
ఒకప్పుడు.. అందమంటే మన వాళ్లకి అందనంత దూరం. పోటీలు పెడితే విన్నర్ల దగ్గరి నుంచి రన్నర్ల దాకా అంతా వాళ్లే కనిపించేవారు. అయితే ఇప్పుడా సీన్ మారింది. అందాల పోటీల్లో మన సుందరీమణులు అస్సలు తగ్గేదే లే అంటున్నారు.

ఇప్పటివరకు జరిగిన అందాల పోటీలను పరిశీలిస్తే.. వెనిజులా అనే దక్షిణ అమెరికా దేశం టాప్ పొజిషన్‌లో ఉంటుంది.

మిస్ వరల్డ్ , మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్.. ఇలా నాలుగు ప్రతిష్టాత్మక పోటీలను కలిపి చూస్తే 21 కిరీటాలతో, 40 రన్నరప్‌లతో ఏ దేశానికి ‘అంద’నంత దూరంలో ఉండిపోయింది. అయితే..

ఇలాంటి దేశానికి.. ఒక్క విషయంలో సరితూగేలా భారత్ నిలిచింది.

ఇప్పటిదాకా జరిగిన అందాల పోటీల్లో భారత సుందరీమణులు ఆరుగురు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నారు. ఈ విషయంలో వెనిజులా ఆరు టైటిల్స్ గెల్చుకుని భారత్‌తో సమానంగా ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది.

మొత్తంగా చూసుకుంటే ఇప్పటిదాకా భారత్ నాలుగు అందాల పోటీలను కలిపి ఎనిమిది టైటిల్స్, 15 రన్నరప్‌లను కైవసం చేసుకుంది.

అత్యధికంగా బ్యూటీ క్వీన్ టైటిల్స్ గెలుచుకున్న దేశాల జాబితాలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది.

వెనిజులా, అమెరికా, ఫిలిప్పైన్స్ భారత్ కంటే ముందు ఉండగా.. ప్యూర్టోరికా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో ఉన్నాయి.

ఒకప్పుడు అందం విషయంలో వెనుకబడిన భారత్..ఇప్పుడు ఆ వేదికలపై బలమైన ప్రదర్శన ఇస్తోంది.

ఈరోజుల్లో.. అందాల పోటీలు సాంస్కృతిక విలువతో కూడుకుందనే భావన పెరిగిపోయింది. విద్యా సంస్థల దగ్గరి నుంచి.. దాదాపు ప్రతీ చోటా వీటికి ఆదరణ లభిస్తోంది.

ఆత్మస్థైర్యంలో మారిన ధోరణి కూడా ఇందుకు ఓ కారణం. సోషల్ మీడియా పుణ్యమాని ఎలాంటి విషయమైనా అవగాహన పెంచుకుంటున్నారు. ఫ్యాషన్, ఫిట్‌నెస్, పబ్లిక్ స్పీకింగ్ వంటి రంగాలలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఇది అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధం కావడానికి వాళ్లకు ఉపయోగపడుతోంది కూడా.

నేటి విజయం.. రేపటి మరో విజయానికి స్ఫూర్తిగా మారుతోంది. పెట్టుబడులు, స్పాన్సర్ల రూపంలో ప్రోత్సాహం దిశగా అడుగులు చేయిస్తోంది. భవిష్యత్తులో పోటీలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలు అందేలా చేస్తున్నాయి.