ఈ నెల19న పట్టుకున్న కలప, వాహనాలతో నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు, పోలీసులు
నిర్మల్: ఆదిలాబాద్–నిజామాబాద్ జిల్లాల మధ్య దర్జాగా సాగుతున్న కలప రవాణాలో పెద్ద రాకెట్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలుతోంది. ఇందులో స్మగ్లర్లకు పోలీసు, అటవీ శాఖకు చెందిన ఇంటిదొంగలే సహకరిస్తున్నట్లు స్పష్టమైంది. ఇప్పటికే నిజామాబాద్‌కు చెందిన ఏఆర్ ఎస్సై షకీల్‌పాషా, ఉట్నూర్ ఎఫ్‌ఎస్‌వో రాజేందర్ సస్పెండ్ కాగా, తాజాగా ఇచ్చోడ సీఐ సతీశ్‌కుమార్, నేరడిగొండ ఎస్సై హరిశేఖర్‌ను తన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్ గురువారం ఆదేశించడం, వారి స్థానాల్లో మరో ఇద్దరికి వెంటనే బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కలప అక్రమ రవాణాపై సీరియస్‌గా దృష్టిపెట్టిన సర్కారు ఈ కేసులో లోతుగా విచారణకు ఆదేశించడంతో నిర్మల్ పోలీసులు ఆ దిశగా కూపీ లాగుతున్నారు. ఇందులో భాగంగా మరింతమంది ‘ఇంటి దొంగలు’ కూడా బయటపడనున్నట్లు తెలుస్తోంది.
బయటపెట్టిన నిర్మల్ పోలీసులు..
ఈ నెల19న నిజామాబాద్ తరలుతున్న రూ.16.52 లక్షల విలువైనకలపను నిర్మల్ పోలీసులు పట్టుకోవడంతో బట్టబయలైన ఈ అక్రమ దందా రెండు ఉమ్మడి జిల్లాల్లో సంచలనంగా మారుతోంది. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్‌కు ఏళ్లుగా సాగుతున్న కలప స్మగ్లింగ్ రాకె ట్‌లో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే దొరికిన స్మగ్లర్లు, అధికారులతోపాటు మరింత మంది ప్రమేయం ఉన్నట్లు తేలుతుండడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. శనివారం వేకువజామున కలప పట్టుబడగానే నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు రంగంలోకి దిగారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు బృందాలను పంపించి విచారణ చేయించారు.
ఈమేరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు సామిల్‌ల యజమానులు, స్మగ్లర్లు, ఏఆర్ ఎస్సై కలిసి ఆదిలాబాద్ జిల్లా నుంచి కలపను అక్రమంగా తరలిస్తున్నట్లు తేల్చారు. ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం ప్రాంతానికి చెందిన ముల్తానీలతో టేకు చెట్లను నరికిస్తూ..స్థానిక ఉట్నూర్ ఎఫ్‌ఎస్‌ఓ రాజేందర్, నిర్మల్ జిల్లా సోన్ వద్ద గల చెక్‌పోస్టులో అక్కడి అధికారులు ప్రైవేటుగా నియమించిన సహాయకుడు సద్దాంల సహకారంతో గుట్టుగా నిజామాబాద్ జిల్లాకు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏఆర్ ఎస్సై షకీల్‌పాషా స్వయంగా అక్రమ రవాణాలో ఉండి, సామిల్‌కు కలప చేరుస్తున్నట్లు తేలిపోయింది. ఇతడి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా వాహనాల నంబర్‌ప్లేట్లు వందవరకు లభించినట్లు సమాచారం.
సీఐ, ఎస్సైలపై చర్యలు..
కలప స్మగ్లింగ్‌లో నేరుగా పాల్గొన్న నిజామాబాద్ ఏఆర్ ఎస్సై షకీల్‌పాషా, సహకరించిన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎఫ్‌ఎస్‌ఓ రాజేందర్‌ను అప్పటికప్పుడే సస్పెండ్ చేశారు. కేసును లోతుగా విచారించగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ సీఐ సతీశ్‌కుమార్, నేరేడిగొండ ఎస్సై హరిశేఖర్‌లు పరోక్షంగా సహకరించినట్లు సందేహాలు రావడంతో వారిని గురువారం తన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్ ఆదేశించారు. తమ పరిధిలో జరుగుతున్న దందాను అరికట్టడంలో విఫలం కావడమే కాకుండా, పరోక్షంగా సహకరించినట్లు సమాచారం ఉండడంతో డీఐజీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కలప రాకెట్‌కు సహకారం అందించిన పక్కజిల్లా నిజామాబాద్‌లోనూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
జిల్లాలో స్మగ్లర్లతోపాటు స్థానిక సామిల్ యజమానులకు పరోక్షంగా సహకరించేలా ప్రవర్తించారన్న ఆరోపణలతో నిజామాబాద్ ఎఫ్‌డీవో వేణుబాబు, సౌత్ రేంజ్ ఎఫ్‌ఆర్వో రవిమోహన్‌భట్, డిప్యూటీ ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా ఆదేశాలు జారీ చేశారు. అక్కడి ఒక సామిల్‌ను సీజ్ చేశారు. మరోవైపు కేసు నమోదైన తర్వాత నుంచి పరారీలో ఉన్న ఏఆర్ ఎస్సై షకీల్‌పాషా, నిజామాబాద్‌కు చెందిన సామిల్ యజమాని ఆఫ్జల్‌ఖాన్‌లను గురువారం నిర్మల్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉట్నూర్ ఎఫ్‌ఎస్‌వో రాజేందర్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నట్లు వారు చెబుతున్నారు. కలపను అక్రమంగా తరలిస్తున్న ఈ కేసుపై మరింతగా విచారణ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన స్పష్టమైన ఆదేశాలమేరకు కలపదందాలో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment