బాసర (నిర్మల్): గోదావరిలో నీళ్లే లేవు.. కానీ మూడు రాష్ట్రాల అధికారులు సోమవారం ఉదయం బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించిన 14 గేట్లను ఎత్తివేశారు. అయితే.. దిగువకు చుక్కనీరు పారలేదు. వివరాలు.. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై రూ.200 కోట్ల వ్యయంతో బాబ్లీ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో దిగువకు వచ్చే నీటికి అడ్డుకట్ట పడినట్లయింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర జలవనరుల సంఘంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరికొన్ని ప్రాజెక్టులకు నీరు చేరేందుకు రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఏటా జూలై 01 నుంచి అక్టోబర్ 29 వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఎప్పటిలాగే ఈ ఏడాది జూలై ఒకటిన బాబ్లీ గేట్లను తెరిచారు. అయితే ఇప్పటి వరకు వర్షాలు కురవకపోవడంతో గోదారి నది నీరు లేక వెలలబోయింది. ఈ కార్యక్రమంలో (సీడబ్ల్యూసీ) కేంద్ర జల వనరుల శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈఈలు గంగాధర్, రామారావు, నారాయణ్‌రెడ్డి, గావనే తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment