తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ పెద్దలు జరిపిన భేటీ పెద్దగా ఫలితమిచ్చినట్లు లేదు. బెనిఫిట్ షోలతోపాటు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి రేవంత్ రెడ్డి తన వాదనకు కట్టుబడి ఉండటంతో సినీ రంగం పెద్దలకు పాలుపోని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.
బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని, టిక్కెట్ ధరలు విచ్చలవిడిగా పెంచుకోవడమూ సాధ్యం కాదని సీఎం కుండబద్ధలు కొట్టారు. పైగా తెలంగాణలో ఏర్పాటు చేయనున్న గురుకులాల కోసం సినిమా పరిశ్రమ నుంచి ఒక శాతం సెస్ వసూలు చేస్తామని కూడా సీఎం స్పష్టం చేయడంతో వారు నిస్సహాయులై, నిట్టూర్పులతో సమావేశం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం ఒక మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం మాత్రం కొంత ఉపశమనమిచ్చే అంశం. ఈ ఉప సంఘం ద్వారా సినీ నిర్మాతలకు, ప్రభుత్వానికి మధ్య రాజీకి ప్రయత్నమేదైనా జరుగుతుందా? అల్లూ అర్జున్ విషయంలో ఏదైనా రాజీ కుదిరిందా? లేదా? అన్నది వేచి చూడాల్సిన అంశాలు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండగా కూడా సినీ పరిశ్రమతో సత్సంబంధాల కోసం గట్టి ప్రయత్నమే జరిగింది. వైఎస్ జగన్.. సీనీ రంగ ప్రముఖులందరినీ సాదరంగా ఆహ్వానించి, గౌరవించారు. పరిశ్రమను ఆంధ్రకు తరలించాలని, ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలిస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ ఈ విషయంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు దుష్ప్రచారం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా అబద్దపు ఆరోపణలు చేశారు. మురళీ మోహన్ వంటి వారు ఎల్లో మీడియాతో మాట్లాడుతూ తమ కార్లను వైఎస్ జగన్ ఇంటి గుమ్మం వరకు రానివ్వలేదని తప్పుడు మాటలు మాట్లాడారు.
చిన్న సినిమాలకూ రక్షణ ఉండాలని, ఏపీలో 30 శాతం షూటింగ్ చేయాలని, పెట్టుబడి వంద కోట్లు ఉంటే జీఎస్టీ వివరాలు ఇచ్చి ప్రోత్సాహాలు తీసుకుని, ధరలు కూడా పెంచుకోవచ్చని జగన్ చెబితే ఎల్లో మీడియా నానా రకాల అసత్యాలు ప్రచారం చేసింది. వైఎస్ జగన్‌కు కక్ష అని అన్నారు. టీడీపీ అనుకూల పత్రిక యజమాని జగన్‌కు సినిమా వాళ్లంటే పడదా అన్న ప్రశ్న వేస్తే ఖండించాల్సిన మురళీ మోహన్ సమర్థిస్తూ మాట్లాడారు. ఇప్పుడు అదే మురళీ మోహన్ తెలంగాణ సీఎంతో సమావేశమైనప్పటికీ తమ డిమాండ్లు నెరవేర్చాలని కనీసం గట్టిగా అడగనైనా అడగలేకపోయారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే గిట్టుబాటు కాదని మాత్రం గొంతు పెగల్చగలిగారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు వంటి వారు కూడా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ తదితర అంశాల గురించి మాట్లాడారే తప్ప అసలు సమస్యను మాత్రం వివరించలేకపోయారు.
ఇక, అల్లు అర్జున్‌పై కేసు విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి ఈ చర్యను గట్టిగా సమర్థించుకున్నారు. అయినా సరే.. ఆయన తప్పు లేదని చెప్పే సాహసం సినీ రంగ పెద్దలకు లేకపోయింది. ఆస్తులు, వ్యాపారాలన్నీ హైదరాబాద్‌లోనే ఉండటంతో వాళ్లు ఏమీ మాట్లాడలేకపోయారని, చివరకు బౌన్సర్లతో సమస్యలేమి వస్తాయని కూడా అడగలేకపోయారని అనిపిస్తోంది. రేవంత్ ఒక విషయం తేల్చి చెప్పారు. అల్లు అర్జున్‌పై తనకు కోపం ఏమీ లేదంటూనే.. ఆయన ఏదో ఫంక్షన్‌లో తన పేరు మరచిపోయినందుకు కేసు పెట్టానన్న ప్రచారాన్ని సినీ ప్రముఖులు ఖండించకపోవడాన్ని మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఈగో ఇక్కడే దెబ్బతిందన్న విషయాన్ని ఆయన కూడా నిర్దారించారన్నమాట.
