
సత్ఫలితాలిస్తున్న ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్
క్యూలో పడిగాపులు లేకుండా చెక్ ఇన్
తరచూ విదేశాలకు వెళ్లివచ్చేవారి కోసం ప్రారంభం
వీరికోసం ప్రత్యేకంగా ఈ–గేట్‌ల ఏర్పాటు
విమానం మిస్సవుతుందనే భయం లేదు. నిశ్చింతగా బయలుదేరవచ్చు. గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ – ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీఐ–టీటీపీ) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సత్ఫలితాలిస్తోంది.
ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా విదేశాలకు క్రమం తప్పకుండా ప్రయాణించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. సాధారణ ఇమిగ్రేషన్ క్యూలైన్‌లకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ, నిష్క్రమణ ఈ–గేట్‌లను ఏర్పాటు చేశారు. – సాక్షి, హైదరాబాద్
నమ్మకమైన ప్రయాణికుల కోసమే..
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 70 వేల మందికి పైగా డొమెస్టిక్ (దేశీయ), ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో 10 వేల మందికి పైగా విదేశాలకు వెళ్లి వచ్చేవారు ఉన్నారు. వీరిలో తరచూ ప్రయాణించేవారికి ఈ ఫాస్ట్‌ట్రాక్ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంది. టూరిస్టులు, రెండుమూడేళ్లకోసారి విదేశీ ప్రయాణం చేసేవాళ్లు ఈ సేవలను వినియోగించుకోలేరని, తరచూ రాకపోకలు సాగించే నమ్మకమైన ప్రయాణికుల కోసమే దీనిని అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు.
‘ఇది భారతీయ పాస్ట్‌పోర్ట్‌లు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులు కలిగిన వాళ్ల కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ. ఇమిగ్రేషన్ చెక్ కోసం క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను ముగించి రాకపోకలు సాగించవచ్చు’అని ఆయన చెప్పారు.
ఇప్పటివరకు 500 మందికి పైగా ఎఫ్‌టీఐ–టీటీపీలో వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. రోజూ 10 – 15 మంది వరకు ఈ సేవలను వినియోగించుకుంటున్నారని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరికోసం ప్రత్యేకంగా 8 గేట్లను వినియోగిస్తున్నామని తెలిపారు.
దరఖాస్తు ఇలా..
ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే www.ftittp.mha.gov.in వెబ్‌సైట్‌లో ప్రయాణికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి. దరఖాస్తు సమయంలోనే పాస్‌పోర్ట్‌ను అప్‌లోడ్ చేసి, ఇతర అన్ని వివరాలు నమోదు చేయాలి. భద్రతాపరమైన తనిఖీల అనంతరం ఎఫ్‌టీఐ–టీటీపీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ సమాచారాన్ని ఇమిగ్రేషన్ బ్యూరో పరిశీలించి ఆమోదిస్తే, ఆ సమాచారం ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. ఈ మెయిల్‌కు కూడా సందేశం వస్తుంది. వేలిముద్రలు, ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసేందుకు ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక కౌంటర్లలో సంప్రదించవలసి ఉంటుందని అధికారులు తెలిపారు.
సేవలు ఇలా..
⇒ ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ సదుపాయం కలిగిన ప్రయాణికులు వీసా తనిఖీ పూర్తయిన తరువాత బోర్డింగ్ పాస్ కోసం రిజిస్టర్డ్ ప్యాసింజర్ చెక్–ఇన్ కౌంటర్‌లో సంప్రదించాలి.
⇒ బోర్డింగ్ పాస్ తీసుకున్న తరువాత ఇమిగ్రేషన్ కోసం వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్‌ల వద్దకు వెళ్లాలి.
⇒ మొదటి గేట్ వద్ద పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ స్కానింగ్ పూర్తవుతుంది. దీంతో రెండో ఈ–గేట్‌కు అనుమతి లభిస్తుంది.
⇒ రెండో ఈ–గేట్ వద్ద ప్రయాణికుడి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ధ్రువీకరణ అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ప్రయోజనాలు ఇవీ..
⇒ సాధారణ ఇమిగ్రేషన్ ప్రక్రియలో వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికులంతా ఒకే క్యూలైన్‌లో వెళ్లవలసి ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కోసారి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే గంటకు పైగా పడిగాపులు తప్పవు.
⇒ అంతర్జాతీయ ప్రయాణికులు విమానం బయలుదేరడానికి 3 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. ఆ తరువాత సంబంధిత ఎయిర్‌లైన్స్‌లో క్యూలో వేచి ఉండి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. అదే సమయంలో లగేజ్ చెక్ –ఇన్ ఉంటుంది. ఆ తరువాత వరుసగా భద్రతా తనిఖీలు, ఇమిగ్రేషన్ లైన్‌లలోకి వెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎఫ్‌టీఐ టీటీపీ వ్యవస్థలో ముందే వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సాధారణ భద్రతా తనిఖీల అనంతరం నేరుగా ఈ–గేట్ ద్వారా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని వెళ్లవచ్చు. డిజియాత్ర మొబైల్ యాప్ ఉన్న ప్రయాణికులు బోర్డింగ్‌పాస్‌ను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment