
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) తమ బ్యాటింగ్ పవరేంటో చూపించారు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ... కొరకరాని కొయ్యగా మారి వారి సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను రెడ్డి- వాషీ జోడీ సాధించింది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించిన భారత జట్టు.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓడిపోయింది.
అనంతరం బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకోగలిగింది. తద్వారా 1-1తో సిరీస్‌లో సమంగా ఉన్న రోహిత్ సేన.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పక గెలవాలి.
పటిష్ట స్థితిలో ఆసీస్
అయితే, మెల్‌బోర్న్ వేదికగా గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టులో ఆదిలోనే టీమిండియాకు షాకులు తగిలాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషేన్(72) అర్ధ శతకాలతో మెరవగా.. స్టీవ్ స్మిత్ శతక్కొట్టాడు(140).
స్వీయ తప్పిదాలతో
మిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ(31), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(49) కూడా రాణించారు. ఫలితంగా ఆసీస్ పటిష్ట స్థితిలో నిలవగా.. మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు మళ్లీ ఎదురుదెబ్బలే తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(3), కేఎల్ రాహుల్(24), విరాట్ కోహ్లి(36), ఆకాశ్ దీప్(0), రిషభ్ పంత్(28), రవీంద్ర జడేజా(17) విఫలమయ్యారు.
ఇరగదీసిన రెడ్డి, వాషీ
మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(82) శతకం దిశగా పయనించినా.. అనవసరంగా సింగిల్‌కు యత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో బ్యాటింగ్ చేసిన నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డారు.
ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్‌కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి తన అంతర్జాతీ కెరీర్‌లో తొలి శతకం నమోదు చేయగా.. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో అలరించాడు. ఇక ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ఎట్టకేలకు కంగారూ జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ ఆ పని చేయగలిగాడు. అతడి బౌలింగ్‌లో వాషీ(50) స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో శతక భాగస్వామ్యానికి తెరపడ్డప్పటికీ నితీశ్ రెడ్డి- వాషింగ్టన్ సుందర్ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు.
ప్రపంచ రికార్డు
టెస్టు క్రికెట్ చరిత్రలో ఎనిమిది, తొమ్మిది స్థానాలో బ్యాటింగ్ చేసి.. ఒకే ఇన్నింగ్స్‌లో 150కి పైగా బంతులు ఎదుర్కొన్న మొట్టమొదటి జోడీ రెడ్డి- వాషీ. మెల్‌బోర్న్‌లో మూడో రోజు ఆట ముగిసేసరికి వాషీ 162 బంతుల్లో 50 పరుగులు చేసి అవుట్ కాగా.. నితీశ్ రెడ్డి 176 బంతుల్లో 105(10 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక భారత్ స్కోరు: 358/9 (116). ఆస్ట్రేలియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, స్కాట్ బోలాండ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. నాథన్ లియాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
చదవండి: Nitish Reddy: కొడుకంటే ఇలా ఉండాలి!.. భావోద్వేగంతో తండ్రి కన్నీళ్లు! వీడియో
A fantastic effort from Washington Sundar to bring up his 50! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/xIIJ3go51r
— cricket.com.au (@cricketcomau) December 28, 2024