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆరోపణలను సినిమా వాళ్లు ఖండించలేదని కూడా ఆయన బాధపడ్డారు. ఒకవేళ అలాంటి రాజకీయ అంశాలలో జోక్యం చేసుకుంటే ఇతర పార్టీలకు ఆగ్రహం రావచ్చు. అయినా ఆ మాట చెప్పలేకపోయారు. సినిమా పరిశ్రమకు కూడా సామాజిక బాధ్యత ఉంటుందని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు మద్దతివ్వాలని రేవంత్ కోరడం తప్పు కాదు కానీ అలాంటి సినిమాలు తీస్తే వచ్చే నష్టాన్ని భరించేదెవరు. అలాగే ముఖ్యమంత్రి పిలుపు మేరకు అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీయాలన్నా భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. ప్రేక్షకులకు థియేటర్లకు రావడమే గగనమైన ఈ కాలంలో విడుదలైన వారం రోజుల్లో పెట్టుబడులు రాబట్టుకోలేకపోతే వారి పరిస్థితి ఏమిటి? ఈ విషయాలన్నీ రేవంత్‌కు తెలియనివి కావు. కానీ శాసనసభలో బెనిఫిట్ షోలు, ధరల పెంపు లేవని ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలో వాటికే ఆయన కట్టుబడి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ హయాంలో టిక్కెట్ల పెంపుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే పవన్ ఒంటి కాలుపై లేచిన విషయాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. అప్పట్లో మాదిరిగా సీఎంకు, టిక్కెట్ల ధరలతో సంబంధం ఏమిటని ఇప్పుడు కూడా ప్రశ్నించి ఉండాలి కదా? పది రోజులుగా కిక్కురుమంటే ఒట్టు!. బహుశా ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్ అక్కరకు రాలేదనుకుంటా. లేదా రేవంత్ ఇచ్చిన షాక్‌కు దిమ్మతిరిగి ఉండాలి. జగన్ సినీనటుడు చిరంజీవిని ఇంటికి పిలిచి విందు ఇచ్చి పంపిస్తే.. ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు.. ‘చిరంజీవితో దండం పెట్టించుకుంటారా’ అని ప్రశ్నించారు. అబద్ధమని వారికీ తెలుసు. చిరంజీవి ఈ మధ్యే రేవంత్‌ను కలిసినప్పుడు కూడా రెండు చేతులతో నమస్కారం చేశారు. విశేషం ఏమిటంటే.. చిరంజీవితోపాటు బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు కూడా రేవంత్ భేటీకి రాలేదు. బెనిఫిట్ షోలకు అనుమతించడం లేదు కనుక, వారు హాజరైతే అది అసౌకర్యంగా ఉంటుందని, అందువల్లే రాలేదని కొందరు చెబుతున్నారు.
తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ది సంస్థ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు సమావేశం తర్వాత అసలు బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరల పెంపులు చిన్న విషయాలని, చర్చించలేదని, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడామని వివరణ ఇచ్చారంటేనే రేవంత్‌ను ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవడానికి ఈ సమావేశం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్దిష్ట ఎజెండా లేకుండా వీరంతా భేటీ అయ్యారన్నమాట. అయితే, బయట మాత్రం రేవంత్.. సినీ పరిశ్రమను తన దారిలోకి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. అలాంటిదేదీ లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా, చూడడానికి మాత్రం అది నిజమే అనిపించకమానదు.
చెరువును ఆక్రమించుకున్నారన్న ఆరోపణలపై హైడ్రా తన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసిన తరువాత కూడా ప్రముఖ నటుడు నాగార్జున సైతం రేవంత్‌కు శాలువ కప్పడం ఆషామాషీగా జరిగే వ్యవహారం కాదన్నది వీరి విశ్లేషణ. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖపై నాగార్జున పరవు నష్టం దావా అయితే వేయగలిగారు కానీ.. కాంగ్రెస్ పార్టీ ఆమెను పల్లెత్తు మాట కూడా అనలేదు. మందలించినట్లు కూడా లేదు. అయినా కూడా నాగార్జున సీఎంను కలిసి మాట కలపాల్సిన సందర్భం వచ్చిందన్నమాట.
సినీ నటులకు రాజకీయ సంబంధాలు ఎందుకు అని రేవంత్ ప్రశ్నించడం విడ్డూరమే. రేవంత్‌కు నిజంగానే తెలియవని అనుకోవాలా?. సినీ నటుడే స్థాపించిన పార్టీ నుంచే ఆయన వచ్చారు కదా?. పైగా సినీ నటులను అడ్డం పెట్టుకుని రాజకీయం నడిపిన పార్టీలోనే ఆయనా ఉన్నారు. మురళీ మోహన్ లాంటి వారు టీడీపీ తరఫున ప్రచారం చేశారు.. ఎంపీ అయ్యారు. ఇతర పార్టీల విషయానికి వస్తే కృష్ణ.. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. జనసేనతో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం చేస్తున్నారు.
..నాగబాబు జనసేన నేతగా ఉంటూ చంద్రబాబు కేబినెట్‌లో చేరడానికి సిద్దం అవుతున్నారు. వీరు రాజకీయాలలో ఎలాంటి పాత్ర అయినా పోషించవచ్చు. కానీ, అల్లు అర్జున్ మాత్రం వైఎస్సార్‌సీపీ నేత రవిచంద్ర కిషోర్‌ను నంద్యాలలో కలవడం పెద్ద తప్పు అట. ఇలాంటి విషయాలలో సినీ పరిశ్రమ ఒక మాట మీద ఉండదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అన్న సూత్రం అందరికీ వర్తిస్తుంది. పెద్ద సినీ నిర్మాతలు నిజంగానే భయపడ్డారా? లేక ప్రస్తుతానికి నటిస్తున్నారా? రేవంత్ కోపం తగ్గాక తమ డిమాండ్లను నెరవేర్చుకుంటారా? లేక రేవంత్ ప్రభుత్వంపై పోరుబాటకు దిగుతారా? అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్.
రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment