gates
-
తుంగభద్ర గేట్లన్నీ మార్చాల్సిందే
సాక్షి, అమరావతి/సాక్షి, బళ్లారి/హొసపేటె: తుంగభద్ర డ్యామ్ గేట్లన్నీ మార్చాల్సిందేనని సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని కమిటీ బోర్డుకు స్పష్టం చేసింది. ఏ డ్యాం గేట్లైనా 45 ఏళ్లు మాత్రమే సమర్థంగా పనిచేస్తాయని పేర్కొంది. తుంగభద్ర డ్యామ్ గేట్లు 70 ఏళ్లుగా పనిచేస్తున్నాయని.. తుప్పుపట్టినప్పుడు దాన్ని తొలగించి రంగులు వేస్తుండటం వల్ల వాటి మందం తగ్గిందని, బలహీనంగా మారాయని తెలిపింది. దీనివల్లే ఆగస్టు 10న డ్యాం 19వ గేటు కొట్టుకుపోయిందని తేల్చిచెప్పింది. డ్యామ్ భద్రత దృష్ట్యా 33 గేట్లనూ మార్చి.. వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను బుధవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ, సీడబ్ల్యూసీకి ఏకే బజాజ్ అందించనున్నారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు గేట్ల మార్పుపై తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోనుంది. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుచేయడానికే రూ.5 కోట్లకుపైగా బోర్డు వ్యయం చేసింది. ఈలెక్కన పూర్తి స్థాయిలో ఒక్క గేటు ఏర్పాటుకు రూ.8 కోట్లపైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 33 గేట్లు ఏర్పాటుచేయాలంటే రూ.264 కోట్లకుపైగా వ్యయం అవుతుందని చెబుతున్నారు. గేట్లు ఎత్తడానికి దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ వంటి అధునాతన వ్యవస్థను ఏర్పాటుచేయాలంటే అదనంగా మరో రూ.వంద కోట్ల వరకూ వ్యయం అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఈ వ్యయాన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నీటి కేటాయింపులు, ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాల్సి ఉంటుంది. బజాజ్ కమిటీ సమగ్ర అధ్యయనంతుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో డ్యామ్ గేట్లు, భద్రతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. దాంతో తుంగభద్ర డ్యామ్ గేట్లపై అధ్యయానికి సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ అధ్యక్షతన గేట్ల నిపుణులు హర్కేశ్ కుమార్, తారాపురం సుధాకర్ సభ్యులుగా కేంద్రం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఆదివారం, సోమవారం డ్యామ్‌ను సమగ్రంగా పరిశీలించి.. గేట్ల పనితీరుపై అధ్యయనం చేసింది. -
నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా..
ఢిల్లీ: దేశంలో నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలయ్యాయి. రేపు కొత్త పార్లమెంట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే.. కొత్త పార్లమెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చే గుమ్మాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పార్లమెంట్ భవనంలో ఆరు దర్వాజలకు ఆరు పౌరాణిక ప్రాణుల పేర్లను పెట్టారు. ఈ ఆరు ప్రాణులు 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేకతలను సూచిస్తున్నాయి. అవేంటంటే.. నూతన పార్లమెంట్లో ఆరు ద్వారాలు ఉన్నాయి. అవి.. గజ ద్వారం, అశ్వ ద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, శార్దూల ద్వారం, హంస ద్వారం. ప్రతి ద్వారం దాని పేరుపై ఉన్న ప్రాణి శిల్పాన్ని కలిగి ఉంది. గజ ద్వారం.. బుద్ధి, జ్ఞాపకశక్తి, సంపద, జ్ఞానాన్ని సూచించేది ఏనుగు. దీని పేరు మీదుగా గజ ద్వారంగా ఓ గుమ్మానికి పేరు పెట్టారు. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపు ఉంది. ఉత్తరం, వాస్తు శాస్త్రం ప్రకారం, బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంది. ఇది తెలివికి మూలం అని విశ్వసిస్తారు. అశ్వ ద్వారం.. రెండవది అశ్వ ద్వారం. గుర్రం పేరు మీదుగా గుమ్మానికి ఈ పేరు పెట్టారు. గుర్రం శక్తి, బలం, ధైర్యాన్ని సూచిస్తుంది. పాలనలో కావాల్సిన లక్షణాలను ఈ గుమ్మం గుర్తుచేస్తుంది. గరుడ ద్వారం.. మూడవ ద్వారానికి గరుడ అనే పేరు పెట్టారు. పక్షుల రాజు గరుడ.. విష్ణువు వాహనంగా నమ్ముతారు. హిందూ త్రిమూర్తులలో సంరక్షకుడు అయిన విష్ణువుతో దానికి అనుబంధం ఉంది. గరుడను శక్తి, ధర్మం (కర్తవ్యం)నికి చిహ్నంగా భావిస్తారు. ఇది అనేక దేశాల చిహ్నాలపై ఎందుకు ఉపయోగించారో కూడా వివరణ ఉంటుంది. గరుడ ద్వారం కొత్త పార్లమెంటు భవనానికి తూర్పు ద్వారం. మకర ద్వారం.. నాలుగో ద్వారం మకర ద్వారం. మకరాన్ని సముద్ర చేపగా పిలుస్తారు. వివిధ జంతువుల కలయికగా దీన్ని గుర్తిస్తారు. దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించి ఉన్న హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో మకరం సాధారణంగా కనిపిస్తాయి. మకరం వివిధ జీవుల కలయికగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. గుమ్మాల వద్ద మకర శిల్పాలు రక్షకులుగా కనిపిస్తాయి. మకర ద్వారం పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు ఉంది. శార్దూల ద్వారం.. ఐదవ ద్వారం శార్దూలం. ఇది సింహం శరీరం, కానీ గుర్రం, ఏనుగు లేదా చిలుక తల. కొత్త పార్లమెంట్ భవనం గేటుపై శార్దూల ఉండటం దేశ ప్రజల శక్తిని సూచిస్తుందని ప్రభుత్వ నోట్ పేర్కొంది. హంస ద్వారం పార్లమెంటు ఆరవ ద్వారానికి హంస ద్వారం అని పేరు పెట్టారు. హంస అనేది హిందూ జ్ఞాన దేవత అయిన సరస్వతి వాహనం. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు గేటుపై ఉన్న హంస శిల్పం స్వీయ-సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం. ఇదీ చదవండి: ఇండియా కూటమిని గొర్రెలు, మేకలతో పోల్చిన ఏక్నాథ్ షిండే -
గోదావరిలో మళ్లీ జలకళ!
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/కడెం/కాళేశ్వరం: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీరాంసాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు పెరిగాయి. సోమవారం రాత్రికి ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 16 గేట్లు ఎత్తి సుమారు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయిలో 90 టీఎంసీలకు చేరింది. ఇక కడెం ప్రాజెక్టుకు వరద 36,560 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు గేట్లను ఎత్తి 56,429 క్యూస్కెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6.5 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 35,300 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 46,221 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్షి్మ) బ్యారేజీ నుంచి 1,66,970 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి 1,32,480 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచి 81,108 క్యూసెక్కులను వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి సోమవారం రాత్రి గోదావరి ఎగువనుంచి వరద పోటెత్తడంతో 66 గేట్లకు 45 గేట్లు ఎత్తారు. లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కాళేశ్వరం వైపు తరలివస్తోంది. బేసిన్ పరిధిలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణాలో కానరాని ప్రవాహాలు పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి కేవలం 5,086 క్యూసెక్కుల ప్రవాహమే నమోదైంది. అక్కడ విద్యుదుత్పత్తి ద్వారా వదులుతున్న 14 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. రాష్ట్రంలోని జూరాలకు కేవలం 420 క్యూసెక్కులే వరద ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రకు కూడా కేవలం 559 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి వరద రావడం లేదు. స్థానిక వర్షాలతో నాగార్జునసాగర్‌కు 11,424 క్యూసెక్కులు, మూసీ ప్రవాహంతో పులిచింతలకు 5,546 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
కడెం పరిస్థితిపై సీడబ్ల్యూసీ అధ్యయనం
కడెం: భారీగా వరదలు రావడం, గేట్లు సరిగా పనిచేయక ఆందోళన నెలకొనడం నేపథ్యంలో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ భద్రత బృందం శుక్రవారం పరిశీలించింది. మొత్తం 24 మంది అధికారులు, సిబ్బంది డ్యామ్ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేశారు. వరద గేట్ల పనితీరు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సామర్థ్యం, ఎడమ కాల్వ వద్ద కోతకు గురైన రోడ్డు వంటి వాటిని పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులు గతేడాది ప్రాజెక్టుకు వచ్చిన భారీ వరదలతో దెబ్బతిన్న గేట్లు, ఆఫ్రాన్ (రక్షణ గోడ), స్పిల్‌వేలను సీడబ్ల్యూసీ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, డ్యాం భద్రత నిపుణుడు ఏబీ పాండ్య మాట్లాడారు. కడెం ప్రాజెక్టు భారీగా వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రమాదం నెలకొని ఉందని, డ్యాం భద్రతకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టును పరిశీలించిన బృందంలో హైడ్రాలజిస్ట్ చీఫ్ ఇంజనీర్ రామరాజు, డ్యాం భద్రత నిపుణుడు టి.దేశాయి, జియాలజిస్ట్ ఎం.రాజు, హైడ్రో మెకానికల్ నిపుణులు కె.సత్యనారయణ, యోగీందర్కుమార్శర్మ, సీఈ శ్రీనివాస్, ఎస్ఈ సుశీల్‌కుమార్, ఈఈ విఠల్, డీఈ భోజదాసు, ప్రాజెక్ట్ సిబ్బంది ఉన్నారు. శాంతించిన కడెం.. గేట్లకు మరమ్మతులు భారీ వరదతో ప్రాజెక్టును కోతకు గురిచేస్తుందా అన్న ఆందోళన రేపిన కడెం వాగు శాంతించింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు శుక్రవారం ఉదయం 1,46,675 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. సాయంత్రానికి బాగా తగ్గిపోయింది. రాత్రికి 13,550 క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఏడు గేట్ల ద్వారా 20,998 క్యూస్కెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులుకాగా.. ప్రస్తుతం 685.150 అడుగులుగా ఉంది. రెండు రోజుల కింద తెరుచుకోకుండా మొరాయించిన 3వ నంబర్ గేటుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కాగా భారీ వరదతో ఎడమ కాల్వపై మైసమ్మ గుడివద్ద రోడ్డు కోతకు గురైంది. అక్కడ మరమ్మతులు పూర్తిచేసేదాకా సాగునీటిని విడుదల చేసే అవకాశం లేదు. దీనితో వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
తెరుచుకోని గేట్లు.. ప్రమాదంలో కడెం ప్రాజెక్టు
-
బొర్రా గుహలకు మెట్రో గేటు
అనంతగిరి: ప్రముఖ పర్యాటక కేంద్రం, సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు సరికొత్తగా సాంకేతిక సొబగులు అద్దుకుంటున్నాయి. ఇక్కడికి దేశ విదేశాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తుంటారు. వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పర్యాటక శాఖ అధునాతన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆన్లైన్ ఈ–పోస్ టికెట్ల ద్వారా గుహలు లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల రద్దీ పెరిగే కొద్దీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో గుహలు ముఖద్వారం వద్ద కొత్తగా మెట్రో గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. లోపలకు వెళ్లేందుకు మూడు, బయటకు వచ్చేటప్పుడు మూడు గేట్లు చొప్పున అమర్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం రూ. 12 లక్షల వరకు వెచ్చిస్తోంది. తాజాగా టెక్నీషియన్లు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ప్లాట్‌ఫాం నిర్మించిన వెంటనే మెట్రో గేట్లను ఏర్పాటు చేస్తారు. గుహలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకుల్లో పెద్దలకు రూ. 70, చిన్నపిల్లలకు రూ. 50 చెల్లిస్తే మాగ్నెటిక్స్ కాయిన్స్ ఇస్తారు. వీటిని చూపించగానే గేటు తెరుచుకుంటుంది. గుహలను తిలకించి తిరిగి బయటకు వచ్చేందుకు మరోసారి చూపించాలి. త్వరలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత టికెట్ల ధరలు అమలులో ఉన్నట్లు పర్యాటక శాఖ సిబ్బంది తెలిపారు. (చదవండి: విశాఖ పోర్టుకు రికార్డు స్థాయిలో క్రూడాయిల్) -
శ్రీశైలం గేట్ల నిర్వహణ భేష్
సాక్షి, అమరావతి/శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణ చాలా సమర్ధవంతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్సారీ్ప) ప్రశంసించింది. ప్రాజెక్టు అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖను అభినందించింది. ప్రాజెక్టు ఆధునికీకరణకు డ్రిప్ (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్) కింద రుణం మంజూరుకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని ప్యానల్ చైర్మన్ ఏబీ పాండ్య తెలిపారు. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టును తనిఖీ చేసిన పాండ్య నేతృత్వంలోని డీఎస్సార్పీ.. మంగళవారం కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు ఎస్ఈ, ఈఈ తదితరులతో సమావేశమైంది. ప్రాజెక్టు స్థితిగతులు, ఆధునికీకరణపై సమీక్షించింది. ప్రాజెక్టు ప్లంజ్ పూల్‌కు 2002 నుంచి 2004 మధ్య వేసిన కాంక్రీట్ ఆ తర్వాత వచ్చిన వరదల ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు డీఎస్సార్పీ గుర్తించింది. భారీ కాంక్రీట్ దిమ్మెలను ప్లంజ్ పూల్‌లో వేసి, వాటిపై అధిక ఒత్తిడితో కాంక్రీట్ మిశ్రమాన్ని పోయడం ద్వారా గొయ్యిని పూడుస్తామని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. ఈ డిజైన్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు పంపాలని ప్యానల్ చైర్మన్ సూచించారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారమే ప్లంజ్ పూల్‌కు మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. కొండ చరియలు విరిగి పడకుండా.. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వేకు ఎగువన, దిగువన కొండచరియలు విరిగి పడి ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కొండ చరియలు పడకుండా మెస్, షార్ట్ క్రీటింగ్ కాంక్రీట్‌తో అడ్డుకట్ట వేస్తున్న తరహాలోనే.. శ్రీశైలంలోనూ చేస్తామని అధికారులు చేసిన ప్రతిపాదనకు డీఎస్సార్పీ ఆమోదం తెలిపింది. గ్యాలరీలో సీపేజ్‌కు అడ్డుకట్ట వేయడానికి గ్రౌటింగ్ చేపట్టాలని ఆదేశించింది. రివర్ స్లూయిజ్ గేట్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని, ఆప్రాన్‌కు ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేయాలని సూచించింది. అధునాతన వరద పర్యవేక్షణ కార్యాలయం ప్రాజెక్టు వద్ద వరద పర్యవేక్షణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీఎస్సార్పీ సూచించింది. ప్రాజెక్టు అధికారులకు 40 ఎకరాల్లో గతంలో నిర్మించిన క్వార్టర్స్‌ను (ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి) కూల్చివేసి, కొత్తవి నిర్మించడానికి అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ, క్వార్టర్స్ నిర్మాణానికి డ్రిప్ కింద రుణమివ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని డీఎస్సార్పీ తెలిపింది. ఈ పనులకు రూ.780 నుంచి రూ.1,000 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని పాండ్య తెలిపారు. -
గేట్ల ట్రయల్ రన్ విజయవంతం
-
పోలవరం ప్రాజెక్టు: మరో కీలక అంకం పూర్తి..
సాక్షి, పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోలవరం ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయ్యింది. గేట్ల ట్రయన్ రన్ విజయవంతమైంది. మొత్తం 48 గేట్లకు గానూ 34గేట్ల అమరిక పనులు, మొత్తం 96 సిలిండర్లకు గానూ 56 సిలిండర్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. 24 పవర్ ప్యాక్ లకు గానూ 5పవర్ ప్యాక్‌లు బిగింపు పూర్తయ్యింది. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను ఎత్తవచ్చు. 10 రివర్ స్లూయిజ్ గేట్లకు గానూ 10గేట్ల అమరిక, 3 రివర్ స్లూయిజ్ గేట్లకు సిలిండర్ల అమర్చడం పూర్తి అయింది. ఇప్పటికే 44,43వ గేట్లకు కిందకి పైకి ఎత్తడంతో ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదటిగా 44వ గేటును 6 మీటర్లు పైకి ఎత్తి మరలా 3 మీటర్లు కిందకి అధికారులు దించారు. హైడ్రాలిక్ సిలిండర్ సాయంతో గేటును నిమిషానికి 1.5మీటర్లు ఎత్తే విధంగా రూపొందించారు. 2400 టన్నుల వత్తిడిని సైతం తట్టుకునేలా గేట్ల డిజైన్ చేశారు.ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మిగతా గేట్లను ఎత్తేందుకు చురుగ్గా పనులు సాగుతున్నాయి. గేట్ల ట్రయల్ రన్ పనులను పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ జీఎంలు సతీష్ బాబు, మిశ్రా,బెకెం ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్ట్ ఇంచార్జి ఎ.నాగేంద్ర పరిశీలించారు. చదవండి: ట్రాకింగ్ మెకానిజం పటిష్టంగా ఉండాలి: సీఎం జగన్ ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది..’ -
విరిగిపోయిన మూసీ గేటు..
-
విరిగిపోయిన మూసీ గేటు..
సాక్షి, సూర్యాపేట: భారీ వరద ప్రవాహం తట్టుకోలేక మూసీ ప్రాజెక్టు గేటు విరిగిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ జలాశయంలోకి భారీగా వరద చేరింది. అయితే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శనివారం సాయంత్రం ఆరో నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో వరద నీరు వృథాగా దిగువ ప్రాంతానికి పోతోంది. మూసీ జలాశయంలో మొత్తం 32 క్రస్ట్ గేట్లు ఉండగా.. వివిధ కారణాలతో 7 గేట్లను పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 25 గేట్లు ఉన్నాయి.. గత రెండు రోజులుగా భారీగా నీరు చేరడంలో రెండు గేట్లను ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నిన్న రాత్రి కూడా భారీగా వరద రావడంతో పోటు ఎక్కువై గేటు ఊడిపోయింది. దీంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నీరంతా వృథాగా పోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నీళ్లే లేవు.. బాబ్లీ గేట్లు ఎత్తివేత
బాసర (నిర్మల్): గోదావరిలో నీళ్లే లేవు.. కానీ మూడు రాష్ట్రాల అధికారులు సోమవారం ఉదయం బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించిన 14 గేట్లను ఎత్తివేశారు. అయితే.. దిగువకు చుక్కనీరు పారలేదు. వివరాలు.. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై రూ.200 కోట్ల వ్యయంతో బాబ్లీ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో దిగువకు వచ్చే నీటికి అడ్డుకట్ట పడినట్లయింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర జలవనరుల సంఘంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరికొన్ని ప్రాజెక్టులకు నీరు చేరేందుకు రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఏటా జూలై 01 నుంచి అక్టోబర్ 29 వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఎప్పటిలాగే ఈ ఏడాది జూలై ఒకటిన బాబ్లీ గేట్లను తెరిచారు. అయితే ఇప్పటి వరకు వర్షాలు కురవకపోవడంతో గోదారి నది నీరు లేక వెలలబోయింది. ఈ కార్యక్రమంలో (సీడబ్ల్యూసీ) కేంద్ర జల వనరుల శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈఈలు గంగాధర్, రామారావు, నారాయణ్‌రెడ్డి, గావనే తదితరులు పాల్గొన్నారు. -
గేట్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
అట్లాంటా : గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సోసైటీ(గేట్స్) ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జూన్ 23న ఆదివారం నాడు కుమ్మింగ్‌లోని లేనియర్ టెక్నికల్ కాలేజీలో ఈ వేడుకలు జరిగాయి. దాదాపు 1000 మందిపైగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. స్థానిక నేతలతో పాటు పలువరు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గేట్స్ బోర్డు ఛైర్మన్ అనిల్ బోధిరెడ్డి, ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి పిట్ట సారథ్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నృత్యాలు, బుర్రకథలు, కాకతీయ చరిత్రను వివరిస్తూ నృత్య ప్రదర్శన, పేరిణీ తాండవం, బోనాలు, బతుకమ్మ, గుస్సాది, లంబాడీ, గిరిజన నృత్యాలు, తెలంగాణ సమరయోధుల నాట్య రూపకం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భువనేష్ బుజాల(ఆటా), ఆల రామక్రిష్ణారెడ్డి(ఆటా,బోట్), అంజయ్య చౌదరి లావు (తానా), భరత్ మాదాది(టాటా), డా.శ్రీని గంగసాని, సునీల్ సావిలి, శ్రీనివాసరెడ్డి పెద్ది( ఐఎఫ్ఏ), సత్యనారాయణరెడ్డి తంగిరాల(గాటా), వెంకీ గద్దె, వినయ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో ఛైర్మన్ బోధిరెడ్డి, ప్రెసిడెంట్ తిరుమలరెడ్డి పిట్ట, వైఎస్ ప్రెసిడెంట్ రాహుల్ చిక్యాల, జనరల్ సెక్రటరీ కిషన్ తాళ్లపల్లి, ట్రెజరర్ అనితా నెల్లుట్ల, జనార్థన్ పన్నెల(యూత్ అండ్ స్పోర్ట్స్), సునీల్ గోతూర్( ఈవెంట్ సెక్రటరీ), శ్రీనివాస్ పర్సా (కల్చరల్ సెక్రటరీ), శ్రీధర్ నెల్వల్లి, రఘు బండ, చిట్టారి ప్రభా, రమాచారి, గణేశ్ కాశం, వెన్నెమనేని చలపతి, సతీష్ నందాల, గేట్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులు కరుణ్ ఆశిరెడ్డి, గౌతమ్గోలి, ప్రభాకర్ బోయపల్లి, శ్రీధర్ జూలపల్లి, సతీష్ చెటిల కృషి అమోఘమని పలువురు కొనియాడారు. -
ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విత్తనాలపై అమెరికాకు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఆసక్తి కనబరిచింది. ఇక్కడి విత్తనాలు ఆఫ్రికా దేశాలకు అనుకూలంగా ఉంటాయని ఫౌండేషన్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగ అభివృద్ధికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనే సంస్థ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ లారెన్‌గుడ్ సహా ఆఫ్రికన్ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లారెన్‌గుడ్ మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాలు ఆఫ్రికా దేశాలకు ఎంతో అనుకూలమైనవని అన్నారు. విత్తనోత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఆఫ్రికా దేశాల్లో విత్తనోత్పత్తి తక్కువగా ఉంటుందని, ఆయా దేశాల అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వరి, పొద్దుతిరుగుడు విత్తనాలు దిగుమతి చేసుకుంటామని వెల్లడించారు. అలాగే తెలంగాణ వరి విత్తన పద్ధతులను ఆఫ్రికా దేశాల్లో అమలుపరుస్తామని పేర్కొన్నారు. పార్థసారథి మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, సోయాబీన్ పంటల విత్తనోత్పత్తి తెలంగాణలో చేపడుతున్నామని చెప్పారు. దాదాపు 90 శాతం హైబ్రిడ్ విత్తనోత్పత్తి తెలంగాణలోనే జరుగుతుందని తెలిపారు. 400 విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు హైదరాబాద్ చుట్టుపక్కల నెలకొని ఉన్నాయన్నారు. గతేడాది సూడాన్, రష్యా, టాంజానియా తదితర దేశాలకు వరి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలను ఎగుమతి చేశామన్నారు. ఈ ఏడాది ఆఫ్రికా దేశాలకు విత్తనాల ఎగుమతికి సిద్ధంగా ఉన్నామని, వెయ్యి టన్నుల విత్తనాలను ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
సుంకేసుల డ్యాం గేట్లకు మరమ్మతులు
జలమండలి ఎస్ఈ చంద్రశేఖరరావు సుంకేసుల(గూడూరు రూరల్): ప్రస్తుతం సుంకేసుల డ్యాంలో నీరు లేకపోవడంతో గేట్లను మరమ్మతులు చేయించనున్నట్లు జలమండలి ఎస్ఈ చంద్రశేఖర్‌రావు చెప్పారు. శనివారం ఆయన రిజర్వాయర్‌ను పరిశీలించారు. డ్యాం గేట్లు, కరకట్టల పటిష్టతను పరీక్షించారు. ఎగువ నుంచి డా్యంకు నీరు వచ్చేలోపు గేట్లకు మరమ్మతులు, పేయింటింగ్ వేయించడం, తులుపులకు గ్రీసు తదితర పనులు చేపట్టేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. కర్నూలు ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జీడీపీ నీరు సరఫరా చేస్తామన్నారు. ఆయన వెంట జేఈ శ్రీనివాసులు, వర్క్ఇన్స్పెక్టర్ మునిస్వామి ఉన్నారు. -
అట్లాంటాలో బిజినెస్ సెమినార్‌కు విశేష స్పందన
అట్లాంటా : గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ(జీఏటీఈఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ సెమినార్, తెలంగాణ సాంస్కృతికోత్సవానికి విశేష స్పందన వచ్చింది. అట్లాంటాలో కుమ్మింగ్‌లోని ఫోర్సిత్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ, అట్లాంటాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు. భారతదేశం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం, అట్లాంటా వ్యాపారవేత్తల మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి 250మందికి పైగా ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటూ పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. సతీష్ చేటి (జీఏటీఈఎస్ చైర్మన్) అతిథులను ఆహ్వానించగా, ప్రశాంతి అసిరెడ్డి ( జీఏటీఈఎస్ ప్రెసిడెంట్) ముఖ్య అతిథులను సెమినార్‌కు వచ్చిన వారికి పరిచయం చేశారు. ఆర్ శ్రీనివాసన్(కాన్సుల్ ఆఫ్ ఇండియన్ కాన్సులేట్) , ప్రొఫెసర్ వి.వెంకట రమణ (హెచ్‌సీయూ), కార్టర్ పాట్టర్సన్లు భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు అనే అంశంపై ప్రసంగించారు. ఎన్ఆర్ఐలు భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి భారత ప్రభుత్వ పాలసీలు అనూకూలంగా ఉన్నాయని ఆర్ శ్రీనివాసన్ తెలిపారు. ఇలాంటి సెమినార్లు నిర్వహించి ఎన్ఆర్ఐలలో చైతన్యం చేస్తున్నందుకుగానూ జీఏటీఈఎస్ను ఆయన అభినందించారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా పార్క్, టెక్స్టైల్ పార్క్, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, వేస్ట్ మేనేజ్మెంట్వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, వనరుల గురించి ప్రొఫెసర్ వి.వెంకట రమణ వివరించారు. అట్లాంటాలో పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాలను కార్టర్ తెలిపారు. అమెరికా ఎకానమీ పటిష్టం చేయడంలో ఇండో-అమెరికన్ల కృషిని ఆయన కొనియాడారు. అట్లాంటాలో వ్యాపారరంగంలో విజయవంతంగా దూసుకుపోతున్న తెలంగాణకు చెందిన కిరణ్ పాశం, మిగతా వ్యాపారవేత్తలు తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రజాప్రతినిధులు డన్కన్, బ్రాండన్లను జీఏటీఈఎస్ సత్కరించింది. రమేష్ తన మిమిక్రీతో అతిథులను అలరించారు. బుర్రకథ, ఒగ్గుకథ, సమ్మక్క సారక్క నృత్యరూపకం, పేరిణి డ్యాన్స్, లంబాడీ డ్యాన్స్, జానపద నృత్యాలు ఇలా ఎన్నో కార్యక్రమాలను ఇందులో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించినందుకుగానూఈవెంట్ స్పాన్సర్స్ ఇన్ఫోస్మార్ట్, ఈఐఎస్ టెక్నాలజీస్లను జీఏటీఈఎస్ ఈసీ, బోర్డు అభినందించింది. సతీష్ చేటి, శ్రీనివాస్ గంగసాని, నందా చాట్ల, అనితా నేలుట్ల, కిషన్ తాల్లపల్లి, అనిల్ బోడిరెడ్డి, శ్రీనివాస్ ఆవుల, సునిల్ రెడ్డి కూటూరు, రాహుల్ చిక్యాల, రఘురెడ్డి, వేణు పిసికె, శ్రీధర్ నెలవెల్లి, సునిల్ గూటూరు, సురేష్, కే. వేలమ్, తిరుమల్ పిట్టల సమిష్టి సహకారంతో జీఏటీఈఎస్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. -
గేట్లెత్తితేనే కల సాకారమైనట్లా?
- ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్ఆర్ - పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు కర్నూలు(ఓల్డ్‌సిటీ): గేట్లెత్తినంత మాఽత్రాన కల సాకారమైనట్లు చంద్రబాబు భావించడం విడ్డూరంగా ఉందని.. ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనే విషయం ప్రజలకు తెలియంది కాదని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యుడు ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, కోడుమూరు మాజీ శాసనసభ్యుడు మురళీకృష్ణలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించి కల నిజమైందనడంలో అర్థం లేదన్నారు. ఐటీ రంగానికి సంబంధించి ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉండేదని, చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన తర్వాత రాష్ట్రానికి ఐదో స్థానం లభించిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మిగతా పార్టీలను బ్రేక్‌చేసి, మీ పార్టీని మేక్ చేస్తున్నారా, అవినీతి పునాదిపై రాజధాని కడుతున్నారా అంటూ ‘ఇండియాటుడే’ ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేత అనే గౌరవం కూడా లేకుండా ‘హూ ఈజ్ దట్ ఫెలో’ అనడం చంద్రబాబు సంస్కారానికి నిదర్శనమన్నారు. పట్టుదల, దూరదృష్టికి అర్థం చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కులమతాలకు తావులేదన్నారు. రైతులతోనే దేశం సుభిక్షం.. ఎక్కడైతే రైతులు సుభిక్షంగా ఉంటారో ఆ దేశం సిరిసంపదలతో తులతూగుతుందని నమ్మి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు జిల్లాపై చిన్నచూపు చూస్తున్నారని, ఏ పనులూ ముందుకు వెళ్లడం లేదన్నారు. 2019లోనూ అధికార దాహం తీర్చుకునేందుకే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గంలో చిచ్చుపెట్టేందుకే జేసీ దివాకర్‌రెడ్డి చేత రెచ్చగొట్టే ప్రసంగాలు చేయిస్తున్నారన్నారు. ఇలాంటి కుయుక్తులపై ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ప్రాజెక్టులన్నీ వైఎస్ హయాంలోనివే.. ఒక్క ప్రాజెక్టుకూ శంకుస్థాపన చేయకపోగా వైఎస్ రాజశేఖరరెడ్డి 80, 90 శాతం పూర్తిచేసిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందని నందికొట్కూరు శాసనసభ్యుడు ఐజయ్య అన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలకు వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.120 కోట్లు మంజూరు చేశారని.. ఇందులో 4 పంపుల ద్వారా కేసీకి నీరు అందించాల్సి ఉండగా, చంద్రబాబు రెండింటినే ప్రారంభించారన్నారు. ఈ కారణంగా సాగునీరు 1000 క్యూసెక్కులు అందాల్సిన చోట 500లకే పరిమితమైందన్నారు. ముఖ్యమంత్రికి నిజంగా రాయలసీమపై, జిల్లాపై ప్రేమే ఉంటే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని సవాల్ చేశారు. మాటలతో మభ్యపెడుతున్నారు టీడీపీ పాలనలో మాటలతో మభ్యపెట్టడమే తప్పిస్తే అభివృద్ధి లేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య అన్నారు. తమ నేత వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబుకు దిక్కుతోచడం లేదన్నారు. రౌడీ ఎంపీని దగ్గర పెట్టుకొని సంస్కారం లేకుండా మాట్లాడించడం సీఎం హోదాకు తగదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం యాదవ్, మహిళా, మైనారిటీ విభాగాల జిల్లా అధ్యక్షులు శౌరి విజయకుమారి, ఫిరోజ్, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాంపస్ ఇంటర్వూ్యల్లో 13 మంది ఎంపిక
గుత్తి : పట్టణంలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో లక్నోకు చెందిన సీ – కోర్ ఇండియా టెక్నో సొల్యూష¯Œ్స సాఫ్ట్వేర్ కంపెనీ శుక్రవారం ఎంబీఏ, బీటెక్ ఫైనలియర్ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించింది. 13 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఇందులో ఎంబీఏ విద్యార్థులు ముగ్గురు, బీటెక్ విద్యార్థులు 10 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కంపెనీ హెచ్ఆర్ ప్రదీప్వర్మ మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపిౖకెన ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి రూ.2.4 లక్షల వేతనం ఇస్తామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను గేట్స్ కరస్పాండెంట్ వీకే సుధీర్‌రెడ్డి, డైరెక్టర్లు వీకే పద్మావతి, వీకే వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమల్లేశ్వరరావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రతాప్‌రెడ్డి, పీడీ జోయెల్ అభినందించారు. -
కొనసాగుతున్న పడవ వెలికితీత పనులు
నిడదవోలు : విజ్జేశ్వరం వద్ద గోదావరి స్కవర్‡ స్లూయిజ్ గేటులో చిక్కుకుపోయిన పాత ఇనుప పడవ వెలికితీసేందుకు ఆదివారం కూడా శ్రమించారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఏటా గోదావరి వరదల సమయంలో పేరుకుపోయిన మట్టి, పూడికను తొలగించేందుకు ధవళేశ్వరం హెడ్ వర్క్స్ అధికారులు ఈ నెల 4న స్కవర్ ఆపరేషన్‌లో భాగంగా స్కవర్ స్లూయిజ్ నాలుగు గేట్లను ఎత్తారు. ఈ సమయంలో గోదావరిలో నీరు సముద్రం వైపునకు వదులుతారు. ఆ ప్రవాహనికి బ్యారేజీ వెనుక వైపు మట్టిలో కూరుకుపోయిన పాత ఇనుప పడవ ఒకటి కొట్టుకొచ్చి ఒక గేటులో చిక్కుకుపోయింది. ఇనుప పడవ కావడంతో గేటుకు కొక్కానికి పడవ పట్టేసింది. దీంతో ఎంత నీటి ప్రవాహం ఉన్నా అది కొట్టుకురాకుండా ఉండిపోయింది. దీంతో దానిని తీయడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఎస్ఈ బి.రాంబాబు, ఈఈ ఎన్.కృష్ణారావులు దగ్గరుండి పడవ తీసే పనిలో నిమగ్నమయ్యారు. ముందుగా స్టాప్‌లాగ్ గేట్లును మూసివేసి నీటి ప్రవాహాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్టాప్‌లాగ్ గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి తుప్పుపట్టి కిందకు దిగడం లేదు. స్టాప్‌లాగ్ గేట్లను కిందకు దించితే తప్ప నీటి ప్రవాహం అడ్డుకట్ట వేయలేరు. పడవ తీసేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
42 వరద గేట్ల ఎత్తివేత
బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు పోటెత్తడంతో ఆదివారం సాయంత్రం 42 వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి 3 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల 24 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి ఎస్కెప్ గేట్ల ద్వార 3 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వార వెయ్యి క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వార 300 క్యూసెక్కుల, కాకతీయ కాలువ ద్వార 5 వేల క్యూసెక్కుల నీటి విడుదల అవుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 (90 టీఎంసీల)తో నిండుకుండలా ఉంది. -
జూరాల క్రస్టుగేట్ల మూసివేత
-కొనసాగుతున్న విద్యుదుత్పత్తి జూరాల : కష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోపై ప్రభావం పడింది. సోమవారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు కేవలం 52వేల క్యూసెక్కులు వస్తుండటంతో క్రస్టుగేట్లన్నింటినీ మూసివేశారు. జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు టర్బైన్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ 44వేల క్యూసెక్కులను పవర్‌హౌస్ ద్వారా దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65టీఎంసీలు కాగా 9.29టీఎంసీలను నిల్వ ఉంచారు. జూరాల రిజర్వాయర్ ద్వారా కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాలకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కేవలం 84,688 క్యూసెక్కులు వస్తుండటంతో అన్ని క్రస్టుగేట్లను మూసివేశారు. విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా 117టీఎంసీలను నిల్వ ఉంచారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు. ప్రస్తుతం 32టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి రిజర్వాయర్‌కు 59,371 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండగా నాలుగు క్రస్టుగేట్లు తెరవడంతోపాటు విద్యుదుత్పత్తి ద్వారా జూరాల రిజర్వాయర్‌కు 22,072 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. -
ఎల్లంపల్లికి జలకళ
నాలుగు గేట్లు ఎత్తివేత ముంపు బాధితుల తరలింపు రామగుండం/వెల్గటూరు : ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తొలిసారిగా జలకళ వచ్చింది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 18 టీఎంసీలకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉండటంతో అధికారులు బుధవారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తారు. 40వేలు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 21, 22, 23, 24 గేట్ల ద్వారా 10,800 క్యూసెక్కుల నీటిని గోదారినదిలోకి వదులుతున్నట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ అనిల్‌కుమార్, ప్రాజెక్టు సూపరింటెండెంట్ విజయ్‌భాస్కర్ తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లోని 25వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్టులో గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తున్న క్రమంలో బ్యాక్‌వాటర్ ముంపు గ్రామాలను ముంచుతోంది. ఇప్పటికే రామగుండం మండలం కుక్కలగూడూర్లోకి నీళ్లు వచ్చాయి. వెల్గటూరు మండలం కోటిలింగాల అలుగు ఒర్రె నీటమునిగి రాకపోకలు స్తంభించాయి. గ్రామంలోకి నీళ్లు చేరుతున్నాయి. చెగ్యాం గ్రామంలోకి నీళ్లు వస్తుండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం గ్రామస్తులను ఇళ్లు ఖాళీ చేయించారు. నిర్వాసితులను పునరావాస కాలనీకి తరలించారు. సదరు కుటుంబాలకు తాత్కాలికంగా పునరావాస కాలనీలోని జెడ్పీ హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్‌తోపాటు తాళ్ల కొత్తపేట ప్రాథమిక పాఠశాలలో వసతి కల్పించారు. వీటిలో సుమారు 30 గదులు ఉండగా గదికి ఐదు కుటుంబాల చొప్పున వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఒక గదిలో ఐదు కుటంబాలు సామాన్లు పెట్టకునే సరికి పూర్తిగా నిండిపోతోంది. ఈ కుటుంబాలకు పది రోజుల వరకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని, ఆ తర్వాత వారే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. -
గరిష్ట స్థాయికి జీడీపీ నీటిమట్టం
– హంద్రీకి నీటి విడుదలకు అవకాశం – తీర గ్రామాల్లో ప్రమాద హెచ్చరికలపై దండోరా గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఎప్పుడైనా క్రస్ట్‌గేట్లు ఎత్తి హంద్రీలోకి నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్ట్ అధికారులు సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం అందించి జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్, జలవనరుల శాఖ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు నుంచి ఉత్తర్వులు పొందారు. దీంతో హంద్రీ తీర ప్రాంతాలైన హెచ్.కైరవాడి, గాజులదిన్నె తదితర గ్రామాల్లో రెవెన్యూ అధికారులు దండోరా వేయించారు. అలాగే పోలీసులు కూడా గ్రామీణులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో 377 మీటర్ల నీటిని నిలువ చేసే సామర్థ్యం ఉండగా సోమవారం సాయంత్రానికి 376.77 మీటర్ల నీటిమట్టం నమోదైంది. 376.80 మీటర్లకు పైగా నీటి మట్టం నమోదైతే అదనంగా వచ్చిన నీటిని హంద్రీలో వదులుతామని జీడీపీ డీఈ లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో ఏమాత్రం వర్షం వచ్చినా అవి ప్రాజెక్ట్‌లో చేరి ప్రమాదస్థాయి దాట వచ్చని పేర్కొన్నారు. హంద్రీ పరీవాహక ప్రాంత వాసులు హంద్రీవైపు వెళ్ల వద్దని ఆయన హెచ్చరించారు. -
తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
చర్ల : ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. చత్తీస్గడ్ రాష్ట్రం సరిహద్దు ప్రాంతంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు ఎక్కువగా వస్తోంది. దాంతో గురువారం 17 గేట్లు ఎత్తివేసి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 74 మీటర్లు కాగా వరద పోటును దృష్టిలో పెట్టుకుని 73.60 మీటర్ల నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని కిందికి వదిలివేస్తున్నారు. ప్రాజెక్టు ఇంజనీర్ వెంకటేశ్వరరావు సిబ్బందితో ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. -
విమానమొచ్చింది.. గేటేయండి..!
మన వద్ద రైలు రాగానే రెండు వైపులా వాహనాలు రాకుండా గేట్లు వేసేస్తారు. ఈ రైల్వే గేట్లు మనకు కామనే. ఇదే సీన్ విమానానికి ఎదురైతే.. విమానమొస్తుందంటూ వాహనాలు రాకుండా రెండు వైపులా గేట్లు వేస్తే ఎలాగుంటుంది. ఇలాంటి చిత్రమైన సన్నివేశం చూడాలంటే జిబ్రాల్టర్కు వెళ్లాల్సిందే. ఇక్కడ ఎయిర్‌పోర్టు రన్‌వే.. నాలుగు లేన్ల ప్రధాన రహదారికి మధ్యలో ఉంటుంది. దీంతో విమానం వచ్చినప్పుడు లేదా వెళ్లినప్పుడల్లా రెండు వైపులా గేట్లు వేసేసి.. వాహనాలను నిలిపేస్తారు. విమానం వెళ్లగానే.. మళ్లీ వాహనాలు యధావిధిగా వెళ్లిపోతాయి. ఈ ఎయిర్‌పోర్టుకు స్థలం తక్కువగా ఉండటం.. సమతలంగా ఉన్న భూమి లేకపోవడంతో చివరికి ఇలా రోడ్డు మధ్యలో రన్‌వేను నిర్మించాల్సి వచ్చింది.