ఇచ్చోడ మండలంలోని పొన్న ఎక్స్‌రోడ్డు వద్ద కలప స్మగ్లింగ్ జరిగే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పీసీసీఎఫ్ పీకే ఝా (ఫైల్) పీడీ యాక్టు నమోదుకు నాలుగు రోజుల ముందు బోథ్ కోర్టులో హాజరు పరిచిన కేశవపట్నానికి చెందిన స్మగ్లర్ షబ్బీర్
ఇచ్చోడ(బోథ్): అడవి దొంగలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో తొలిసారిగా పీడీ యాక్టు అస్త్రాన్ని ప్రయోగించారు. అటవీ సంపదను దోచుకునే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో కలప దొంగలపై జిల్లా యంత్రాంగం ఓ కన్నేసింది. పీడీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. జిల్లాలో తొలిసారిగా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన కలప స్మగ్లర్ షబ్బీర్‌పై కలెక్టర్ అనుమతితో జిల్లా పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
జిల్లాల వారీగా అడవి దొంగల గుర్తింపు
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం జిల్లాల వారీగా కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిని ఇప్పటికే అధికారులు గుర్తించి జాబితా తయారు చేశారు. జల్లా వ్యాప్తాంగా కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతూ నేర ప్రవృత్తిపైనే ఆ«ధారపడ్డా వారు 69 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలో 69 మందిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ, బజార్‌హత్నూర్, బోథ్, పెంబి, ఇంద్రవెళ్లి, సిరికొండ, ఖానాపూర్, కడెం, మామడ, సారంగపూర్, ఉట్నూర్, జన్నారం, తిర్యాణి, వాంకిడి మండలాల్లో అడవి దొంగలను అధికారులు గుర్తించారు.
సీఎం సీరీయస్..
ఆదిలాబాద్ జిల్లాలో 43 శాతం ఉన్న అడవులు 33 శాతానికి పడిపోవడంతో రానున్న రోజుల్లో పర్యావరణానికి త్రీవ ముప్పు ఏర్పడనుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సీరీయస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. జంగిల్ బచావో..జంగిల్ బడావో అనే నినాదంతో అడవుల పెంపకంపై దృష్టి సారించారు. ఈ మేరకు జిల్లా అధికారులు స్మగ్లర్ల ఆట కట్టించే పనిలో ఉన్నారు.
సీఎంవో నుంచి పర్యవేక్షణ..
కలప స్మగ్లింగ్ జరుగుతున్న ప్రాంతాలు, స్మగ్లర్లు, అధికారులు, నాయకులపై సీఎంవో నుంచి రోజు వారి పర్యవేక్షణ జరుగుతున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా జరుగుతున్న కలప స్మగ్లింగ్‌ను నిరోధించడంలో సీఎంవో అధికారులు జిల్లా స్థాయి అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. కలప స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉన్న వారు ఎంతటి వారైనా వదిలపెట్టకుండా పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అటవీశాఖ, పోలీసు అధికారులు, నాయకులు, స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
జిల్లాలో మొదటి సారిగా పీడీ యాక్టు..
జిల్లాలో పీడీ యాక్టు కేసు మొదటిసారిగా నమోదైంది. ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన కలప స్మగ్లర్ శబ్బీర్‌పై ఈ యాక్టు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గత కొన్ని రోజుల నుంచి అటవీఅధికారులు, పోలీసులకు సవాలుగా మారిన శబ్బీర్‌పై ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్, ఆదిలాబాద్, నిర్మల్ పోలీస్టేషన్ల పరిధిలో 15 వరకు కేసులు ఉన్నాయి. అటవీ అధికారులపై దాడులు, అటవీ చెక్‌పోస్టుల ధ్వంసం వంటి కేసులు కూడా అటవీశాఖలో నమోదై ఉన్నాయి. గత కొన్నేళ్లుగా తరచూ అక్రమ కలప రవాణా చేయడం లాంటి కేసులు ఉండటంతో మోస్ట్ వాంటెండ్ కింద శబ్బీర్‌పై పీడీ యాక్టు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అజ్ఞాతంలోకి స్మగ్లర్లు..
గత వారం రోజుల కిత్రం కలప స్మగ్లర్ శబ్బీర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్టు కింద జైలుకు తరలించడండంతో కలప స్మగ్లర్లలో వణుకు పుట్టింది. కొన్నేళ్ల నుంచి కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతూ ఐదారు కేసులు ఉన్న వారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పలు కేసుల్లో అరెస్ట్ అయి జామీనుపై బయటకు వచ్చిన వారు చాలా మంది ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాల్సిన వారిపై పోలీసులు ఓ కన్నేసి వారి కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment