
అవును. ఈ బుల్లి ఇల్లు నిజంగానే రెండు దేశాల పరిధిలో విస్తరించింది! ఈ గమ్మత్తైన ఇల్లు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోని లోంగ్వా గ్రామంలో ఉంది. ఇది కాస్త భారత్‌లో, మిగతా భాగం మయన్మార్ పరిధిలో ఉంటుంది! భారత్, మయన్మార్ సరిహద్దు సరిగ్గా ఈ గ్రామం నడుమగా పోవడమే దీనికి కారణం. ప్రధాన ద్వారానికి ఆ పక్క సగంపై నాగాలాండ్ (భారత్), ఈ పక్క సగంపై సగాయింగ్ (మయన్మార్) అని రాసి ఉంటుంది కూడా.
ఇంటి బయట ఠీవిగా నుంచున్నది దాని యజమాని టోనెయ్ ప్వాంగ్. అన్నట్టూ, ఆయన స్థానిక కోన్యాక్ నాగా గిరిజన తెగ నాయకుడు కూడా. ఆరకంగా చూస్తే ఆయన నివాసం లోంగ్వా గ్రామం మొత్తానికీ రాజప్రాసాదం వంటిదన్నమాట. ఈ ఇంటికి 100 ఏళ్ల పై చిలుకు చరిత్ర ఉంది. అంతర్జాతీయ సరిహద్దు మాత్రం 1971లో పుట్టుకొచ్చింది. ప్వాంగ్ ఇంటిని రెండు దేశాలకూ చెందేలా విడదీసింది.
‘‘అంతర్జాతీయ సరిహద్దు 50 ఏళ్ల కింద పుట్టుకొచ్చింది. మా ఇల్లు అంతకు 50 ఏళ్ల ముందునుంచే ఉంది. సరిహద్దు భూభాగాన్ని విభజిస్తుందేమో గానీ ఇది మా పూరీ్వకుల ఆవాసం. ఇందులో ఉండేందుకు మాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవడం లేదు’’ అంటారు ప్వాంగ్. ఈ ఊళ్లోని వాళ్లంతా భారతీయులే. అందరికీ ఓటు హక్కు కూడా ఉంది. అయినా వారికి మయన్మార్ నుంచి పలు సంక్షేమ పథకాలు అందుతుండటం విశేషం! ఈ ఊళ్లో రెండు దేశాల సైన్యాలూ గస్తీ కాస్తుంటాయి. అంతేకాదు. ఈ ప్రాంతంలో భారత్, మయన్మార్ ప్రజలు వీసా తదితరాలేవీ అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment