకు రాగానే ఎన్నారైలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జూలై 1న డాలరుతో రూపాయి మారకం విలువను 9.5 శాతం తగ్గించారు. దీంతో వెనక్కి మళ్లుతున్న ఎన్నారైల సంపదకు బ్రేకులు పడ్డాయి. దీన్ని శుభసూచకంగా భావించిన మన్మోహన్.. రెండు రోజుల తర్వాత రెండోసారి రూపాయి విలువను 12 శాతం తగ్గించారు. ఒక్కసారిగా రూపాయి విలువ 20 శాతానికి పైగా పడిపోవడంతో ఎన్నారైలు తమ దగ్గరున్న డాలర్లను ఇండియాలోకి పంప్ చేశారు. దీంతో విదేశీ మారకద్రవ్యం లోటుకు తాత్కాలిక అడ్డుకట్ట పడింది.
పరువు కాపాడారు
రూపాయి విలువను తగ్గించినా సరే విదేశీ మారక ద్రవ్యం కొరత దేశాన్ని వేధిస్తూనే ఉంది. ఈ సమస్యను తీర్చేలేక స్విస్ బ్యాంకులో 20 టన్నుల బంగారం తాకట్టు పెట్టి 240 మిలియన్ డాలర్లను అప్పుగా తెచ్చేందుకు అంతకు ముందు ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం అప్పటికే ఐఎంఎఫ్‌తో చర్చలు జరిపింది. కానీ పీవీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ వాణిజ్యంలో అప్పటికే దిట్టగా పేరున్న మన్మోహన్ పూర్తిగా వేరే ప్రణాళిక అమలు చేశారు. 20 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గరే ఉంచి, దాన్ని గ్యారెంటీగా చూపిస్తూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి 600 మిలియన్ డాలర్లు అప్పుగా వచ్చేలా వ్యూహం రచించారు.
లైసెన్స్ రాజ్‌ని బద్దలు కొట్టారు
ఆర్థికమంత్రి హోదాలో 1991 జూలై 25న మన్మోహన్‌సింగ్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. లైసెన్స్ రాజ్ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడంతో పాటు ఎగుమతులపై ఉన్న సబ్సిడీలను ఎత్తి వేయడం, దిగుమతులపై ఉన్న అధిక పన్నులను తగ్గించడం వంటి నిర్ణయాలను ధైర్యంగా తీసుకున్నారు. అంతేకాదు కీలక రంగాల్లో ప్రభుత్వ పెత్తనానికి గుడ్‌బై చెప్పి, ప్రైవేటుకు రెడ్ కార్పెట్ వేశారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరించారు. దీంతో బ్లాక్‌మనీకి చాలా వరకు అడ్డుకట్ట పడింది.
నగదు వచ్చేలా..
బ్యాంకుల జాతీయీకరణతో రెడ్ టేపిజం పెరిగిపోయింది. కొత్త పరిశ్రమలకు పెట్టుబడులు సమకూర్చేందుకు బ్యాంకులు సతాయించేవి. ప్రభుత్వ ఆర్థిక సంస్థలు లేనిపోని నిబంధనలతో మోకాలడ్డేవి. ఈ రెండింటికీ చెక్ పెడుతూ ప్రైవేటు బ్యాంకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన్మోహన్‌సింగ్. ప్రభుత్వ ఆర్థిక సంస్థల పెత్తనానికి చెక్ పెట్టారు. కీలకరంగాల్లో విదేశీ పెట్టుబడులను 51 శాతం వరకు అనుమతి ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రైవేటు రంగం ఊపందుకుంది. పరిశ్రమలు విరివిగా వెలిశాయి. దేశ యువతకు ఉపాధి లభించడం మొదలైంది. మొత్తంగా మోకాళ్లపై నడుస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా లేచి దౌడు తీసేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడ్డాయి.
‘సెంచరీ’ ఫలితాలు
మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అవక ముందు 1990 అక్టోబర్‌లో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ, ఇండ్రస్టియల్ వర్కర్స్) డబుల్ డిజిట్ క్రాస్ చేసింది. 1991 జూలైలో మన్మోహన్‌సింగ్ బడ్జెట్‌లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, రూపాయి విలువ తగ్గించి, లైసైన్స్ రాజ్‌కు చెక్ పెట్టారు. వీటి ఫలితాలు కనిపించేందుకు ఏడాది సమయం పట్టింది. ఫలితంగా 1992 సెప్టెంబర్ నుంచి వేజ్ ప్రైస్ లెవల్ 10కి దిగువకు పడిపోవడం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఆర్థిక ఫలాలను మనం ఈ రోజు అనుభవిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment