wood smuggling
-
గుట్టుగా గోదారిలో..
సాక్షి, ఆసిఫాబాద్: అంతర్రాష్ట్ర సరిహద్దులో కలప అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. గోదావరి నదీ ప్రవాహంపై మహారాష్ట్ర నుంచి తెలంగాణకు టేకు కలప పెద్ద ఎత్తున తరలివస్తోంది. కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న అక్రమ రవాణా మళ్లీ గుట్టుగా సాగుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఇంద్రావతి నదీ తీరం నుంచి ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంత మైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం దమ్మూర్ సమీప ప్రాంతాలకు రవాణా అవుతోంది. ప్రస్తుతం గోదావరి ప్రవాహం స్థిరంగా ఉండటంతో కలపను దాటించడం స్మగ్లర్లకు సులువుగా మారింది. దీంతో పెద్ద ఎత్తున దమ్మూర్ ప్రాంతానికి టేకు కలప చేరుతోంది. తెలంగాణలో టేకు కలప కొరత, నగరాల నుంచి కలప కోసం డిమాండ్ పెరగడంతో మళ్లీ అంతర్రాష్ట్ర నదీ తీరం గుండా అక్రమ రవాణా జరుగుతోంది. రాత్రిపూట రవాణా.. మూడు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఇంద్రావతి, గోదావరి నదుల ప్రవాహమే ఈ అక్రమ రవాణాకు కలసి వస్తోంది. అటు ఛత్తీస్‌గఢ్ ఇటు మహారాష్ట్ర సరిహద్దుగా ప్రవహి స్తున్న ఇంద్రావతి నదీ ఇరు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి గోదావరి ప్రవాహం గుండా తెలంగాణకు కలప చేర్చేందుకు అనువైన మార్గంగా మారింది. మహారాష్ట్రలోని దేశినిపేట్ అటవీ ప్రాంతం నుంచి కలప తీసుకొచ్చి ఇంద్రావతికి ఆనుకుని ఉన్న జింగనూర్, లోహకల్లెడ ప్రాంతంలో పెద్ద పెద్ద టేకు దుంగలకు చెక్కలతో తెప్పగా కట్టి ప్రవాహంలో జార విడిస్తున్నారు. అక్కడ సాయంత్రం ఆరు, ఏడు గంటల ప్రాంతంలో నీటిలో వదలితే తెల్లవారుజామున రెండు గం టల ప్రాంతంలో ఇంద్రావతి, గోదావరి నదులు కలిసే సోమ్నూర్ సంగమం కింద జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం దమ్మూర్కు చేరుతోంది. దమ్మూర్ గోదావరి ఆనుకుని ఉన్న మూడు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ప్రాంతంతో పాటు నదీ వెడల్పు తక్కువగా ఉన్న ప్రాం తం కావడంతో స్థానికుల సాయంతో పెద్ద ఎత్తున కలప డంప్ చేస్తున్నారు. అనువైన సమయంలో ఇక్కడ నుంచి ముకునూర్, మహాముత్తారం, భూపా లపల్లి మీదుగా ఇతర సుదూర ప్రాంతాలకు తర లిస్తున్నారు. తెల్లవారే వరకూ అంతా పూర్తయ్యేట్టు ఈ దందా సాగుతోంది. ఇటీవల మహారాష్ట్ర అటవీ అధికారులు తెలం గాణకు తరలివస్తున్న కల పను పట్టు కున్నారు. గతంలో మహారాష్ట్రలోని అసవెల్లి, కొమ్నూర్, కొప్పెల, కర్జెల్లి నుంచి కలప రవాణా జరిగేది. ప్రస్తుతం దేశినిపేట్ అడవులు, ఇటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి తెలంగాణకు అధికంగా వచ్చి చేరుతోంది. అదను చూసి రవాణా కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కలప అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తోంది. గోదావరి సరిహద్దులో కలప స్మగ్లింగ్ చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేయడం, సరిహద్దు ప్రాంతాల్లో షామిల్లుల సీజ్, అటవీ సిబ్బందిని పెంచడతో కొన్నాళ్ల పాటు తగ్గుముఖం పట్టింది. అయితే ఇటీవల మళ్లీ అక్రమ రవాణా పెరిగింది. అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి ఇంద్రావతి నదీ మీదుగా మూడు, నాలుగు టేకు పొడవాటి దుంగలతో కట్టిన ఒక తెప్ప నదీ ప్రవాహంపై ఎనిమిది నుంచి పది గంటల వ్యవధిలోనే సరిహద్దుకు చేరుతోంది. అయితే దమ్మూరు నుంచి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు తరలించడం కొంత కష్టంగా మారింది. అయినా అటవీ అధికారుల కళ్లు గప్పి చిన్నచిన్న దుంగలుగా మార్చి స్థానిక స్మగ్లర్ల సహకారంతో అటవీ ప్రాంతాల్లోని మార్గాల గుండా అదను చూసి రవాణా చేస్తున్నారు. మరోవైపు మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాలపై స్థానిక అటవీ అధికారులకు గట్టిపట్టు లేకపోవడం కూడా స్మగ్లర్లకు కలసివస్తోంది. నదీ ప్రవాహంపైనే వేలం టేకు దుంగల సైజు, పొడువు బట్టి డబ్బుల చెల్లింపులు ఉంటాయి. తెప్పగా కట్టిన దుంగలను బట్టి నదీ ప్రవాహంపైనే ఆ కలపకు విలువ కట్టి ఆ మొత్తాన్ని సరిహద్దుకు కలప చేర్చిన వారికి చెల్లిస్తుంటారు. లక్ష్యం చేరే వరకూ కలప దుంగల తెప్ప ప్రవాహంపై సరిగ్గా వెళ్తుందా లేదా అనేది తెలుసుకునేందుకు అవసరమైతే పడవల్ని ఉపయోగించి గోదావరిలో కలిసే వరకూ గమనిస్తుంటారు. ఇలా అడవుల్లో టేకు చెట్లను నరికి ఒడ్డుకు రవాణా, అక్కడి నుంచి నదీపై మన సరిహద్దుకు చేరడం, అటు నుంచి ఇతర ప్రాంతాలకు తరలవడం వంటి మూడు నాలుగు గ్యాంగ్‌లతో కలప రవాణా సాగుతోంది. అయితే గతంలో మాదిరి రోజు రవాణా కాకుండా అదను చూసి ఈ రవాణా నెలలో నాలుగైదు సార్లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గోదావరి సరిహద్దుల్లో పెద్ద ఎత్తున టేకు కలప డంప్ అయి నగరాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
కలప అక్రమ తరలింపుపై విచారణ
సాక్షి, పశ్చిమ గోదావరి : చింతలపూడి మండలం యర్రగుంటపల్లి అటవీ అభివృద్ధి సంస్థలో కలప అక్రమ తరలింపుపై గుంటూరు అటవీ శాఖ విజిలెన్స్ డీఎం రామలింగారెడ్డి ఆదివారం విచారణ జరిపారు. శుక్రవారం అర్ధరాత్రి యర్రగుంటపల్లి అటవీ ప్రాంతం నుంచి 22 టన్నుల జామాయిల్ కలపతో వెళ్తున్న లారీని యర్రగుంటపల్లికి చెందిన కొంత మంది యువకులు అడ్డుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపడానికి ఆయన వచ్చారు. అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన జామాయిల్ బీట్లను పరిశీలించారు. అధికారుల పరిశీలనలో అడవిలో అనేక ప్రాంతాల్లో జామాయిల్ గుట్టలుగా పడి ఉండటాన్ని గుర్తించారు. అధికారులు విచారణకు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని రోజూ కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నట్లు స్థానిక అటవీ అభివృద్ధి సంస్థ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారులతో పాటు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ టి.కుటుంబరావు, కలపను రవాణా చేసిన ట్రాక్టర్ డ్రైవర్ల నుంచి కూడా లిఖిత పూర్వకంగా స్టేట్మెంట్లు తీసుకున్నారు. విచారణ వివరాలు వెల్లడించకూడదని, నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన విలేకరులకు చెప్పారు. -
దోచేస్తున్నారు..!
సాక్షి, కొత్తగూడెం: అటవీ సంపదను రక్షించడంతో పాటు అడవిలోని కలపను అమ్మగా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వానికి అందించాల్సిన అధికారులు.. ఆ డబ్బును సొంతానికి వాడుకోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ రేంజ్‌ల పరిధిలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ విజిలెన్స్ దాడులు చేయించారు. ఈ దాడుల్లో ఎఫ్డీఓ, ఎఫ్ఆర్ఓలకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ కలప లారీలను పట్టుకోవడంతో పాటు మరికొన్ని వాస్తవాలు సైతం తెలుసుకున్నట్లు సమాచారం. దమ్మపేట రేంజ్‌లోని పూసుగుంట, ఆర్లపెంట సెక్షన్ల పరిధిలో నుంచి సరిహద్దు ఏపీలోకి యథేచ్ఛగా కలప రవాణా చేసినట్లు తెలుస్తోంది. సీతారామ కెనాల్ అలైన్మెంట్లో వచ్చిన కలపను పట్టాభూముల పర్మిట్ల మీద ముందుగా మాట్లాడుకున్న ఏపీలోని వ్యాపారులకు నేరుగా అమ్ముకున్నట్లు సమాచారం. ఏపీ దగ్గరగా ఉండడం, మధ్యలో ఒకే చెక్‌పోస్ట్ ఉండడం, అదీ వీరి పరిధిలోనే ఉండడంతో ఆడిందే ఆటగా మారింది. అలాగే ఒకే పర్మిట్‌పై రెండు లారీ లోడ్లు పంపినట్లు తెలుస్తోంది. ఇక సీతారామ కెనాల్‌పై చెట్లు నరికించేందుకు కూలీలను ఉపయోగిస్తే ప్రభుత్వం ఖర్చులు ఇస్తుంది. అలా కాకుంగా ఏపీకి చెందిన తమకు అనుకూలమైన వ్యాపారులతోనే కలప నరికించడంతో పాటు సదరు కలపను నేరుగా వారే తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకుని, కూలీ ఖర్చులు మాత్రం ఈ అధికారులే తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో వారం రోజుల క్రితం సదరు వ్యాపారి తీసుకెళుతున్న కలప లారీని కిందిస్థాయి బీట్, సెక్షన్ అధికారులు పాల్వంచ డిపోకు తరలించగా, ఈ లారీ కలపను నేరుగా అనధికారికంగా ఐటీసీకి అమ్మడం విశేషం. కిందిస్థాయి సిబ్బందిని మాత్రం ఇతర అంశాల నెపంతో పరోక్షంగా ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎఫ్ఆర్ఓల సహకారంతో కొన్నిసార్లు కలపను ఖమ్మం, సత్తుపల్లి సామిల్లులకు సైతం పంపుతుండడం గమనార్హం. ఇక రైతులకు చెందిన చేదు వేప (సాధారణ) కలప అమ్మకానికి అటవీశాఖ అనుమతులతో పనిలేదు. వీఆర్ఓ, ఎఫ్బీఓ సంతకంతో రవాణా చేయవచ్చు. దీంతో ఇటీవల ఫలానా పట్టాభూమి అనేది లేకుండా 5 లారీల వేప రవాణా చేసినట్లు సమాచారం. ఈ వేప టన్ను రూ.8 వేలు. ఒక్కో లారీకి 30 టన్నుల కలప ఉంటుంది. ధర ఎక్కువ.. చూపింది తక్కువ.. ములకలపల్లి రేంజ్ ఒడ్డుగూడెం డిపోలో ఆక్షన్ సేల్‌లో భాగంగా వెదురుబొంగు ధర ఎక్కువగా పలికినప్పటికీ.. తక్కువగా చూపారనే ఆరోపణలు ఉన్నాయి. వెదురుబొంగుకు ఒక్కొక్కటి రూ.80 ఉండగా, వేలంలో రూ.120 వచ్చినట్లు తెలుస్తోంది. కానీ పోటీ లేదని, రూ.80 మాత్రమే పలికిందని చూపడం గమనార్హం. బయట ఒక్కో వెదురుబొంగుకు రూ.180 వరకు ఉంది. దీంతో ప్రభుత్వానికి 20 నుంచి 30 శాతం ఆదాయం పోతోంది. ఇక టేకు కలప అయితే నేరుగా ఇంటికే తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్పాట్ ఆక్షన్ వద్ద ఎఫ్డీఓ ఉండి బిడ్ జాబితా రాయాల్సి ఉంటుంది. అయితే సదరు వేలందారులతో కుమ్మక్కై కార్యాలయానికి వెళ్లి రాసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాలన్నీ విజిలెన్స్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులపై ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై జిల్లా అటవీ అధికారి శివాల రాంబాబును వివరణ కోరగా వ్యాపారులతో కుమ్మక్కు అయినట్లు, అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
కలప స్మగ్లర్‌పై పీడీ కొరడా!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం హెచ్చరించినట్లుగానే కలప స్మగ్లర్‌పై పీడీ యాక్టు నమోదు కు పోలీసు శాఖ సమాయత్తమైంది. నిజామాబాద్ నగరానికి చెందిన వాజిద్‌పై ఈ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు నిర్మల్ పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గత నెలలో నిర్మల్ పోలీసులు నమోదు చేసిన కలప స్మగ్లింగ్ కేసులో వాజి ద్ మొదటి నిందితు డు. నిజామాబాద్ నగరాన్ని అడ్డాగా మార్చు కుని గత కొన్నేళ్లుగా కలప స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అడవులను నరకడం.. కలపను స్మగ్లింగ్ చేయడాన్నే వృత్తిగా మార్చుకున్న ఆదిలాబాద్ ముల్తానీలతో వాజిద్ చేతులు కలిపి ఈ దందాను కొనసాగిస్తున్నారు. వాజిద్‌పై నిజామాబాద్ జిల్లాతో పా టు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వివిధ పోలీస్స్టేషన్లలో కలప స్మగ్లింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, నేరడిగొండ పోలీస్స్టేషన్లలో వాజిద్‌పై గతంలో కలప స్మగ్లింగ్ కేసులున్నట్లు తేలింది.నిజామాబాద్ జిల్లాలోనూ ఇలాంటి కేసులుండటంతో పీడీ యాక్టు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ చట్టం కింద కేసు నమోదు చేయాలంటే ప్రత్యేక నిబంధనలున్నాయి. వాజిద్‌పై ఉన్న కేసులను పరిశీలిస్తే పీడీ చట్టం వర్తిస్తుం దని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. పరారీలోనే డిప్యూటీ మేయర్.. నిజామాబాద్ కేంద్రంగా సాగుతున్న కలప స్మగ్లింగ్‌పై సర్కారు ఉక్కుపాదం మోపింది. ఇం దులో భాగంగా ఆదిలాబాద్ వైపు నుంచి నిజామాబాద్ నగరానికి తరలిస్తున్న కలప వాహనాన్ని జనవరి 20న నిర్మల్ పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. కేసు తీగ లాగితే నగరంలోని సామిల్లుల్లో గుట్టుగా సాగుతున్న కలప స్మగ్లింగ్ దందా బట్టబయలైంది. ఆయా సామిల్లుల్లో కలప నిల్వలను పరిశీలిస్తే అక్రమ కలప నిల్వలు బయటపడ్డాయి. నిజామాబాద్ నగర డిప్యూటీ మేయర్ ఫయీం వంటి నేతల సామిల్లుల్లోనూ కలప స్మగ్లింగ్ జరిగినట్లు గుర్తించారు. ఈ స్మగ్లింగ్‌లో ఏఆర్ ఎస్ఐ షకీల్ పాషకు కూడా భాగస్వామ్యం ఉందని తేలడం ఆ శాఖ వర్గాల్లో కలకలం రేగిన విషయం విదితమే. ఇటు అటవీశాఖ అధికారుల హస్తం కూడా ఉండటంతో కొందరిపై వేటు పడిన విష యం తెలి సిందే. ఈ ఘటనలో మొత్తం 21 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ ఫయీంతో పాటు, సామి ల్లుల యజమానులు కూడా ఇప్పటికీ పరారీలో నే ఉన్నారు. వీరితో పాటు ఏడుగురు ముల్తానీలను సైతం పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కర్ర కదలొద్దు..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు.. ఉన్న అడవిని కాపాడుకునేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. రోజురోజుకూ అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఊళ్లను వనాలు చేసేందుకు.. అడవి వదిలి జంతువులు బయటకు రాకుండా ఉండేందుకు తీరొక్క ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. అడవుల్లో మహా వృక్షాలను రక్షించేందుకు.. వాటిపై వేటు వేసే అక్రమార్కుల జాడ తెలుసుకునేందుకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. నిఘా కెమెరాలు గతంలో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కెమెరాల సంఖ్యను పెంచింది. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. తనిఖీలను ముమ్మరం చేయనున్నది. ఇటువంటి చర్యలతో అక్రమార్కుల పని పట్టేందుకు, అటవీ సంపదను, విస్తీర్ణాన్ని కాపాడుకునేందుకు వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 64వేల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. ఇందులో 20వేల హెక్టార్లు ఖమ్మం డివిజన్లో.. 44వేల హెక్టార్లు సత్తుపల్లి డివిజన్లో ఉంది. గతంలో అటవీ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టినప్పటికీ ఏదో ఒక మార్గంలో కలప తరలిపోవడంతోపాటు ఇతర అక్రమాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎక్కువగా రాత్రి వేళల్లోనే అడవుల నుంచి కలప తరలిపోతుండడంతో అధికారులు దీనికి చెక్ పెట్టడంతోపాటు అక్రమంగా పోడు కొట్టకుండా చూసేందుకు చర్యలు చేపట్టారు. ఇటువంటి పకడ్బందీ చర్యలతో జిల్లాలో అడవుల సంరక్షణకు అవకాశం ఏర్పడింది. 12 కెమెరాల ఏర్పాటు.. అటవీ ప్రాంతాల్లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అటవీ శాఖ ఆయా ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. ఎక్కువగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే అనుమానం ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టం చేసేందుకు అటవీ అధికారులు పూర్తిస్థాయి చర్యలు చేపట్టారు. ఖమ్మం డివిజన్ పరిధిలోని గుబ్బగుర్తి, భీమవరం, చీమలపాడు అటవీ ప్రాంతాల్లో.. సత్తుపల్లి డివిజన్ పరిధిలోని కనకగిరి అడవులు, లంకపల్లి అడవుల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో ఆయా ప్రాంతాల్లో 4 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో కూడా అటవీ అధికారులు ఎల్లవేళలా నిఘా ఏర్పాటు చేసి.. గస్తీ తిరగడం వంటి కార్యక్రమాలు చేపట్టేవారు. గస్తీ తిరుగుతున్న ప్రాంతంలో కాకుండా.. మరో ప్రాంతంలో అక్రమాలు చోటుచేసుకునే వీలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అటవీ శాఖ నిఘా కెమెరాల సంఖ్యను మరింత పెంచింది. మరో 8 కెమెరాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. దీంతో వీటి సంఖ్య ఇప్పుడు 12కు చేరింది. ఖమ్మం, సత్తుపల్లి డివిజన్ పరిధిలోని అటవీ విస్తీర్ణంలో నిఘా కెమెరాల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు అడవిలోకి ఎవరు వస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలు రికార్డు అవుతుండడంతో స్మగ్లర్లు, ఇతరులు అడవిలో అక్రమాలకు పాల్పడేందుకు సాహసించడం లేదు. ప్రతి రెండు, మూడు రోజులకోసారి నిఘా కెమెరాల్లో రికార్డు అయిన పుటేజీని అటవీ శాఖ సిబ్బంది తీసుకొచ్చి ఆయా డివిజన్ కార్యాలయాల్లో అందజేస్తారు. అక్కడి నుంచి జిల్లా కార్యాలయానికి పుటేజీని పంపుతారు. దానిని పరిశీలించిన అధికారులు ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకున్నట్లు రికార్డు అయితే.. వాటిపై చర్యలు తీసుకునేందుకు కిందిస్థాయి సిబ్బందిని ఆదేశిస్తారు. అలాగే పుటేజీని భద్రపరుస్తారు. పెరగనున్న చెక్‌పోస్టులు.. ఇప్పటికే అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలిపోకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. అటవీ శాఖ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి, ముత్తగూడెం, తల్లాడ, పాలేరు, ఖమ్మం ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నిరంతరం తనిఖీలు చేస్తుంటారు. వీటితోపాటు మరో రెండు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను పెంచాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు మరో రెండు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు గల ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆయా ప్రాంతాల్లో మరో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. అడవులను సంరక్షించేందుకు.. జిల్లాలో అడవులను రక్షించేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా నిఘా కెమెరాల సంఖ్యను పెంచాం. దీంతో కలప అక్రమ రవాణాను నివారించే అవకాశం ఉంది. అలాగే మరో రెండు చెక్‌పోస్టులను పెంచేందుకు ప్రభుత్వానికి నివేదికను పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వాటిని ఏర్పాటు చేయనున్నాం. – బి.సతీష్‌కుమార్, ఇన్చార్జి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్, ఖమ్మం -
నిబంధనలు వర్తిస్తాయి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అటవీ సంపద, వృక్షాల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు టింబర్ డిపోలు, సామిల్లుల యాజమాన్యాలకు గొంతులో వెలక్కాయలా మారాయి. రోజురోజుకూ వృక్ష సంపద అంతరించిపోతుండడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. దీనిని నివారించేందుకు విస్తృతంగా మొక్కలు పెంచడంతోపాటు ఇప్పుడున్న అటవీ సంపద, వృక్షాలను కాపాడేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. ‘జంగల్ బచావో – జంగల్ బడావో’ కార్యక్రమం అమలులో భాగంగా తాజాగా తుమ్మ, వేప, మామిడి కలపకు వాల్టా చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా సామిల్లుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. మరోపక్క నిబంధనలు పాటించని సామిల్లులు, టింబర్ డిపోలపై పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని 274 టింబర్ డిపోలు, సామిల్లుల యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ టింబర్ మర్చంట్స్, సామిల్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని వాటి యజమానులు నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విధించిన నిబంధనలతో తాము టింబర్ డిపోలను, సామిల్లులను నడపలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం లోటు 25.62 శాతం.. జాతీయ అటవీ విధానం ప్రకారం భూభాగంలో మూడో వంతు పచ్చదనం ఉండాలి. కాని మన జిల్లాలో ఇదెక్కడా కనిపించడం లేదు. జిల్లా వైశాల్యం 7.5 లక్షల హెక్టార్లు కాగా.. ఇందులో ప్రస్తుతం 7.38 శాతం (సుమారు 55,350 హెక్టార్లు) మాత్రమే అడవులు, వృక్షాలు విస్తరించి ఉన్నాయి. ఈ పచ్చదనాన్ని మరో 25 శాతానికి పెంచితే.. నిర్దేశిత 33 శాతం పచ్చదనం సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలో మొక్కల పెంపకం, అటవీ, వృక్ష సంపద సంక్షరణకు యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవల జిల్లాలోని టింబర్ డిపోలు, సామిల్లుల యాజమాన్యాలు, అటవీ, పోలీస్ శాఖల అధికారులతో కలెక్టర్ లోకేష్ కుమార్ సమావేశమై పలు ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖ నియమావళి ప్రకారం టింబర్ డిపోలు, సామిల్లుల యాజమానులు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలన్నారు. కలప క్రయవిక్రయాల రికార్డులను నిర్వహించాలని సూచించారు. అయితే, ఈ షరతులు తమ పాలిట శరాఘాతంగా మారాయని టింబర్ డిపోలు, సామిల్లుల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. -
ఇచ్చోడ టు ఇందూరు
ఇచ్చోడ(బోథ్): ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల నుంచి కలప రవాణా దందా ఇచ్చోడ నుంచి ఇందూర్ వరకు నిరా టంకంగా సాగుతోంది. జిల్లాలోని కేశవపట్నం, గుండాల, ఎల్లమ్మగూడ, జోగిపేట్ ప్రాంతాల్లో నివసించే ముల్తానీలు కలప స్మగ్లింగ్ గ్యాంగ్‌లుగా ఏర్పడి కోట్ల రూపాయల కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కలప తరలింపులో సిద్ధహస్తులుగా పేరున్న ముల్తానీలకు నిజామాబాద్‌లో కలప దందా విక్రయాలు చేసే సామిల్ యజమానులు అండగా ఉండడంతో దందా సాగుతోంది. ఈ ముల్తానీలు ఎవరు? పాకిస్తాన్ ముల్తాన్ ప్రావిన్స్ (రాష్ట్రంలో)లోని ముస్లింలలో గిరిజన తెగకు చెందిన ముల్తానీలు దేశానికి స్వాతంత్రం రాక ముందు ఇక్కడి ప్రాంతానికి వలస వచ్చారు. మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా చికిలి, ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం కేశవపట్నం, గుండాల, ఎల్లమ్మగూడ, జోగిపేట్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. స్వాంతంత్రం రాక ముందు ముల్తాన్ రాష్ట్రం అవిభక్త భారత్‌లో భాగంగా ఉండేది. దీంతో ముల్తానీలు అక్కడి నుంచి కూలీనాలీ చేసుకుంటూ సంచార జీవితం ప్రారభించారు. పొట్ట చేతబట్టుకొని అడవుల గుండా గుడారాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. ఇక్కడి వారు ఇక్కడే ఉండిపోయారు. కేశవపట్నం, గుండాల నుంచి జోగిపేట్, బావోజీపేట్, ఎల్లమ్మగూడలకు విస్తరించారు. వీరు నివసించే ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతాలుగా ఉండేవి. దీంతో ముల్తానీలు కలప రవాణానే ఉపాధిగా మార్చుకున్నారు. ముందు నుంచి నేరప్రవృత్తే... అక్రమంగా కలప రవాణాకు పాల్పడే ముల్తానీలు ముందు నుంచి నేరప్రవృత్తి కలిగిన వారే ఎక్కువ. కలప రవాణా ప్రారంభం మొదట్లో చుట్టు పక్కల ప్రాంతాల్లో గృహ నిర్మాణం, ఇతర అవసరాలకోసం కలపను రవాణా చేసే వారు. ముందుగా కలప రవాణా ఎడ్లబండ్ల ద్వారా ప్రారంభమైంది. దాదాపుగా 20కిపైగా ఎడ్లబండ్ల ద్వారా కలపను తీసుకెళ్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయించే వారు. కలప రవాణాలో అడ్డువచ్చిన వారిని భయాందోళనకు గురి చేసి అడ్డుతొలగించేవారు. ఈ రవాణా రాత్రి వేళల్లోనే కొçనసాగేది. కాలక్రమంలో వాహనాల్లో హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కలపను తరలించడం ప్రారంభించారు. జాతీయ రహదారిలో వెళ్తున్న వాహనాలు హైజాక్ చేసి కలపను జిల్లా సరిహద్దులు దాటవేయడం చేశారు. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే లారీలు ఇక్కడి ప్రాంతాల్లో నిలిపిన సమయంలో లారీలు ఎత్తుకెళ్లి కలప తరలించేవారు. స్మగ్లర్ల ఫొటోలు పలు దాబా హోటళ్ల వద్ద ప్రదర్శించారు. కొద్ది రోజులకు లారీల హైజాక్ నిలిచిపోయింది. ముల్తానీలు దందా కొనసాగించడానికి మరో పద్ధతి ఎంచుకున్నారు. జాతీయ రహదారిలోని దాబా హోటల్లో మకాం వేసి కలప స్మగ్లింగ్‌కు అణువుగా ఉన్న లారీ డ్రైవర్లను మచ్చిక చేసుకొని కూరగాయాలు హైదరాబాద్‌కు తరలించాలని నమ్మించి డబ్బు ఆశ చూపేవారు. జాతీయ రహదారికి పర్లాంగ్ దూరంలో కూరగాయలు ఉన్నాయని నమ్మించి తీసుకెళ్లిన లారీలో అరగంటలోనే కలప లోడ్ చేసి డ్రైవర్లను బెదిరించి తరలించేవారు. ఇలా తరలిస్తున్న క్రమంలో కొన్ని వందల లారీలు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. సినిమాను తలపించేలా స్మగ్లింగ్ కొన్ని ఏళ్ల నుంచి కలప రవాణా ఆధారంగా జీవిస్తున్న ముల్తానీలు సినిమాను తలపించేలా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సెల్ఫొన్ వ్యవస్థ వీరికి అండగా ఉంటోంది. రాత్రి సమయంలో అటవీ, పోలీస్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మరోచోట నుంచి కలపను తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులను నమ్మించడానికి చిన్న వాహనంలో కలప ఉంచుతున్నట్లు తెలుస్తోంది. చిన్న వాహనాన్ని మండలకేంద్రానికి తరలించేలోపే మరోచోట నుంచి పెద్ద మొత్తంలో కలపను సరిహద్దులు దాటిస్తున్నారు. ఏడాదిలో రూ.50 లక్షల కలప పట్టివేత 2018లో జనవరి నుంచి నవంబర్ వరకు దాదాపుగా రూ.50 లక్షల కలపతోపాటుగా 18 వాహనాలు అటవీ, పోలీసుశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ప్రకారం మరో పదోవంతు రూ.5 కోట్ల విలువైన కలప ఇచ్చోడ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పదేళ్లలో నిజామాబాద్ వ్యాపారుల కనుసన్నల్లో రూ.50 కోట్ల కలప తరలిపోయినట్లు సమాచారం. వందలకుపైగా వాహనాల నంబర్ ప్లేట్లు.. నిజామాబాద్‌లోని పలు సామీల్లలో అటవీ శాఖ, పోలీసుశాఖ తనిఖీలు నిర్వహించగా వందల కొద్ది వాహనాల నంబర్ప్లేట్లు లభించడంతో ముల్తానీలకు వ్యాపారులు సహకరిస్తున్నారని తేలింది. ఇచ్చోడ ప్రాంతంలో పట్టుబడ్డ వాహనాలకు పైన ఒకనంబర్ ప్లేట్, కింది భాగంలో మరోనంబర్ ప్లేట్, వాహనంలో మరో నంబర్ ప్లేట్ లభించిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. నిజామాబాద్ వ్యాపారుల కీలకపాత్ర.. ముల్తానీలు సాగిస్తున్న కలప స్మగ్లింగ్‌కు పదేళ్ల నుంచి నిజామాబాద్‌కు చెందిన కలప వ్యాపారులు రంగంలోకి దిగారు. దీంతో ముల్తానీల కలప రవాణా జోరందుకుంది. కలప రవాణా చేయడానికి అక్కడి వ్యాపారులే వాహనాలు సమకుర్చడం, స్మగ్లింగ్‌లో ముల్తానీలకు నూతన పద్ధతులు నేర్పించడంతో అక్రమ కలప రవాణాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. పదేళ్లుగా ఇచ్చోడ ప్రాంతం నుంచి వేల కోట్ల కలప జిల్లా సరిహద్దులు దాటి పోయింది. సెల్‌ఫోన్ వ్యవస్థ అందుబాటులోకి రావడం. కలపతో లోడ్ చేసిన వాహనాన్ని జాతీయ రోడ్డుపైకి ఎక్కించి, ఆదిలాబాద్ జిల్లాలోని చెక్పోస్టులతోపాటుగా నిర్మల్, నిజామాబాద్ సరిహద్దులోని సోన్ చెక్‌పోస్టులు కలప వాహనాలు దాటే వరకు నిజామాబాద్ కలప వ్యాపారులు చూసుకోవడంతో కలప దందా ఊపందుకుంది. ముల్తానీలు నివాసమంటున్న గ్రామాల్లో వందలకుపైగా గ్యాంగ్‌లుగా ఏర్పడి దట్టమైన అడవిలోని విలువైన టేకు కలప నరికి తరలించడానికి పూనుకున్నారు. చెక్‌పోస్టులపైనే అనుమానాలు కొన్నేళ్లుగా జిల్లా సరిహద్దుల నుంచి కలపతో వాహనాలు దాటిపోతూనే ఉన్నా జాతీయ రహదారిపై ఉన్న ఇస్పూర్, మొండిగుట్ట చెక్‌పోస్టుల వద్ద ఇప్పటి వరకు ఒక్క వాహనం కూడా పట్టుపడకపోవడంతో, చెక్‌పోస్టుల నిర్వహణపై పలు అనుమానాలకు తావిస్తోంది. అటవీ«శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది సహకరిస్తుండడంతోనే ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. కలప అక్రమ నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు కలప అక్రమ నివారణకోసం ప్రభుత్వం పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటోంది. కలప స్మగ్లర్లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. స్మగ్లింగ్‌కు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. స్మగ్లింగ్ అడ్డుకోవడానికి పోలీస్, ఫారెస్టుశాఖ సమన్వయంగా అడవుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. – చంద్రశేఖర్, ఎఫ్‌డీవో -
కలప అక్రమ నిల్వపై కొరడా
కమ్మర్పల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి నిజామాబాద్ సామిల్లులకు కలపను అక్రమంగా తరలిస్తుండగా నిర్మల్ జిల్లా పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో జిల్లాలోని ఆయా అటవీ క్షేత్ర పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపపై అటవీ శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కమ్మర్పల్లి అటవీ క్షేత్ర పరిధిలోని కమ్మర్పల్లి, భీమ్‌గల్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఉన్న సామిల్స్, టింబర్ డిపోలు, కార్పెంటర్ షాపులపై అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రేంజ్ పరిధిలో 6 సామిల్స్, 6 టింబర్ డిపోలున్నాయి. మోర్తాడ్‌లో 2 నాన్ టీక్(టేకు కలప కాదు) సామిల్స్, భీమ్‌గల్‌లో 2 నాన్ టీక్, 2 టీక్ సామిల్స్ ఉన్నాయి. మోర్తాడ్‌లో 2, భీమ్‌గల్‌లో 4 టింబర్ డిపోలున్నాయి. భీమ్‌గల్, మోర్తాడ్లలోని సామిల్స్‌పై భీమ్‌గల్‌లోని ఓ టింబర్ డిపోపై అటవీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమ కలప పట్టు బడలేదు. భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఏర్గట్ల మండలాల్లోని 18 గ్రామాల్లో ఉన్న కార్పెంటర్ షాపులపై దాడులు నిర్వహించి 12 మందిపై కేసులు నమోదు చేశారు. రూ.28 వేల విలువ చేసే 1.10 క్యూబిక్ మీటర్ల కలపను స్వాధీనం చేసుకున్నారు. ఈ కలపపై ఐదింతలు రూ.1.40 లక్షల జరిమానా విధించారు. అటవీశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలతో అక్రమ కలప రవాణాదారుల్లో అలజడి సృష్టిస్తున్నారు. గోదావరి తీరం నుంచి రవాణా.. గోదావరి నది తీర ప్రాంతం నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ ప్రాంతం నుంచి గత కొన్నేళ్లుగా జిల్లాలోని కమ్మర్పల్లి అటవీ క్షేత్ర పరిధిలోకి టేకు కలప అక్రమంగా రవాణా అవుతోంది. గోదావరి నది తీర ప్రాంతం ఏర్గట్ల మండలం దోంచంద, గుమ్మిర్యాల్ మీదుగా ఏర్గట్ల, ఉప్లూర్, మోర్తాడ్, తిమ్మాపూర్, పాలెం, తొర్తి, కమ్మర్పల్లి తదితర గ్రామాలకు టేకు కలప అక్రమంగా రవాణా అవుతోంది. ఇటీవల కలపను అక్రమంగా తరలిస్తుండగా నిర్మల్ పోలీసులు పట్టుకున్న ఘటన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు బేస్ క్యాంప్, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందితో కలిసి గోదావరి తీరం వెంట రాత్రిపూట, పగటిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో కలపతో ఫర్నీచర్ తయారు చేసేవర్క్ షాపులపై అటవీశాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు భీమ్‌గల్ మండలం పురాణీపేట్, మెండోర, మోర్తాడ్ మండలం పాలెం, మోర్తాడ్, కమ్మర్పల్లి గ్రామాల్లోని ఫర్నీచర్ వర్క్ షాపులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. దీంతో అక్రమ కలపతో ఫర్నీఛర్ తయారు చేసే కార్పెంటర్ల గుండెల్లో రైల్లు పరుగెత్తుతున్నాయి. ఇదివరకు వడ్రంగిల వద్ద ఉన్న దూగడ పట్టే యంత్రాలకు లైసెన్స్‌లు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. తనిఖీలు చేస్తూనే ఉంటాం.. కలప అక్రమ రవాణా పై తనిఖీలు నిరంత రం కొనసాగుతూనే ఉంటాయి. అక్రమ కలపతో పట్టుబడితే కేసు నమోదు చేసి జైలుకు పంపుతాం. కలప అక్రమ రవాణా, అక్రమ నిల్వలపై ప్రజలు సెల్నం.7382633362కు సమాచారం అం దించి సహకారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. –మనోజ్‌కుమార్, ఎఫ్ఆర్ఓ, కమ్మర్పల్లి -
అడవి దొంగలపై ఉక్కుపాదం
ఇచ్చోడ(బోథ్): అడవి దొంగలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో తొలిసారిగా పీడీ యాక్టు అస్త్రాన్ని ప్రయోగించారు. అటవీ సంపదను దోచుకునే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో కలప దొంగలపై జిల్లా యంత్రాంగం ఓ కన్నేసింది. పీడీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. జిల్లాలో తొలిసారిగా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన కలప స్మగ్లర్ షబ్బీర్‌పై కలెక్టర్ అనుమతితో జిల్లా పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. జిల్లాల వారీగా అడవి దొంగల గుర్తింపు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం జిల్లాల వారీగా కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిని ఇప్పటికే అధికారులు గుర్తించి జాబితా తయారు చేశారు. జల్లా వ్యాప్తాంగా కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతూ నేర ప్రవృత్తిపైనే ఆ«ధారపడ్డా వారు 69 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలో 69 మందిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ, బజార్హత్నూర్, బోథ్, పెంబి, ఇంద్రవెళ్లి, సిరికొండ, ఖానాపూర్, కడెం, మామడ, సారంగపూర్, ఉట్నూర్, జన్నారం, తిర్యాణి, వాంకిడి మండలాల్లో అడవి దొంగలను అధికారులు గుర్తించారు. సీఎం సీరీయస్.. ఆదిలాబాద్ జిల్లాలో 43 శాతం ఉన్న అడవులు 33 శాతానికి పడిపోవడంతో రానున్న రోజుల్లో పర్యావరణానికి త్రీవ ముప్పు ఏర్పడనుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సీరీయస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. జంగిల్ బచావో..జంగిల్ బడావో అనే నినాదంతో అడవుల పెంపకంపై దృష్టి సారించారు. ఈ మేరకు జిల్లా అధికారులు స్మగ్లర్ల ఆట కట్టించే పనిలో ఉన్నారు. సీఎంవో నుంచి పర్యవేక్షణ.. కలప స్మగ్లింగ్ జరుగుతున్న ప్రాంతాలు, స్మగ్లర్లు, అధికారులు, నాయకులపై సీఎంవో నుంచి రోజు వారి పర్యవేక్షణ జరుగుతున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా జరుగుతున్న కలప స్మగ్లింగ్‌ను నిరోధించడంలో సీఎంవో అధికారులు జిల్లా స్థాయి అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. కలప స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉన్న వారు ఎంతటి వారైనా వదిలపెట్టకుండా పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అటవీశాఖ, పోలీసు అధికారులు, నాయకులు, స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జిల్లాలో మొదటి సారిగా పీడీ యాక్టు.. జిల్లాలో పీడీ యాక్టు కేసు మొదటిసారిగా నమోదైంది. ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన కలప స్మగ్లర్ శబ్బీర్‌పై ఈ యాక్టు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గత కొన్ని రోజుల నుంచి అటవీఅధికారులు, పోలీసులకు సవాలుగా మారిన శబ్బీర్‌పై ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్, ఆదిలాబాద్, నిర్మల్ పోలీస్టేషన్ల పరిధిలో 15 వరకు కేసులు ఉన్నాయి. అటవీ అధికారులపై దాడులు, అటవీ చెక్‌పోస్టుల ధ్వంసం వంటి కేసులు కూడా అటవీశాఖలో నమోదై ఉన్నాయి. గత కొన్నేళ్లుగా తరచూ అక్రమ కలప రవాణా చేయడం లాంటి కేసులు ఉండటంతో మోస్ట్ వాంటెండ్ కింద శబ్బీర్‌పై పీడీ యాక్టు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలోకి స్మగ్లర్లు.. గత వారం రోజుల కిత్రం కలప స్మగ్లర్ శబ్బీర్ను పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్టు కింద జైలుకు తరలించడండంతో కలప స్మగ్లర్లలో వణుకు పుట్టింది. కొన్నేళ్ల నుంచి కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతూ ఐదారు కేసులు ఉన్న వారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పలు కేసుల్లో అరెస్ట్ అయి జామీనుపై బయటకు వచ్చిన వారు చాలా మంది ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాల్సిన వారిపై పోలీసులు ఓ కన్నేసి వారి కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం. -
కలప అక్రమ రవాణాకు చెక్
రామాయంపేట(మెదక్): అటవీ ప్రాంతల నుంచి కలప అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. అడవులను కాపాడే నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని అటవీశాఖ అధికారులను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. ఎవరినీ వదిలిపెట్టకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో విలువైన కలప లేకపోవడంతో రామాయంపేట అటవీ ప్రాంతం మీదుగా ఇతర రాష్ట్రాల నుంచి టేకు, ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. దీంతో ఈ విషయమై జిల్లా అటవీశాఖ ప్రత్యేక చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి ఎక్కడిక్కడ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతం రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంచేందుకు సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో అధికారులు పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో అటవీ ప్రాంతం నుంచి కలప అక్రమ రవాణా తగ్గినప్పటికీ అక్రమార్కులు అడపాదడగా చెట్లను నరుకుతునే ఉన్నారు. వీరికి ఇప్పటికే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం ఆరు రేంజీల పరిధిలో 58 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో విలువైన కలప లేకపోవడంతో ఈ ప్రాంతంలో కలప అక్రమ రవాణా తక్కువగానే సాగుతోంది. సీఎం ఆదేశాల దరిమిలా అన్ని రేంజీల పరిధిలో ప్రత్యేక చర్యలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమ రవాణా జరిగినా ప్రాంతాలను అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. గిరిజనతండాలను ఆనుకునే ఉన్న అటవీ ప్రాంతం నుంచి అక్కడక్కడా చెట్లను నరుకుతున్నట్లు సమాచారం. ఇందుకు గుర్తుగా మొడులు మాత్రమే మిగిలాయి. జాతీయ రహదారిపై నుంచి విలువైన కలప అక్రమ రవాణా జరుగుతుండగా... పలుమార్లు రామాయంపేటవద్ద అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు పట్టుబడ్డాయి. ఇతర రాష్ట్రాలనుంచి గతంలో ఎర్రచందనం, టేకు కలప అక్రమరవాణా జరుగుతుండగా అటవీ అదికారులు రామాయంపేట వద్ద పట్టుకున్నారు. ఇందులో భాగంగా రాత్రివేళ పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతోపాటు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. కలప అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లా పరిధిలో అటవీప్రాంతంలో విలువైన కలప లేకపోవడంతో ఈ ప్రాంతంలో అక్రమ రవాణా తగ్గింది. ఏదేమైనా కలప అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్నటువంటి అడవిని కాపాడుకోవడానికిగాను ప్రజలు కూడా తమకు సహకరించాలి. ఎదైనా సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. – పద్మజారాణి, జిల్లా అటవీ అధికారిణి -
నిజామాబాద్ జిల్లాలో జోరుగా కలప అక్రమ రవాణా
-
అటవీఅధికారులపైనా వేటు..!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం.. అటవీశాఖ ఉన్నతాధికారులపైనా చర్యలకు ఉపక్రమించింది. స్మగ్లర్లతో అంటకాగారానే ఆరోపణలున్న ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ ఎఫ్డీఓ వేణుబాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (నార్త్) రవిమోహన్‌భట్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం అటవీశాఖ పీసీసీఎఫ్ ప్రశాంత్కుమార్ఘా ఆదేశాలు జారీ చేశారు. అటవీశాఖలో ఓ ఎఫ్డీఓ స్థాయి అధికారిపై వేటు వేయడం తొలిసారి కావడంతో ఆశాఖ వర్గాల్లో కలకలం రేగుతోంది. జిల్లాలో సామిల్లుల్లో రూ.కోట్లలో అక్రమ కలప దందా సాగుతున్నా.. చూసీ చూడనట్లు వదిలేశారనే ఆరోపణలపై ఈ ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది. తరచూ ఆదిలాబాద్ జిల్లా నుంచి అక్రమ కలప నిజామాబాద్‌కు వస్తున్నట్లు ఈ అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు.. విధి నిర్వహణలో అలసత్వం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కలప స్మగ్లర్లకు సహకరిస్తున్న ఏఆర్ ఎస్ఐ షకీల్‌పై సైతం కేసు నమోదు చేసిన పోలీసులు, ఆయను సస్పెండ్ చేస్తూ పోలీసుశాఖ నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. షకీల్‌ను అరెస్టు చేసేందుకు పొలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సామిల్లుల లైసెన్సులు రద్దు.. కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నాలుగు సామిల్లుల లైసెన్సులను సైతం రద్దు చేయాలని అటవీశాఖ నిరయం తీసుకుంది. నిజామాబాద్ సామిల్, బిలాల్ సామిల్, సోహైల్ సామిల్, దక్కన్ సామిల్ల లైసెన్సులు రద్దు చేయనున్నారు. గురువారం జిల్లా అటవీశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సామిల్లు నిబంధనలను ఉల్లంఘించి నిల్వ ఉంచిన అక్రమ కలపను కనుగొన్న అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శాఖా పరమైన విచారణ.. జిల్లాలో యథేచ్ఛగా కలప స్మగ్లింగ్ కొనసాగుతున్నప్పటికీ చెక్ పెట్టాల్సిన అటవీశాఖ అధికారులు అక్రమార్కులతో అంటకాగడాన్ని ఎట్టకేలకు అటవీశాఖ తీవ్రంగా పరిగణించింది. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసిన అటవీశాఖ ఈ వ్యవహారంపై శాఖా పరమైన విచారణ కూడా నిర్వహించనుంది. జిల్లాలో కలప స్మగ్లింగ్ య«థేచ్చగా సాగుతోంది. ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ముల్తానీలతో నేరుగా సంబంధాలు పెట్టుకున్న జిల్లాకు చెందిన స్మగ్లర్లు ఇచ్చోడ, పెంబీ వంటి దట్టమైన అటవీప్రాంతాన్ని మైదానంగా మార్చేశారు. ఒక్కో సామిల్లులో ప్రతినెలా రూ.కోటికిపైగా విలువైన కలప అక్రమ దందా కొనసాగుతోంది. అటవీ, పోలీసుశాఖ ఉన్నతాధికారుల అండతో స్మగ్లర్లు తమ దందాను కొనసాగించారు. ఎట్టకేలకు ఈ కలప స్మగ్లింగ్‌పై సర్కారు దృష్టి సారించడం., నిర్మల్ పోలీసులకు చిక్కిన కలప వ్యాన్ కేసు ఆధారంగా తీగలాగడంతో ఈ స్మగ్లర్ల డొంక కదిలింది. కొనసాగిన తనిఖీలు.. ఆదివారం నుంచి సామిల్లుల్లో కలప నిల్వలు, రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు గురువా రమూ తనిఖీలను కొనసాగించారు. దీంతో మిగిలిన సామిల్లుల యజమానులు అన్ని సర్దుకుంటున్నట్లు సమాచారం. అక్రమ కలపను గుట్టు చప్పుడు కాకుండా సామిల్లుల నుంచి తరలించి, రికార్డులను సర్దేసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
‘కలపదందా’లో మరెందరో?
నిర్మల్: ఆదిలాబాద్–నిజామాబాద్ జిల్లాల మధ్య దర్జాగా సాగుతున్న కలప రవాణాలో పెద్ద రాకెట్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలుతోంది. ఇందులో స్మగ్లర్లకు పోలీసు, అటవీ శాఖకు చెందిన ఇంటిదొంగలే సహకరిస్తున్నట్లు స్పష్టమైంది. ఇప్పటికే నిజామాబాద్‌కు చెందిన ఏఆర్ ఎస్సై షకీల్‌పాషా, ఉట్నూర్ ఎఫ్ఎస్వో రాజేందర్ సస్పెండ్ కాగా, తాజాగా ఇచ్చోడ సీఐ సతీశ్‌కుమార్, నేరడిగొండ ఎస్సై హరిశేఖర్‌ను తన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్ గురువారం ఆదేశించడం, వారి స్థానాల్లో మరో ఇద్దరికి వెంటనే బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కలప అక్రమ రవాణాపై సీరియస్‌గా దృష్టిపెట్టిన సర్కారు ఈ కేసులో లోతుగా విచారణకు ఆదేశించడంతో నిర్మల్ పోలీసులు ఆ దిశగా కూపీ లాగుతున్నారు. ఇందులో భాగంగా మరింతమంది ‘ఇంటి దొంగలు’ కూడా బయటపడనున్నట్లు తెలుస్తోంది. బయటపెట్టిన నిర్మల్ పోలీసులు.. ఈ నెల19న నిజామాబాద్ తరలుతున్న రూ.16.52 లక్షల విలువైనకలపను నిర్మల్ పోలీసులు పట్టుకోవడంతో బట్టబయలైన ఈ అక్రమ దందా రెండు ఉమ్మడి జిల్లాల్లో సంచలనంగా మారుతోంది. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్‌కు ఏళ్లుగా సాగుతున్న కలప స్మగ్లింగ్ రాకె ట్లో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే దొరికిన స్మగ్లర్లు, అధికారులతోపాటు మరింత మంది ప్రమేయం ఉన్నట్లు తేలుతుండడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. శనివారం వేకువజామున కలప పట్టుబడగానే నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు రంగంలోకి దిగారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు బృందాలను పంపించి విచారణ చేయించారు. ఈమేరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు సామిల్ల యజమానులు, స్మగ్లర్లు, ఏఆర్ ఎస్సై కలిసి ఆదిలాబాద్ జిల్లా నుంచి కలపను అక్రమంగా తరలిస్తున్నట్లు తేల్చారు. ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం ప్రాంతానికి చెందిన ముల్తానీలతో టేకు చెట్లను నరికిస్తూ..స్థానిక ఉట్నూర్ ఎఫ్ఎస్ఓ రాజేందర్, నిర్మల్ జిల్లా సోన్ వద్ద గల చెక్‌పోస్టులో అక్కడి అధికారులు ప్రైవేటుగా నియమించిన సహాయకుడు సద్దాంల సహకారంతో గుట్టుగా నిజామాబాద్ జిల్లాకు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏఆర్ ఎస్సై షకీల్‌పాషా స్వయంగా అక్రమ రవాణాలో ఉండి, సామిల్‌కు కలప చేరుస్తున్నట్లు తేలిపోయింది. ఇతడి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా వాహనాల నంబర్ప్లేట్లు వందవరకు లభించినట్లు సమాచారం. సీఐ, ఎస్సైలపై చర్యలు.. కలప స్మగ్లింగ్‌లో నేరుగా పాల్గొన్న నిజామాబాద్ ఏఆర్ ఎస్సై షకీల్‌పాషా, సహకరించిన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎఫ్ఎస్ఓ రాజేందర్‌ను అప్పటికప్పుడే సస్పెండ్ చేశారు. కేసును లోతుగా విచారించగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ సీఐ సతీశ్‌కుమార్, నేరేడిగొండ ఎస్సై హరిశేఖర్లు పరోక్షంగా సహకరించినట్లు సందేహాలు రావడంతో వారిని గురువారం తన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్ ఆదేశించారు. తమ పరిధిలో జరుగుతున్న దందాను అరికట్టడంలో విఫలం కావడమే కాకుండా, పరోక్షంగా సహకరించినట్లు సమాచారం ఉండడంతో డీఐజీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కలప రాకెట్‌కు సహకారం అందించిన పక్కజిల్లా నిజామాబాద్‌లోనూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. జిల్లాలో స్మగ్లర్లతోపాటు స్థానిక సామిల్ యజమానులకు పరోక్షంగా సహకరించేలా ప్రవర్తించారన్న ఆరోపణలతో నిజామాబాద్ ఎఫ్‌డీవో వేణుబాబు, సౌత్ రేంజ్ ఎఫ్ఆర్వో రవిమోహన్‌భట్, డిప్యూటీ ఎఫ్ఆర్వో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా ఆదేశాలు జారీ చేశారు. అక్కడి ఒక సామిల్‌ను సీజ్ చేశారు. మరోవైపు కేసు నమోదైన తర్వాత నుంచి పరారీలో ఉన్న ఏఆర్ ఎస్సై షకీల్‌పాషా, నిజామాబాద్‌కు చెందిన సామిల్ యజమాని ఆఫ్జల్ఖాన్లను గురువారం నిర్మల్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉట్నూర్ ఎఫ్ఎస్వో రాజేందర్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నట్లు వారు చెబుతున్నారు. కలపను అక్రమంగా తరలిస్తున్న ఈ కేసుపై మరింతగా విచారణ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన స్పష్టమైన ఆదేశాలమేరకు కలపదందాలో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
మరో రెండు సా మిల్లుల సీజ్
అక్రమ కలప వ్యాపారం కేసులో అధికారులు మరోరెండు సా మిల్లులను సీజ్ చేశారు. కొన్ని రోజులుగా సా మిల్లుల్లో అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు సా మిల్లులు సీజ్ కాగా బుధవారం వీటిని జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్, పోలీస్ కమిషనర్ కార్తికేయ కలిసి పరిశీలించారు. అక్రమ కలప రవాణాలో భాగస్వామ్య ముందని ఆరోపణలు ఎదు ర్కొన్న ఏఆర్ ఎస్ఐ షకీల్పాషాను సస్పెండ్ చేస్తూ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సీజ్ చేసిన సా మిల్లుల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ సిటీ(నిజామాబాద్ అర్బన్): అక్రమ కలప వ్యాపారం కేసులో మరోరెండు సా మిల్లులను సీజ్ చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. బుధవారం మాలపల్లిలో గల దక్కన్, సోహైల్ సా మిల్లులను సీజ్ చేస్తూ డీఎఫ్‌వో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు నాలుగు సా మిల్స్ సీజ్ కావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నాలుగు దుకాణాల యాజమానులు పరారీలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పై నాలుగు సా మిల్లను సీజ్ చేసి, అందులోని కలప రికార్డుల ప్రకారం ఉందా లేదా అనే విషయాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు డీఎఫ్‌వో ప్రసాద్ వెల్లడించారు. అటవీశాఖ అధికారుల తనిఖీలో సోహైల్ సా మిల్లులో ఆరు దుంగలు, దక్కన్ సా మిల్లులో ఐదు దుంగలు అక్రమంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. దాంతో వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్తికేయ, డీఎఫ్‌వో ప్రసాద్‌తో కలిసి సీజ్ చేసిన నాలుగు సా మిల్లులను పరిశీలించారు. వాటిలో లెక్క తేలెంతవరకు పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని పోలీసులను, అటవీశాఖ సిబ్బందిని ఆదేశించా రు. ముఖ్యంగా రాత్రిపూట బందోబస్తులో నిర్లక్ష్యం చేయవద్దని సీపీ సూచించారు. దాడులు కొనసాగిస్తాం : డీఎఫ్‌వో జిల్లా కేంద్రంలోని మాలపల్లిలో నిజామాబాద్, బిలాల్, దక్కన్, సోహైల్ సా మిల్లులకు అక్రమంగా కలప రవాణా చేసినట్లు తేలటంతో వాటిని సీజ్ చేసినట్లు, జిల్లాలో అనుమానం ఉన్న మిగతా సా మిల్లులలో దాడులు కొనసాగించనున్నట్లు డీఎఫ్‌వో తెలిపారు. ప్రస్తుతం సీజ్ అయిన నాలుగింటి లో తనిఖీలు పూర్తి అయ్యాక జిల్లాలో అనుమానం ఉన్న, గతంలో ఆరోపణలు వచ్చిన సా మిల్లులలో దుంగలు రికార్డుల ప్రకారం ఉన్నాయా లేదా, అనేవి పరిశీలించి దొంగ కలప ఉంటే సా మిల్‌ను సీజ్ చేయనున్నట్లు డీఎఫ్‌వో వెల్లడించారు. గతంలో ఆరు సా మిల్లుల సీజ్... అక్రమ కలప వ్యాపారం చేసిన వ్యాపారులపై అటవీశాఖ అధికారులు గతంలోనూ కొరడా ఝళిపించారు. 1988లోనూ ఇదే మాదిరిగా అక్రమ కలప వ్యాపారం కేసులో అధికారులు ఒకేసారి ఆరు సా మిల్లుల సీజ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పుడు మాలపల్లి, బోధన్ రోడ్డు, పూలాంగ్, వినాయక్‌నగర్ ప్రాంతాల్లో గల ఆరు సా మిల్లులను అధికారులు సీజ్ చేశారు. ఇప్పుడు ఒకేసారి మాలపల్లిలో నాలుగు సా మిల్లుల సీజ్, మిగతా అక్రమ వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడతో పాటు నిర్మల్ జిల్లా మామడ మండలం నుంచి నిజామాబాద్‌కు కలప అక్రమ రవాణా చేస్తూ నిర్మల్ రూరల్ పోలీసులకు పట్టుబడటం, ఈ కేసులో జిల్లాకు చెందిన ఏఆర్ ఏఎస్ఐ షకీల్ పాష పాత్ర ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో లోతుగా విచారణ జరిపి కూపీ లాగారు. నిజామాబాద్‌లోని మాలపల్లిలో గల సా మిల్లుల యాజమానులు చేస్తున్న అక్రమ కలప వ్యాపార బాగోతం బట్టబయలయ్యింది. ఈ కేసులో నిర్మల్ పోలీసులు ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిజామాబాద్ ఫారెస్టు అధికారులతో కలిసి సా మిల్లులపై దాడులు చేయడంతో సా మిల్లులలో అక్రమ కలప వ్యాపారాలు వెలుగుచూస్తున్నాయి. అధికారుల దాడులతో కొంతమంది అక్రమార్కులు జాగ్రత్తగా తమ సా మిల్లులోని కలపను ఇతర చోటుకు తరలించినట్లు తెలిసింది. నాలుగు సా మిల్లులపై వచ్చిన ఆరోపణలతో దాడులకు దిగిన అధికారులు మిగతా సా మిల్లులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే వాటిలో కూడా అక్రమ కలప వ్యాపారం బయట పడే అవకాశం ఉండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీజైన సా మిల్లుల వద్ద గట్టి బందోబస్తు అక్రమ కలప వ్యాపారం విషయంలో సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆదేశాలు స్పష్టంగా ఉన్న నేప థ్యంలో అధికారులు సీజ్ అయిన సా మిల్లుల వద్ద గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల్లో సీజ్ అయిన నాలుగు సా మిల్లుల వద్ద అటవీశాఖ, పోలీసులు సంయుక్తంగా గట్టి బందోబస్తు చేపట్టారు. సీజ్ అయిన సా మిల్లులలో రికార్డుల ప్రకారం దుంగలు ఉన్నాయా లేవా అనేది ఇప్పట్లో తేలే అవకాశం లేక వాటి నుంచి దుంగలు బయటకు తరలిపోకుండా ఒక్కో సా మిల్ వద్ద అటవీశాఖ నుంచి సెక్షన్ ఆఫీసర్ ఒకరు, ఇద్దరు బీట్ ఆఫీసర్లు, ఫారెస్టు స్ట్రైక్ఫోర్సు సిబ్బంది ఒకరు, పోలీస్‌శాఖ నుంచి ఒక ఎస్‌ఐస్థాయి అధికారితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను బందోబస్తుకు నియమించారు. -
సీఎం ఆదేశిస్తే గానీ..
కలప స్మగ్లింగ్‌పై సమన్వయంతో చర్యలకు ఉపక్రమించిన అటవీ, పోలీసు శాఖ అధికారులు నిర్మల్ జిల్లా సోన్ వద్ద ఇటీవల రూ.16 లక్షల విలువైన కలపను పట్టుకున్నారు. కూపీ లాగడంతో జిల్లాలో డొంక కదులుతోంది. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ కేంద్రాలుగా కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతుండగా.. అక్రమార్కులకు ఆదిలాబాద్, నిర్మల్ అటవీ ప్రాంతంలో కలప స్మగ్లింగే జీవనాధారంగా చేసుకున్న ముల్తానీలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : సామిల్లుల కలప స్మగ్లింగ్‌పై ఎట్టకేలకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించడంతో అటవీ, పోలీసుశాఖలు సంయుక్తంగా కలప అక్రమ రవాణాపై దృష్టి సారించాయి. ఇన్నాళ్లూ మామూళ్ల మత్తులో ఉన్న అటవీశాఖ అధికార యంత్రాంగం సామిల్లుల్లో జరుగుతున్న అక్రమాలను చూసీచూడనట్లు వదిలేసింది. ప్రతినెలా రూ.లక్షల్లో మామూళ్లు దండుకుంటున్న కొందరు అటవీశాఖ అధికారులు సామిల్లులు, టింబర్ డిపోల్లో నామమాత్ర తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ కేంద్రాలుగా కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్ అటవీ ప్రాంతంలో కలప స్మగ్లింగే జీవనాధారంగా చేసుకున్న ముల్తానీలతో నేరుగా సంబంధాలు పెట్టుకున్న కొందరు సామిల్లుల యజమానులు రూ.లక్షలు విలువ చేసే టేకు కలపను స్మగ్లింగ్ చేసి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు కనుసన్నల్లో, పోలీసు శాఖ అండదండలతో ఈ దందా యథేచ్ఛగా సాగుతూ వస్తోంది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించింది. దీంతో అప్పట్లో పలు సామిల్లుల్లో తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు, ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. తాజాగా ‘అటవీ’ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో చర్యలకు ఉపక్రమించాయి. ఇందులో భాగంగా కలప అక్రమ రవాణా కూపీ లాగడంతో జిల్లాలోని స్మగ్లింగ్ డొంక కదులుతోంది. ఆదిలాబాద్ అటవీ ప్రాంతం నుంచి నిజామాబాద్‌కు టేకు కలప వాహనాలు వస్తున్నాయన్న సమాచారం మేరకు నిఘా పెట్టిన ఇరు శాఖల అధికారుల బృందం జిల్లా సరిహద్దుల్లోని సోన్ చెక్‌పోస్టు వద్ద మాటువేసి పట్టుకున్నాయి. సుమారు రూ.16 లక్షలకు పైగా విలువ చేసే టేకు కలపను తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కలప స్మగ్లింగ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నిజామాబాద్ నగరంలోని పలు సామిల్లులకు ఈ కలప అక్రమ రవాణా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆయా సామిల్లులపై కేసులు నమోదు చేసి, తనిఖీలు చేపట్టారు. పోలీసు అండదండలు..? జిల్లాలో సాగుతున్న కలప స్మగ్లింగ్‌కు ఇటు పోలీసుశాఖలో కొందరు ఉన్నతాధికారుల అండదండలున్నట్లు తేటతెల్లమైంది. సోన్‌లో పట్టుబడిన కలప వాహనాన్ని స్వయంగా ఓ ఏఎస్ఐ వాహనం ముందు కారులో ఉండి స్మగ్లింగ్ చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూడటం గమనార్హం. దీన్ని బట్టి పోలీసుశాఖలోని కొందరు ఈ కలప స్మగ్లర్లతో అంటకాగుతున్నట్లు బహిర్గతమైంది. ప్రతినెలా రూ.కోటి పైగా మామూళ్లు..? ప్రతినెలా రూ.కోటి పైగా మామూళ్లు..? జిల్లాలో మొత్తం 95 వరకు సామిల్లులున్నాయి. మరో 15 టింబర్ డిపోలున్నాయి. ఒక్క నిజామాబాద్ నగరంలోనే 41 వరకు ఇవి ఉంటాయి. గతంలో టేకు, నాన్ టేకు పర్మిషన్లు వేర్వేరుగా ఇచ్చేవారు. ప్రస్తుతం అన్ని సామిల్లులకు టేకు కలప కోసే అధికారాలను కట్టబెట్టారు. ఆయా సామిల్లుల నుంచి కొందరు అధికారులు ప్రతినెలా పెద్ద మొత్తంలో మామూళ్లు దండుకోవడం జిల్లాలో పరిపాటిగా తయారైంది. సామిల్ టర్నోవర్‌ను బట్టి ఒక్కో సామిల్ నుంచి ప్రతినెలా రూ.లక్ష వరకు పోగేస్తున్నారు. ఇలా అన్ని సామిల్లుల నుంచి ప్రతినెలా రూ.కోటికిపైగా మామూళ్లు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్థాయిని బట్టి అధికారులకు ప్రతినెలా ఠంచనుగా ముడుపులు అందడంతో నిర్ణీత వ్యవధిలో సామిల్లుల్లో జరపాల్సిన తనిఖీలు, ఇన్స్పెక్షన్లను అధికారులు మమ అనిపిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. -
కలప స్మగ్లర్ల ఆగడాలు
ఇచ్చోడ(బోథ్): కలప స్మగ్లర్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. విలువైన అటవీ సంపదను తరలించుకుపోతున్నారు. అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులపై తరచూ దాడులకు దిగుతున్నారు. అయినా స్మగ్లర్ల నుంచి దాడుల నియంత్రణకు అధికార యంత్రాంగం శాశ్వతచర్యలు తీసుకోవడంలో విఫలం అవుతోంది. ఇచ్చోడ కేంద్రంగా జరుగుతున్న అక్రమ కలప రవాణాను అటవీశాఖ అడ్డుకునే చర్యలు తీసుకుంటున్నా కలప స్మగ్లర్లు బరితెగించి దాడులు నిర్వహిస్తూ అటవీసంపదను తరలించుకుపోతున్నారు. తాజాగా ఆదివారం ఉదయం ఇచ్చోడ మండలంలో ఎండ్ల బండ్లతో కలపను రవాణా చేస్తుండగా ఇచ్చోడ టైగర్‌జోన్ అధికారులు అడ్డుకున్న సంఘటనలో అటవీ అధికారులపై దాడి చేసి కలపను బలవంతంగా తీసుకెళ్లారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇచ్చోడ కేంద్రంగా జరుగుతున్న కలప అక్రమరవాణా అడ్డూఅదుపు లేకుండా జరుగుతోంది. 2016 సంవత్సరంలో అక్రమంగా కలప స్మగ్లింగ్ చేస్తున్న సమాచారం మేరకు అటవీ అధికారులు సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చించోలి వద్ద అధికారుల జీపును కల్వర్టులోకి తోసివేసి ధ్వంసం చేశారు. 2015 సంవత్సరంలో బజార్హత్నూర్ మండలంలోని డెడ్రా వద్ద పెద్ద్దఎత్తున్న కలప స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడి ప్రాంతానికి వెళ్లగా స్మగ్లర్లు మూకుమ్మడి దాడులకు దిగారు. ఈ దాడుల్లో అప్పటి ఎఫ్ఆర్వోతోపాటు పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఇచ్చోడ మండలం నేరడిగొండ మండలం సరిహద్దులో కుప్టి వంతెన వద్ద స్మగ్లర్లు లారీలో అక్రమంగా కలప తరలిస్తుండగా అటవీశాఖ అధికారులపై రాళ్లతో దాడి చేసిన సంఘటనలో పలువురు అధికారులకు గాయాలు అయ్యాయి. అక్రమంగా కలప రవాణా చేసే స్మగ్లర్లకు అడ్డు వస్తున్న అటవీశాఖ అధికారులపై తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోకపోవడంతో స్మగ్లర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇప్పటికైనా కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి అక్రమంగా కలప తరలిచిపోకుండా చర్యలు తీసుకోని అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. -
దుంగలు.. దొంగలు
తూర్పుగోదావరి, తుని రూరల్: తుని మండలం వల్లూరు శివారు సీతయ్యపేట సమీపంలో మామిడి తోటలో విలువైన 11 భారీ కలప దుంగలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులవుతున్నా విశాఖపట్నం జిల్లా కొయ్యూరు నుంచి విలువైన కలపను అక్రమంగా తరలించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్క దుంగ చుట్టు కొలత ఎనిమిది నుంచి పది అడుగులు ఉన్నట్టు నిర్ధారించినట్టు తెలుస్తోంది. స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు వల్లూరుకు చెందిన ఇద్దరు, సీతయ్యపేటకు చెందిన మరోఇద్దరు కలసి ఈ కలపను తీసుకువచ్చినట్టు తెలిసింది. నలుగురిలో ఇద్దరు వ్యాపారులు, ఇద్దరు కూలీలు. ప్రమాదాన్ని ముందే గ్రహించిన కలప వ్యాపారులు కూలీలను భాగస్వామ్యం చేసుకుని కలప రవాణా చేసినట్టు పేర్కొన్నారు. ట్రాలీలో తీసుకువచ్చిన కలపను పాయకరావుపేటలో కోతకు తీసుకువెళ్లగా సామిల్లు యజమాని భయంతో కోత కోసేందుకు అంగీకరించలేదని, దాంతో కలపను ఇక్కడకు తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో కలప వ్యాపారులు ఎక్కువగా ఉండడంతో విలువైన కలప దుంగలను గుర్తించి, జిల్లా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఫారెస్ట్ అధికారులు కలప దుంగలను సీజ్ చేశారు. విచారణ జరుపుతున్నారు. వందేళ్ల వయస్సుగల ఇంత విలువైన కలపను విశాఖపట్నం జిల్లా నుంచి ఫారెస్ట్ ఠాణాలను దాటుకుని రావడంలో ఉన్నత అధికారుల పాత్ర ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. దుద్దిక కలపగా వ్యాపారులు పేర్కొంటుండగా బండారు జాతికి చెందిన కలపగా ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. రైతు నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు ఫారెస్ట్ ఠాణాలు దాటించేందుకు, రవాణా చార్జీలుగా రూ.లక్షల్లో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కలప అక్రమ రవాణా అరికట్టడంలో అధికారులు నిద్రావస్థలో ఉంటున్నారనడానికి ఇదే నిదర్శనం. -
లారీలను వెంబడించి పట్టుకున్న ఎమ్మెల్యే
పరిగి వికారాబాద్ : ‘చెట్లన్నీ నరుక్కుంటూ పోతే మొక్క లు నాటి ఏంలాభం.. నాటుడు తక్కువైంది.. నరుకుడు ఎక్కువైంది’. అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమంగా కలప తరలిస్తున్నారంటూ మంగళవారం అర్ధరాత్రి కొంతమంది యువకులు ఇచ్చిన సమాచారంతో బయలుదేరిన ఆయన లారీలను వెంబడిస్తూ వెళ్లారు. ఇదే సమయంలో ఫారెస్టు అధికారులకు సమాచారం అందించడంతో వారు సైతం ఎమ్మెల్యేకు జతకలిశారు. కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లిగేట్ సమీపంలో షాద్‌నగర్ వైపు వెళ్తున్న నాలుగు లారీలను పట్టుకున్నారు. అనంతరం వీటిని పరిగి రేంజర్ కార్యాలయానికి తరలించారు. ఫారెస్టు ఆఫీసులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ ఫారెస్టు రేంజర్ శ్రీవాణి వివరాలు వెల్లడించారు. ముజాహిద్పూర్ పరిసరాల్లోని అటవీ ప్రాంతం తో పాటు వ్యవసాయ పొలాల్లోని చెట్లను నరికి లారీల్లో తరలిస్తున్నట్లు తెలిపారు. ఇందులో మామిడి, యూకలిప్టస్, వేప, తుమ్మ తదితర చెట్ల మొదళ్లు, దుంగలు ఉన్నట్లు స్పష్టంచేశారు. ఎమ్మెల్యే టీఆర్ఆర్ మాట్లాడుతూ.. ఎన్నిసార్లు హెచ్చరించినా కలప అక్రమ రవాణా ఆగడం లేదని మండిపడ్డారు. మొరం, మట్టి, కలప తదితర సహజ వనరులు తరలిపోతున్నా యని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులు, రెవె న్యూ, అటవీశాఖల అధికారులకు సమాచారం అందించాలని యువత, మహిళలను కోరారు. అటవీశాఖ అధికారులు మహిళా ఆఫీసర్లైనా బాగా స్పందిస్తున్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణరెడ్డి, టీ.వెంకటేశ్, ఫారెస్టు అధికారులు ఉన్నారు. -
ఆగని కలప దందా
లక్సెట్టిపేట(మంచిర్యాల): ముందస్తు సమాచారం మేరకు ఆదివారం రాత్రి జన్నారం నుంచి మంచిర్యాల వైపునకు వెళ్తున్న ఇండికా కారును అంబేద్కర్ చౌరాస్తా వద్ద ఆపి అటవీ శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో పది టేకు దుంగలు, సుమారు పద్నాలుగు వేల విలువైనవి అధికారుల తనిఖీల్లో లభ్యమయ్యాయి. సోమవారం ఉదయం టాటా వెంచర్ వాహనంలో 31 టేకు దుంగలతో కలపను తరలిస్తుండగా ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకుని కలపను స్వాధీనం చేసుకున్నారు. కలప విలువ సుమారు రూ. లక్ష ఉంటుంది. వాహనాల డ్రైవర్లు పారిపోగా అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో అటవీ క్షేత్రాధికారి అనిత, ఫారెస్టు డీటీ అజహర్, బీట్ అఫీసర్లు కలీం, ముజ్జు పాల్గొన్నారు. తిర్యాణి మండలంలో.. తిర్యాణి(ఆసిఫాబాద్): తిర్యాణి మండలం గడలపల్లి, బోరింగ్గూడ, గోయగాం గ్రామాల నుంచి అక్రమంగా టేకు దుంగలు తరలిస్తున్న ఆశోక్ లేలాండ్ ట్రక్, ప్యాసింజర్ ఆటో, మోటార్‌బైక్‌ను పట్టుకుని అటవీ అధికారులు తిర్యాణి అటవీరేంజ్ కార్యాలయానికి తరలించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ రేంజర్ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా అక్రమంగా టేకు దుంగలు తరలిస్తున్న మూడు వాహనాలు తమకు తారసపడగా వాటిని తనిఖీ చేయగా ఆటో, ట్రక్‌లలో టేకుదుంగలు కనిపించాయి. బైక్‌పై తీసుకెళ్తున్న రెండు దుంగలను సైతం పట్టుకున్నారు. కాగా ఈ వాహనాల్లో తరలిస్తున్న 30 టేకుదుంగల విలువ రూ. 1.35 లక్షలు ఉంటుంది. కలప తరలించే వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు çఫ్లయింగ్ స్క్వాడ్ రేంజర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో అటవీ అధికారులు శంకర్, మహే«శ్, అనంతరావు ఉన్నారు. కోటపల్లి మండలంలో.. కోటపల్లి(చెన్నూర్): కోటపల్లి మండలం అర్జునగుట్ట నుంచి చెన్నూర్‌కు అక్రమంగా జీపులో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 2 కలప దుంగలను, జీపును ఎఫ్అర్వో రవి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుకున్న కలపను కోటపల్లి రేంజ్ ఆఫీసుకు తరలించారు. కలప విలువ రూ.15వేలు ఉంటుంది. ఇందులో ఎఫ్‌ఎస్‌వోలు రాములు, శ్రీనివాస్, ఎఫ్‌బీవో నాగరాజ్చారి, బేస్‌క్యాంప్ సిబ్బంది వెంకటేశ్, శ్రీనివాస్ ఉన్నారు. ఛేజింగ్.. ఛేజింగ్ నిర్మల్అర్బన్: అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాన్ని నిర్మల్ అటవీశాఖ అధికారులు సోమవారం వేకువజామున పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో నిర్మల్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వాహనాన్ని ఆపేలోపే డ్రైవర్ ఆ వాహనాన్ని వెనక్కి తింపి ఆదిలాబాద్ వైపు తీసుకెళ్లాడు. దీంతో సిబ్బంది వాహనాన్ని వెంబడించారు. అయితే వాహనం అధికారుల కళ్లుగప్పి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో సోన్ మండలంలోని గంజాల్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై అధికారులు గస్తీ ఏర్పాటు చేశారు. కొన్ని గంటల తర్వాత నల్ల రంగు పాలిథిన్ కవర్ పైకప్పుగా ఉన్న వాహనం అటువైపుగా వచ్చింది. అధికారులను గమనించి ఆపారు. ఆగకుండా వేగంగా ముందుకు వెళ్లిపోవడంతో అధికారులు వెంబడించారు. అటవీ శాఖ అధికారులను గమనించిన దుండగులు గంజాల్లోని ఓ వీధిలో వాహనాన్ని వదిలేసి, కారులో పారిపోయారు. నిలిపి ఉంచిన బులేరో వాహనాన్ని పరిశీలించగా, వాహనంలో 23 టేకు దుంగలు లభించాయి. వీటి విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని తెలిపారు. కలపను పట్టుకున్న అధికారులను జిల్లా అటవీశాఖ అధికారి దామోదర్‌రెడ్డి అభినందించారు. -
కలప అక్రమ వ్యాపారం గుట్టురట్టు
ధారూరు: అనుమతులు లేకుండా రైతుల పొలా ల్లోని చెట్లను నరికి అక్రమంగా కలప తరలిస్తు న్న లారీలను విలేకరుల సమాచారంతో ఫారెస్టు ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన ఆదివారం ధారూరు మండల పరిధి మ న్నూరుసోమారం గ్రామ శివారులో చోటు చేసు కుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన కొందరు కలప వ్యాపారులు గత వారం రోజులుగా మున్నూరుసోమారం గ్రా మంలోని చెట్లను నరికి అక్రమంగా లారీల్లో కల ప తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న గ్రా మస్తులు నేరుగా తామే ఫారెస్టు అధికారులకు సమాచారం అందిస్తే ఫలితం ఉండదని భావి ంచి విలేకరులకు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న విలేకరులు అక్రమ కలప వ్యాపా రం గుట్టురట్టు చేశారు. ధారూరు మండలంలో ని వివిధ గ్రామాల రైతుల పొలాల్లో ఉన్న చెట్ల ను ఎలాంటి అనుమతులు లేకుండా మెషీన్ల ద్వారా చెట్లను నరికి లారీల్లో యథేచ్చగా తరలిస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఒక్క ము న్నూరుసోమారం గ్రామం నుంచే 65 లారీల వ రకు కట్టెలను తరలించినట్లు పేర్లు చెప్పని కొం తమంది గ్రామస్తులు వివరించారు. ఆదివారం రెండు లారీల్లో కలప నింపుతుండగా గ్రామస్తుల సమాచారంతో విలేకరులు అక్కడికి వెళ్లి వికారాబాద్ ఫారెస్టు ఆఫీసర్ రాజేందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారి ఏపీ 12 యు 8718 నంబర్ లారీ స్వాధీనం చేసుకొని జిల్లా ఫారెస్టు కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేశామని, జిల్లా ఫారెస్ట అధికారి శ్రీలక్ష్మీ ఆదేశాలతో జరిమానా విధిస్తామని రాజేందర్‌రెడ్డి తెలిపారు. అక్రమ కట్టెల లారీని పట్టుకున్న వెంటనే ఫారెస్ట్ అధికారికి ఫోన్‌కాల్ రావడం ప్రారంభమైంది. ఆయన ఏ ఫోన్‌కు సమాధానం ఇవ్వకుండా లారీని తీసుకెళ్లడం గమనార్హం. -
వాల్టా.. ఉల్టాకలప.. రయ్రయ్
పశ్చిమగోదావరి , తణుకు : జిల్లాలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వాల్టా చట్టానికి తూట్లు పొడిచేలా ఇష్టారాజ్యంగా చెట్లు నరికి కలప రవాణా చేస్తున్నా అటవీశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు పర్మిట్లతో వాహనాల్లో తరలిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పలువురు అంటున్నారు. మధ్యవర్తుల సాయంతో అటవీ శాఖలోని కొం దరు అధికారులు, సిబ్బంది సహకారంతో జిల్లా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా సాగి పోతోంది. మరోవైపు జిల్లాలోని టింబర్ డిపోలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిత్యం వందలాది టన్నుల కలప వ్యాపారుల చేతుల్లోకి చేరుతోంది. దీంతో ఏటా రూ.కోట్ల మేర అక్రమ వ్యాపారం సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాం తాల నుంచి తరలిపోతున్న కలపను రాష్ట్ర సరిహద్దు మందలపల్లి అటవీ తనిఖీ కేంద్రం వద్ద మూడు వాహనాలను అక్కడి అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తణుకు ప్రాంతానికి చెందిన కొందరు టింబర్ డిపో నిర్వాహకులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి రాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున కలపను ఇక్కడకు తరలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అక్రమ వ్యాపారుల గుప్పెట్లోకి.. జిల్లాలో కలప రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు వ్యాపారుల గుప్పెట్లోకి చేరి పోవడంతో విచ్చలవిడిగా వ్యాపారం సా గుతోందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఏలూరు, రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం డివిజన్ల పరిధిలోని రిజర్వు ఫారెస్టుతోపాటు సాధారణ వనా లు ఉన్నాయి. జిల్లాలో 12 చదరపు కిలోమీటర్లు మేర దట్టమైన అడవులు ఉండగా మొత్తం 17 వేల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతాలతోపాటు తీరప్రాంతాల నుంచి విచ్చలవిడిగా అక్రమంగా కలపను రవాణా చేస్తున్నా అరికట్టకపోవడంతో కలప వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. మరోవైపు జిల్లాలోని టింబర్ డిపోలపై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 600 టింబర్ డిపోలు జిల్లాలో సుమారు 600 వరకు టింబర్ డిపోలు ఉన్నాయి. వీటి ద్వారా జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి కలపను దిగుమతి చేసుకుని పలురకాల వస్తువులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. అయితే అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు సిబ్బంది కొరతగా ఉన్నారనే సాకుతో తప్పించుకుంటున్నారు. అటవీ శాఖ అధికారుల రికార్డుల్లో లేని అనధికార టింబర్ డిపోలు చాలానే ఉన్నట్టు తెలిసింది. అనుమతులు ఎక్కడ..? కలప అమ్మకాలకు అటవీ, రెవెన్యూ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. జి ల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులను ప్రసన్నం చేసుకుంటే ఇష్టారాజ్యంగా కలపను అ క్రమ రవాణా చేయవచ్చనే భావనలో వ్యాపారులు ఉన్నారు. కలప రవాణా చేసే క్రమంలో దశలవారీగా అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వాహనాలను ఇచ్చే పర్మిట్లలో కలప రవాణా అయ్యే మార్గంతోపాటు తేదీ, కలప చేరాల్సిన ప్రదేశం పొందుపరచాలి. దీం తోపాటు పర్మిట్‌పై సంబంధిత అధికారి సంతకం ఉండాలి. ఈక్రమంలోనే వ్యాపారులు నకిలీ పర్మిట్లు సృష్టించి తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బందికి మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాల్టా చట్టం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చర్యలు తప్పవు కలప అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని టింబర్ డిపోలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా అక్రమ కలప దిగుమతి చేసుకున్నట్టు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. –పి.ప్రకాశరావు, జిల్లా అటవీశాఖ అధికారి -
అటవీ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం పెంబి అటవీరేంజ్ పరిధిలో కలప అక్రమ తరలింపును అడ్డుకోబోయిన అటవీ, పోలీసు సిబ్బందిపై స్మగ్లర్లు దాడికి తెగించారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇచ్చోడ మండలం నారాయణగూడ, ఖానాపూర్ మండలంలోని పెంబీ అటవీ పరిధిలోని రాగిదుబ్బనాల ప్రాంతంలో అక్రమంగా కలప తరలిస్తున్నారనే సమాచారం అందటంతో అటవీ అధికారి శంకర్, పెంబీ ఎస్సై నజీర్, తమ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి కాపు కాశారు. ఎడ్ల బండ్లపై కలప తరలిస్తూ తారస పడిన స్మగ్లర్లను నిలువరించేందుకు వారు ప్రయత్నం చేశారు. అయితే, స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లతో వారిపైకి దాడికి దిగారు. ఈ ఘటనలో రేంజ్ అధికారి శంకర్‌తోపాటు మరో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో పలుసార్లు హెచ్చరించినా పరిస్థితి అదుపులోకి రాకపోయేసరికి పోలీసులు ఒక్క రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు ఒకటిన్నర లక్షల రూపాయల విలువైన 22 టేకు దుంగలు, 6 ఎండ్లబండ్లను వదిలి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. స్మగ్లర్లపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో పెంబి అటవీ అధికారులు ఫిర్యాదు చేశారు. -
‘ఫారెస్టు’లో చీకటి దందా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా అటవీ శాఖ పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి డివిజన్లున్నాయి. వీటి పరిధిలో నిజామాబా ద్, కమ్మర్పల్లి, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఇందల్వాయి రెంజ్లున్నాయి. జిల్లావ్యాప్తంగా 140 సా మిల్లులు పనిచేస్తుండగా.. ఇందులో టేకు కలపకు సంబంధించిన సామిల్లులు 60 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా అనధికారికంగా 40కిపైగా టేకు కలప సా మిల్లులున్నట్లు తెలుస్తోంది. ఏటా డిసెంబర్లో సామిల్లులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తవాటికీ ఇదే సమయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతి పనికో రేటు కొత్తగా సామిల్లు అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేవారికి అటవీ శాఖలోని పలువురు ఉద్యోగులు చుక్క లు చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సామిల్లు అనుమతి కోసం రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే సవాలక్ష కొర్రీలతో అడ్డుకుంటున్నట్లు సమాచారం. రెన్యువల్ కోసం ఒక్కొక్కరి వద్దనుంచి రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ‘బీట్’లోనూ.. బీట్ అధికారులు కూడా తక్కువ తినడం లేదన్న ఆరోపణలున్నాయి. కలపతో అక్రమ వ్యాపారం చేస్తున్న సామిల్లు యాజమానుల నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క సామిల్లు యాజమాని వద్ద నుంచి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు నొక్కేస్తున్నట్లు సమాచారం. కలప స్మగ్లర్లతో సంబంధాలు కలప అక్రమ రవాణా చేసే స్మగ్లర్లతోనూ పలువురు సిబ్బంది సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఐదారు గ్రూపులుగా ఏర్పడిన దళారులు కలప అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, చెన్నూరు, ఇచ్చోడ ప్రాంతాలతో పాటు మధ్యప్రదేశ్, ఇతరత్రా ప్రదేశాల నుంచి టేకు కలపను అక్రమంగా నిజామాబాద్ తరలిస్తున్నారు. నిజామాబాద్‌లో తమకు సంబంధమున్న సామిల్లుకు గుట్టు చప్పుడు కాకుండా కలపను పంపి, ఫర్నీచర్ తయారు చేయించి, కొనుగోలుదారులకు, దుకాణాలకు పంపిస్తున్నారు. ఈ అక్రమ దందాకు అటవీ శాఖలోని పలువురు ఉద్యోగులు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సహాయానికి కృతజ్ఞతగా స్మగ్లర్లు భారీగానే డబ్బులు అందిస్తున్నట్లు సమాచారం. కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు పర్సంటేజీలు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పది రోజుల వ్యవధిలో.. జిల్లాలో పది రోజుల వ్యవధిలోనే భారీగా కలప పట్టుబడింది. జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్ ప్రాంతంలో ఒక పాత ఇంటిపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులు 22 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గాంధారి మండలం ఎల్లంపేట శివారు నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్న టేకు దుంగలను పట్టుకున్నారు. మల్కాపూర్ శివారు నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్న టేకుదుంగలను, భీమ్‌గల్‌లోని ఓ సామిల్లులో అక్రమ కలపతో తయారు చేసిన సోఫాసెట్లు, విలువైన ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న చీకటి దందా విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తోంది. అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కలప అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని, ఇంటిదొంగల పని పట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
కాసుల వేటలో అడవి ఖాళీ
వినాయక్‌నగర్,న్యూస్‌లైన్: కలప వ్యాపారుల స్వార్థానికి పచ్చని చెట్లు బలవుతున్నాయి. కాసుల కోసం కలప స్మగ్లర్లు పచ్చని చెట్లు నరికి వేయడంతో రోజురోజుకు అటవీ సంపద అంతరించిపోతోంది. దీంతో పెద్దపెద్ద వృక్షాలు కనుమరుగవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. దీంతో కలప స్మగ్లర్లు అడిందె ఆట పాడిందె పాట గా తయారైంది.అటవీశాఖలో క్షేత్రస్థాయి సిబ్బందితో చేతులు కలిపిన కలప స్మగ్లర్లు.. విలువైన టేకు,జిట్రేగి,వేప, తుమ్మ, వంటచెరుకు నరికి నగరాలకు తరలించి సొమ్ము చేసుకుం టున్నారు. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో కలప దొరి కిన స్మగ్లర్లు మాత్రం పారిపోవడం పరిపాటుగా మా రింది. పలుమార్లు రిక్షాలు,సైకిళ్లు, ఆటోలు,లారీలు, అక్రమ కలప తో పట్టుబడ్డా.. నిందితులు మాత్రం పారిపోయారు. కేసులేవీ... ఈ మధ్యకాలంలో జిల్లాకేంద్రంలో పలుచోట్ల అక్రమంగా నిల్వచేసిన టేకు, కలప దుంగలు దొరికాయి. అయితే పట్టుబడ్డ కలప, కలప పట్టుబడిన స్థలం, ఇల్లు ఎవరిదని దర్యాప్తు చేసి కేసులు నమోదు చేసిన దాఖలాలు మాత్రం కనబడవు. నిందితులను పట్టుకొని ఫారెస్టు యాక్టు కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచిన దాఖలాలను వేళ్లమీద లె క్కేయవ చ్చు. దీంతో అటవీ సంపదను దర్జాగా కొల్లగొట్టి స్మగ్లర్లు లక్షల్లో సంపాదిస్తున్నారు. బుధవారం నగరంలోని ముజాహిద్నగర్లో ఓపాత ఇంట్లో *80 వేల విలువ చేసే అక్రమంగా నిల్వచేసిన 22 టేకు దుంగలను అటవీశాఖ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నట్టు ప్రకటన చేశారు. కలప ఎవరిది, ఇల్లు ఎవరిది అనేది మాత్రం దర్యాప్తు చేయక పోవడం శోచనీయం. నిత్యం అక్రమ రవాణా... నిత్యం నగరానికి కాల్పోల్ గ్రామం వైపు నుంచి రిక్షాల్లో, ఆటోల్లో భారీగా వంటచెరుకు తరలిస్తున్నారు. అక్కడి అటవీ క్షేత్రస్థాయి సిబ్బంది అనుగ్రహం లేనిదే ఈ దందా నడవదని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాక బడాపహాడ్, లక్ష్మాపూర్ శివారు నుంచి టేకు సైజులు నిత్యం నగరంలోని బస్సాహెబ్పహాడ్, ధర్మపురిహిల్స్, మాలపల్లి, ముజహిద్నగర్ తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. అటవీ అధికారులు నిఘా ఎంత పటిష్టం చేసినా.. స్మగ్లర్లు మాత్రం అధికారుల కళ్లు కప్పి నగరానికి దర్జాగా కలప అక్రమ రవాణా చేస్తున్నారు. మల్లారం గండి అటవీ ప్రాంతం నుంచి నిత్యం తెల్లవారుజామున సైకిళ్లపై చాలామంది వంటచెరుకు, టేకు దుంగలు తెచ్చుకుంటున్నారు. ఈ దందాపై అధారపడి జీవిస్తున్న కుటుంబాలు నగరంలో వందల్లో ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. ఏదిఏమైనా స్మగ్లర్ల చేతుల్లో అటవీ సంపద రోజురోజుకు అంతరించి పోతోంది. కంచె చేను మేసినట్లుగా అటవీ శాఖవారే స్మగ్లర్లకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ ఉన్నతాధికారులు పట్టించుకొని అక్రమ కలప దందాపై దృష్టిసారించి అటవీ సంపదను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కూలికి వెళితే.. ప్రాణం పోరుుంది
భూపాలపల్లి, న్యూస్‌లైన్ : కలప అక్రమ రవాణా అన్నెపున్నం తెలియని ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఫారెస్ట్ అధికారులు వస్తున్నారనే సమాచారంతో స్మగ్లర్ కంగారుతో ద్విచక్రవాహనం నడపగా అదుపుతప్పింది. దీంతో వెనకాల టేకు దుంగలను పట్టుకుని కూర్చున్న యువకుడు కిందపడగా, అతడిపై దుంగలు పడడంతో తీవ్రగాయూలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామశివారులోని పెద్దమ్మగుడి సమీపంలో జరిగింది. భూపాలపల్లి సీఐ ఎల్ ఆదినారాయణ, మృతుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం... రేగొండ మండలం కాకర్లపల్లి శివారు మడతపల్లికి చెందిన సిరంగి రామయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు ప్రశాంత్(18) వారం రోజుల క్రితం వెంకటాపూర్ మండలంలోని పెద్దాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన సల్ల సతీష్ శనివారం రాత్రి సుమారు 12 గంటలకు ప్రశాంత్ వద్దకు వెళ్లి కూలీకి రావాల్సిందిగా కోరాడు. తన ద్విచక్ర వాహనంపై ఒక టేకు దుంగను పట్టుకుని కూర్చుంటే కూలీ ఇస్తానని చెప్పాడు. దీంతో ప్రశాంత్ అతడితో బయల్దేరాడు. వారితోపాటు అదేగ్రామానికి చెందిన పొన్నం సమ్మయ్య, చేను కిరణ్ రెండు టేకు దుంగలతో మరో ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలకు ముందు అదే గ్రామానికి చెందిన ఆవుల సంపత్, గుండగాని రాజు మరో ద్విచక్రవాహనంపై పైలట్‌గా బయల్దేరారు. మూడు ద్విచక్ర వాహనాలు పెద్దాపూర్ నుంచి గణపురం మండలం చెల్పూరు మీదుగా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామశివారులోని పెద్దమ్మ గుడి దాటాయి. ఈ క్రమంలోనే పైలట్‌గా వ్యవహరిస్తున్న సంపత్, రాజుకు అటవీశాఖ అధికారులు కనిపించారు. ఈ విషయాన్ని వారు టేకు దుంగలను తీసుకొస్తున్న వారికి చేరవేశారు. అప్పటికే వారు దగ్గరికి రావడంతో చేసేదిలేక సమ్మయ్య, కిరణ్ తమ ద్విచక్రవాహనంతోపాటు రెండు టేకు దుంగలను రోడ్డుపైనే వదిలి పారిపోయారు. అటవీ అధికారులు ఆ బైక్‌ను, కలప దుంగలను స్వాధీనం చేసుకుని భూపాలపల్లి వైపు వస్తున్నారు. మరో ద్విచక్రవాహనంపై వస్తున్న సతీష్, ప్రశాంత్ అటవీ అధికారుల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్రవాహనాన్ని పొలాలబాట వైపు తిప్పారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కిందపడిపోగా ప్రశాంత్‌పై టేకు దుంగ పడింది. దుంగ సుమారు 6 ఫీట్లు ఉండడంతో అతడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యూరుు. రక్తస్రావం అధికంగా జరిగింది. సతీష్ గమనించి ప్రశాంత్‌ను మోరంచపల్లి గ్రామం వరకు ఎత్తుకుని రాగా మార్గమధ్యలోనే ప్రశాంత్ మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని మోరంచపల్లి క్రాస్‌రోడ్డు వద్దే వదిలి సతీష్ పరారయ్యూడు. తెల్లవారుజామున ఆరు గంటలకు గ్రామస్తులు మృతదేహాన్ని చూసి సమాచారం అందించగా మృతుడి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు సల్ల సతీష్, ఆవుల సంపత్, గుండగాని రాజు, పొన్నం సమ్మయ్య, చేను కిరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆదినారాయణ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు. స్మగ్లర్ల కొత్త పంథా.. అటవీశాఖ అధికారులు, పోలీసులు కొంతకాలంగా కలప తరలిస్తున్న ఎడ్లబండ్లు, ట్రాలీ, డీసీఎం వ్యాన్లను భారీ మొత్తంలో పట్టుకున్నారు. దీంతో కలప స్మగ్లర్లు కొంత పంథాను అవలంభిస్తున్నట్లు తెలిసింది. ద్విచక్ర వాహనంపై దుంగలను తరలిస్తే అటవీ అధికారులు గాలింపు చేపడుతున్న సమయంలో సులువుగా తప్పించుకోవచ్చని భావించినట్లు సమాచారం. దుంగను వదిలి పారిపోవచ్చు... లేదా దుంగను దాచి అధికారులు వెళ్లేంత వరకు బైక్‌పై దర్జాగా తిరగొచ్చని భావించారు. ఇందు కోసం ద్విచక్ర వాహనం వెనుక టైర్‌కు ఇరువైపులా కంపెనీ ఇచ్చే షాకప్జల్ కాకుండా అదనంగా మరో షాకప్జల్ను ఏర్పాటు చేసుకున్నారు. మృతుడు ప్రశాంత్ ప్రయాణించిన, అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న రెండు ద్విచక్ర వాహనాలకు ఇలాగే ఉండడం బట్టి స్మగ్లర్లు వీటిని కలప దందా కోసమే ప్రత్యేకంగా చేరుుంచినట్లు తెలుస్తోంది.