సాక్షి, ఆసిఫాబాద్: అంతర్రాష్ట్ర సరిహద్దులో కలప అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. గోదావరి నదీ ప్రవాహంపై మహారాష్ట్ర నుంచి తెలంగాణకు టేకు కలప పెద్ద ఎత్తున తరలివస్తోంది. కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న అక్రమ రవాణా మళ్లీ గుట్టుగా సాగుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఇంద్రావతి నదీ తీరం నుంచి ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంత మైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం దమ్మూర్ సమీప ప్రాంతాలకు రవాణా అవుతోంది. ప్రస్తుతం గోదావరి ప్రవాహం స్థిరంగా ఉండటంతో కలపను దాటించడం స్మగ్లర్లకు సులువుగా మారింది. దీంతో పెద్ద ఎత్తున దమ్మూర్ ప్రాంతానికి టేకు కలప చేరుతోంది. తెలంగాణలో టేకు కలప కొరత, నగరాల నుంచి కలప కోసం డిమాండ్ పెరగడంతో మళ్లీ అంతర్రాష్ట్ర నదీ తీరం గుండా అక్రమ రవాణా జరుగుతోంది.
రాత్రిపూట రవాణా..
మూడు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఇంద్రావతి, గోదావరి నదుల ప్రవాహమే ఈ అక్రమ రవాణాకు కలసి వస్తోంది. అటు ఛత్తీస్‌గఢ్ ఇటు మహారాష్ట్ర సరిహద్దుగా ప్రవహి స్తున్న ఇంద్రావతి నదీ ఇరు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి గోదావరి ప్రవాహం గుండా తెలంగాణకు కలప చేర్చేందుకు అనువైన మార్గంగా మారింది. మహారాష్ట్రలోని దేశినిపేట్ అటవీ ప్రాంతం నుంచి కలప తీసుకొచ్చి ఇంద్రావతికి ఆనుకుని ఉన్న జింగనూర్, లోహకల్లెడ ప్రాంతంలో పెద్ద పెద్ద టేకు దుంగలకు చెక్కలతో తెప్పగా కట్టి ప్రవాహంలో జార విడిస్తున్నారు. అక్కడ సాయంత్రం ఆరు, ఏడు గంటల ప్రాంతంలో నీటిలో వదలితే తెల్లవారుజామున రెండు గం టల ప్రాంతంలో ఇంద్రావతి, గోదావరి నదులు కలిసే సోమ్నూర్ సంగమం కింద జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం దమ్మూర్‌కు చేరుతోంది. దమ్మూర్ గోదావరి ఆనుకుని ఉన్న మూడు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ప్రాంతంతో పాటు నదీ వెడల్పు తక్కువగా ఉన్న ప్రాం తం కావడంతో స్థానికుల సాయంతో పెద్ద ఎత్తున కలప డంప్ చేస్తున్నారు. అనువైన సమయంలో ఇక్కడ నుంచి ముకునూర్, మహాముత్తారం, భూపా లపల్లి మీదుగా ఇతర సుదూర ప్రాంతాలకు తర లిస్తున్నారు. తెల్లవారే వరకూ అంతా పూర్తయ్యేట్టు ఈ దందా సాగుతోంది. ఇటీవల మహారాష్ట్ర అటవీ అధికారులు తెలం గాణకు తరలివస్తున్న కల పను పట్టు కున్నారు. గతంలో మహారాష్ట్రలోని అసవెల్లి, కొమ్నూర్, కొప్పెల, కర్జెల్లి నుంచి కలప రవాణా జరిగేది. ప్రస్తుతం దేశినిపేట్ అడవులు, ఇటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి తెలంగాణకు అధికంగా వచ్చి చేరుతోంది.
అదను చూసి రవాణా
కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కలప అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తోంది. గోదావరి సరిహద్దులో కలప స్మగ్లింగ్ చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేయడం, సరిహద్దు ప్రాంతాల్లో షామిల్లుల సీజ్, అటవీ సిబ్బందిని పెంచడతో కొన్నాళ్ల పాటు తగ్గుముఖం పట్టింది. అయితే ఇటీవల మళ్లీ అక్రమ రవాణా పెరిగింది. అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి ఇంద్రావతి నదీ మీదుగా మూడు, నాలుగు టేకు పొడవాటి దుంగలతో కట్టిన ఒక తెప్ప నదీ ప్రవాహంపై ఎనిమిది నుంచి పది గంటల వ్యవధిలోనే సరిహద్దుకు చేరుతోంది. అయితే దమ్మూరు నుంచి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు తరలించడం కొంత కష్టంగా మారింది. అయినా అటవీ అధికారుల కళ్లు గప్పి చిన్నచిన్న దుంగలుగా మార్చి స్థానిక స్మగ్లర్ల సహకారంతో అటవీ ప్రాంతాల్లోని మార్గాల గుండా అదను చూసి రవాణా చేస్తున్నారు. మరోవైపు మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాలపై స్థానిక అటవీ అధికారులకు గట్టిపట్టు లేకపోవడం కూడా స్మగ్లర్లకు కలసివస్తోంది.
నదీ ప్రవాహంపైనే వేలం
టేకు దుంగల సైజు, పొడువు బట్టి డబ్బుల చెల్లింపులు ఉంటాయి. తెప్పగా కట్టిన దుంగలను బట్టి నదీ ప్రవాహంపైనే ఆ కలపకు విలువ కట్టి ఆ మొత్తాన్ని సరిహద్దుకు కలప చేర్చిన వారికి చెల్లిస్తుంటారు. లక్ష్యం చేరే వరకూ కలప దుంగల తెప్ప ప్రవాహంపై సరిగ్గా వెళ్తుందా లేదా అనేది తెలుసుకునేందుకు అవసరమైతే పడవల్ని ఉపయోగించి గోదావరిలో కలిసే వరకూ గమనిస్తుంటారు. ఇలా అడవుల్లో టేకు చెట్లను నరికి ఒడ్డుకు రవాణా, అక్కడి నుంచి నదీపై మన సరిహద్దుకు చేరడం, అటు నుంచి ఇతర ప్రాంతాలకు తరలవడం వంటి మూడు నాలుగు గ్యాంగ్‌లతో కలప రవాణా సాగుతోంది. అయితే గతంలో మాదిరి రోజు రవాణా కాకుండా అదను చూసి ఈ రవాణా నెలలో నాలుగైదు సార్లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గోదావరి సరిహద్దుల్లో పెద్ద ఎత్తున టేకు కలప డంప్ అయి నగరాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
గుట్టుగా గోదారిలో..
Published Fri, Oct 18 2019 3:20 AM | Last Updated on Fri, Oct 18 2019 3:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment