సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు.. ఉన్న అడవిని కాపాడుకునేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. రోజురోజుకూ అంతరించిపోతున్న అడవులను సంరక్షించుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఊళ్లను వనాలు చేసేందుకు.. అడవి వదిలి జంతువులు బయటకు రాకుండా ఉండేందుకు తీరొక్క ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. అడవుల్లో మహా వృక్షాలను రక్షించేందుకు.. వాటిపై వేటు వేసే అక్రమార్కుల జాడ తెలుసుకునేందుకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. నిఘా కెమెరాలు గతంలో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కెమెరాల సంఖ్యను పెంచింది. చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. తనిఖీలను ముమ్మరం చేయనున్నది. ఇటువంటి చర్యలతో అక్రమార్కుల పని పట్టేందుకు, అటవీ సంపదను, విస్తీర్ణాన్ని కాపాడుకునేందుకు వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 64వేల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. ఇందులో 20వేల హెక్టార్లు ఖమ్మం డివిజన్‌లో.. 44వేల హెక్టార్లు సత్తుపల్లి డివిజన్‌లో ఉంది. గతంలో అటవీ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టినప్పటికీ ఏదో ఒక మార్గంలో కలప తరలిపోవడంతోపాటు ఇతర అక్రమాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎక్కువగా రాత్రి వేళల్లోనే అడవుల నుంచి కలప తరలిపోతుండడంతో అధికారులు దీనికి చెక్ పెట్టడంతోపాటు అక్రమంగా పోడు కొట్టకుండా చూసేందుకు చర్యలు చేపట్టారు. ఇటువంటి పకడ్బందీ చర్యలతో జిల్లాలో అడవుల సంరక్షణకు అవకాశం ఏర్పడింది.
12 కెమెరాల ఏర్పాటు..
అటవీ ప్రాంతాల్లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అటవీ శాఖ ఆయా ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. ఎక్కువగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే అనుమానం ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టం చేసేందుకు అటవీ అధికారులు పూర్తిస్థాయి చర్యలు చేపట్టారు. ఖమ్మం డివిజన్ పరిధిలోని గుబ్బగుర్తి, భీమవరం, చీమలపాడు అటవీ ప్రాంతాల్లో.. సత్తుపల్లి డివిజన్ పరిధిలోని కనకగిరి అడవులు, లంకపల్లి అడవుల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో ఆయా ప్రాంతాల్లో 4 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో కూడా అటవీ అధికారులు ఎల్లవేళలా నిఘా ఏర్పాటు చేసి.. గస్తీ తిరగడం వంటి కార్యక్రమాలు చేపట్టేవారు.
గస్తీ తిరుగుతున్న ప్రాంతంలో కాకుండా.. మరో ప్రాంతంలో అక్రమాలు చోటుచేసుకునే వీలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అటవీ శాఖ నిఘా కెమెరాల సంఖ్యను మరింత పెంచింది. మరో 8 కెమెరాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. దీంతో వీటి సంఖ్య ఇప్పుడు 12కు చేరింది. ఖమ్మం, సత్తుపల్లి డివిజన్ పరిధిలోని అటవీ విస్తీర్ణంలో నిఘా కెమెరాల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు అడవిలోకి ఎవరు వస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలు రికార్డు అవుతుండడంతో స్మగ్లర్లు, ఇతరులు అడవిలో అక్రమాలకు పాల్పడేందుకు సాహసించడం లేదు. ప్రతి రెండు, మూడు రోజులకోసారి నిఘా కెమెరాల్లో రికార్డు అయిన పుటేజీని అటవీ శాఖ సిబ్బంది తీసుకొచ్చి ఆయా డివిజన్ కార్యాలయాల్లో అందజేస్తారు. అక్కడి నుంచి జిల్లా కార్యాలయానికి పుటేజీని పంపుతారు. దానిని పరిశీలించిన అధికారులు ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకున్నట్లు రికార్డు అయితే.. వాటిపై చర్యలు తీసుకునేందుకు కిందిస్థాయి సిబ్బందిని ఆదేశిస్తారు. అలాగే పుటేజీని భద్రపరుస్తారు.
పెరగనున్న చెక్‌పోస్టులు..
ఇప్పటికే అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలిపోకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. అటవీ శాఖ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి, ముత్తగూడెం, తల్లాడ, పాలేరు, ఖమ్మం ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నిరంతరం తనిఖీలు చేస్తుంటారు. వీటితోపాటు మరో రెండు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను పెంచాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు మరో రెండు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు గల ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఆయా ప్రాంతాల్లో మరో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు.
అడవులను సంరక్షించేందుకు..
జిల్లాలో అడవులను రక్షించేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా నిఘా కెమెరాల సంఖ్యను పెంచాం. దీంతో కలప అక్రమ రవాణాను నివారించే అవకాశం ఉంది. అలాగే మరో రెండు చెక్‌పోస్టులను పెంచేందుకు ప్రభుత్వానికి నివేదికను పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వాటిని ఏర్పాటు చేయనున్నాం. – బి.సతీష్‌కుమార్, ఇన్‌చార్జి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment