విషయం వీక్‌గా ఉన్నప్పుడే.. పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందనేది ఓ నానుడి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విషయంలో అది పూర్తి వ్యతిరేకంగా. స్టేట్స్ మన్‌గా సెన్సేషన్సలిజానికి వీలైనంత దూరంగా ఉండేవారాయన. ఆయన వస్తున్నారంటే.. మీడియా కూడా పెద్దగా హడావిడి చేసేది కాదు. దీనిని అలుసుగా తీసుకునే ప్రతిపక్షాలు ఆయన వ్యక్తిత్వాన్ని మరోలా ప్రొజెక్ట్ చేశాయి. ఆయన్ని రకరకాలుగా నిందించాయి. అయితే ఆయన మౌనం వెనుక కారణాలు లేకపోలేదు..
‘‘మన్మోహన్ అనే వ్యక్తి ఓ సైలెంట్ పీఎం.. దేశానికి డమ్మీ పీఎం. ఆయనకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడమంటే భయం. మన్మోహన్ సింగ్ కాదు.. ఆయన మౌనమోహన్ సింగ్. అధిష్టానం చేతిలో ఆయనొక కీలు బొమ్మ. జన్‌పథ్ నుంచే దేశ పాలన అంతా సాగుతోంది’’.. యూపీఏ రెండు టర్మ్‌ల పాలనలో ప్రతిపక్షాలు తరచూ ఈ విమర్శలు చేసేవి. కానీ.. ప్రధానిగా ఆయన ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చారు. వాటిని నిశితంగా విశ్లేషిస్తే.. ఆయన ప్రెస్‌మీట్‌లో అనవసర అంశాలు కనిపించవు. దేశ, అంతర్జాతీయ, ఆర్థిక సంబంధిత అంశాలపై అలవోకగా మాట్లాడేవారు.
అలాగే పాలనాపరమైన నిర్ణయాలను ప్రకటించేవారు. మైకుల ముందు మన్మోహన్ సింగ్(Manmohan Singh) ముక్కుసూటిగా మాట్లాడేవారు. విషయం ఏది ఉన్నా.. నిర్దిష్టంగా, స్పష్టంగా చెప్పేవారు. రాజకీయ విమర్శలు చేయడం అత్యంత అరుదుగా ఉండేది. అయితే.. నెమ్మదిగా మాట్లాడడం ఆయనకంటూ ఓ మైనస్ అయ్యింది.
ఇక.. డిజిటల్ మీడియా ఆయన హయాంగా ఉన్న టైంలోనే అభివృద్ధి చెందింది. కానీ, సమకాలీన రాజకీయ నేతల్లో సోషల్ మీడియాను పరిమితంగా ఉపయోగించారాయన. సంప్రదాయ మీడియా మీదే ఆయన దృష్టంతా ఉండేది. మన్మోహన్ తన పుస్తకం ‘‘ఛేజింగ్ ఇండియా’’లోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా తన నాయకత్వ లక్షణాలను సమర్థించుకున్నారు కూడా.
‘‘ఆ టైంలో మీడియా ఫోకస్ అంతా వేరేలా ఉండేది. ఆయన ప్రెస్ మీట్ అంటే పెద్ద హడావిడి ఉండేది కాదు. ఆయన సూచన మేరకే అలా జరిగేది!. తనను ప్రధానిగా కూడా ప్రమోట్ చేసుకోవడానికి అంతగా ఆయన ఆసక్తి చూపించేవారు కాదు. అందుకు రాజకీయ పరమైన కారణాలూ ఉండొచ్చు. ఇప్పుడున్నట్లు సోషల్ మీడియా ఉండి ఉంటే.. ఆయన ఎంతటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తో.. హుషారైన వ్యక్తో ప్రతీ ఒక్కరికీ తెలిసి ఉండేది’’ అని ఓ సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ఆయన నిష్క్రమణ తర్వాత మరికొందరు జర్నలిస్టులు ఆయనతో ఇంటెరాక్షన్ సమయంలో అనుభవాల్ని పంచుకోవడమూ చూస్తున్నాం.
పదేళ్లపాటు.. 2004-2014 మధ్య యూపీఏ తరఫున ప్రధానిగా ఆయన 117సార్లు మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. మీడియా సమావేశాలు, విదేశీ పర్యటనల్లో విలేకరులతో ఇంటెరాక్షన్, దేశీయ పర్యటనలు, వార్షిక సమావేశాలు, రాజకీయ.. ఎన్నికల ప్రచారాలు మొత్తం కలిపి ఉన్నాయి. ప్రత్యేకించి విదేశీ పర్యటనలో.. తిరుగు ప్రయాణాల్లో.. ఆయన విమానాల్లోనే జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే అవి విమర్శలకు సైతం తావిచ్చాయి కూడా.
అలాగే మీడియా ముందుకు వచ్చేందుకు ఏనాడూ ఆయన తటపటాయించేవారు కాదు.. అది ఎంత పెద్ద అంశమైనా అనర్గళంగా మాట్లాడేవారు. మీడియా ముఖంగా ఆయన కఠినంగా మాట్లాడింది లేదు. అయితే ఈ మృదు స్వభావమే ఆయన్ని మీడియాలో పెద్దగా హైలెట్ చేయలేకపోవడానికి ప్రధాన కారణమైంది. అదే సమయంలో.. డిగ్నిఫైడ్ లీడర్‌గా ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టింది.
మన్మోహన్.. పుట్టిపెరిగిన పరిస్థితులు కూడా ఆయన రిజర్వ్డ్ నేచర్‌కు మరో కారణం. బ్రిటిష్ ఇండియాలో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించిన మన్మోహన్.. విభజన తర్వాత భారత్‌కు వలస వచ్చారు. అయితే బాల్యంలో ఆయన అల్లరి మాములుగా ఉండేది కాదట. ఈ విషయాన్ని ఆయన బాల్య స్నేహితుడు రాజా ముహ్మద్ చాలా ఏళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మన్మోహన్ తండ్రి డ్రైఫ్రూట్స్ వ్యాపారి. దీంతో ఆయన తన జేబులో ఏవో ఒకటి తీసుకుని వచ్చేవారట. వాటి కోసం జరిగిన అల్లరి అంతా ఇంతా కాదని చెప్పారాయన.మన్మోహన్ ప్రధాని అయ్యాక.. తన బాల్య స్నేహితుడిని చూసేందుకు నేరుగా ఆయన నివాసానికే వెళ్లారు రాజా ముహ్మద్.
ఇక తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో నాయనమ్మ దగ్గరే పెరిగారాయన. ఆ టైంలోనే ఆయనలోని అల్లరి మరుగున పడింది. ఆమె సంరక్షణలో ఆయన ఎంతో క్రమశిక్షణ అలవర్చుకున్నారు. కరెంట్ లేని ఓ గ్రామంలో కిరోసిన్ దీపపు వెలుగులోనే చదువుకునేవారు. స్నేహితులతో కలిసి ఆయన బయటకు వెళ్లడం.. ఆడడం అరుదుగా ఉండేవి. ఉన్నత విద్య సమయంలో.. ఆర్వాత ఉన్నత పదవులు అధిరోహించిన టైంలోనే ఆయన ఒద్దికగా ఉన్నారు. ప్రధానిగా దిగిపోయాక.. రాజకీయాలకు ఆ కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది!. పైగా చిన్నప్పటి నుంచి ఆయన ఓ విషయాన్ని అలవర్చుకున్నారు. ఎక్కువ వినడం.. ఎక్కువగా అర్థం చేసుకోవడం.. తక్కువగా మాట్లాడం.. వెరసి మౌనమునిగా బతకడం. ఇదే ఆయన తుదిశ్వాస విడిచేవరకు పాటిస్తూ వచ్చారు.
మేధావులు మౌనం వహించినప్పుడు.. మూర్ఖుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం
::నెల్సన్ మండేలా
ఒక మూర్ఖుడి ఆవేశం కన్నా ఒక మేధావి మౌనం ఈ దేశానికి చాలా ప్రమాదకరం
:::నేతాజీ సుభాష్ చంద్రబోస్
Comments
Please login to add a commentAdd a comment