Maharashtra: KCR To Address Rally In Nanded - Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర వైపు ‘కారు’రూటు..  తెలంగాణ బయట బీఆర్‌ఎస్‌ తొలి సభ

Published Sun, Feb 5 2023 3:02 AM | Last Updated on Sun, Feb 5 2023 1:26 PM

CM KCR To Address Rally In Maharashtra - Sakshi

మరాఠీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు  

నిర్మల్‌: జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తహతహలాడుతున్న బీఆర్‌ఎస్‌ తొలిసారి రాష్ట్రం బయట భారీ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. గతనెల 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ తొలి భారీ బహిరంగ సభ నిర్వహించగా.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేలా సభ జరిపి, దేశ రాజకీయాలను ఆకర్షించే పనిలో పడింది.

పక్షం రోజులుగా నాందేడ్‌లో మ కాం వేసిన బీఆర్‌ఎస్‌ నేతలు.. సీఎం కేసీఆర్‌ హాజ రయ్యే సభ కోసం ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మరాఠా ప్రజలకు బీఆర్‌ఎస్‌ను పరిచయం చేయడంతోపాటు పార్టీలో పలువురి చేరిక లు ఉంటాయని గులాబీ నేతలు చెప్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో రాష్ట్ర కేబినెట్‌ భేటీ నిర్వహిస్తారు. ఆ తర్వాత నాందేడ్‌కు బయలుదేరుతారని, ఒంటిగంటకు అక్కడికి చేరుకు నే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 

నాందేడ్‌ గులాబీమయం 
నాందేడ్‌లో రైల్వేస్టేషన్‌ సమీపంలోని గురుద్వారా సచ్‌ఖండ్‌ బోర్డు మైదాన్‌లో బీఆర్‌ఎస్‌ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంతోపాటు సభాస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ప్రచార ఫ్లెక్సీలతో గులాబీమయంగా మార్చారు. భారీ హోర్డింగులు, స్వాగత తోరణాలు, బెలూన్లు, స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రవాసులను ఆకట్టుకునేలా చాలా వరకు మరాఠీలో రాయించారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సరిహద్దు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోపాటు స్థానికంగా బీఆర్‌ఎస్‌లో చేరిన, చేరుతున్న నాయకుల ఫొటోలను వాటిపై ముద్రించారు. 

అక్కడే మకాం వేసి.. 
తెలంగాణ వెలుపల తొలిసభ కావడంతో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎంపీ బీబీపాటిల్, బోధన్, జుక్కల్, ముధోల్, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యేలు షకీల్, హన్మంత్‌షిండే, విఠల్‌రెడ్డి, జోగు రామన్న, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రవీందర్‌సింగ్, మాజీ మంత్రి గెడం నగేశ్‌ తదితర నేతలు పక్షం రోజులుగా నాందేడ్‌లోనే మకాం వేశారు.

సభ ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మరాఠీ గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. తనతో అనుబంధం ఉన్న నాందేడ్‌ మాజీ ఎంపీ డీబీ.పాటిల్‌ ఇతర నేతల సహకారం తీసుకున్నారు. ఇప్పటికే పలువురు సరిహద్దు గ్రామాల సర్పంచులు, నాయకులకు గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. 

సరిహద్దు దారులన్నీ అటే.. 
నాందేడ్‌ సభకు మహారాష్ట్రలోని స్థానికులతోపాటు తెలంగాణలోని సరిహద్దు నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, నిజామాబాద్‌ జిల్లా బోధన్, నిర్మల్‌ జిల్లా ముధోల్, ఆదిలాబాద్‌ జిల్లాలోని బోథ్, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు జన సమీకరణకు గులాబీనేతలు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరవుతారని.. నాందేడ్‌ జిల్లాలోని నాందేడ్‌ సౌత్, నార్త్, భోకర్, నాయిగాం, ముథ్కేడ్, దెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్‌ పట్టణాల నుంచి ప్రజలు స్వయంగా వస్తారని అంచనా వేస్తున్నారు. 

ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభ: ఇంద్రకరణ్‌రెడ్డి 
నాందేడ్‌ బీఆర్‌ఎస్‌ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ హాజరయ్యే ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. శనివారం ఇతర నేతలతో కలసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. వేదిక అలంకరణ, అతిథులు, ముఖ్య నేతల సీటింగ్‌ తదితర అంశాలపై సూచనలు చేశారు. 

సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌ ఇదీ.. 
►సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు నాందేడ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.  
►ప్రత్యేక కాన్వాయ్‌లో సభావేదిక సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. 
►అనంతరం చారిత్రక గురుద్వారాను సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 
►1.30 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలకు బీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. తర్వాత ప్రసంగిస్తారు. 
►2.30 గంటలకు సభాస్థలి నుంచి స్థానిక సిటీప్రైడ్‌ హోటల్‌కు చేరుకుని భోజనం చేస్తారు. 
►సాయంత్రం 4 గంటల సమయంలో జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. 
►సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement