నేపాలీ గ్యాంగ్‌ చిక్కింది.. | Nepal Robbery Gang Arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

నేపాలీ గ్యాంగ్‌ చిక్కింది..

Published Tue, Oct 13 2020 6:48 AM | Last Updated on Tue, Oct 13 2020 8:28 AM

Nepal Robbery Gang Arrested In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాయదుర్గం ఠాణా పరిధిలో సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్‌ దోపిడీ కేసులో ముగ్గురిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 5న బోర్‌వెల్‌ వ్యాపారి గూడూరు మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో ఆహారంలో మత్తు మందు కలిపి..యజమానులు స్పృహ కోల్పోయాక పనిమనుషులు దోపిడీకి పాల్పడిన విషయం విదితమే. ఈ ఘటనలో పాల్గొన్న వారంతా నేపాల్‌ నుంచి పనుల కోసం ఇక్కడికి వచ్చినవారుగా గుర్తించిన పోలీసులు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేశారు. 

  • పది బృందాలుగా ఏర్పడిన పోలీసులు...వారం రోజుల వ్యవధిలో ముగ్గురిని నేపాల్‌ సరిహద్దులోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లఖీమ్‌పూర్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.  
  • వీరి నుంచి రూ.5.2 లక్షల నగదుతో పాటు రూ.20 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.  
  • ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ సోమవారం మీడియాకు తెలిపారు.  

సూత్రధారి నేత్రా 

  • నేపాల్‌లోని కైలాలి జిల్లా మోతీపూర్‌ ఠాణా పరిధిలోని లకమీచూహకు చెందిన నేత్రా బహదూర్‌ శశి అలియాస్‌ నేత్రా ఈ దోపిడీలో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. 
  • ఉపాధి కోసం భారత్‌కు వచ్చిన ఇతడు దేశంలోని ముఖ్యమైన నగరాల్లో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో పనిచేశాడు.  
  • ఈ క్రమంలోనే ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో తమ్ముడు మనోజ్‌ బహదూర్‌ సాహీతో కలిసి వచ్చి ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనికి కుదిరాడు.  
  • ఈజీమనీ కోసం అలవాటు పడిన నేత్రా...నేపాల్‌లోని తన సమీప గ్రామాల్లోని ప్రజలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాల్లో పనిమనుషులుగా, వాచ్‌మన్‌లుగా  ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో తెలుసుకున్నాడు.  
  • ఆ తర్వాత వారితో పరిచయం పెంచుకొని సన్నిహితంగా ఉంటూ వారిని దొంగతనానికి ఒప్పుకునేలా మచ్చిక చేసుకున్నాడు.  
  • తాను చెప్పినట్టుగా యజమానులకు ఇచ్చే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇస్తే మత్తులోకి జారుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉండే నగదు, విలువైన వస్తువులు ఓ బ్యాగ్‌లో చుట్టేసి తీసుకొచ్చేలా ప్లాన్‌ చేస్తాడు.  
  • ఈ మేరకు ముంబై, ఢిల్లీ, ఉదయ్‌పూర్, సూరత్‌లలో ఉండే తన బృంద సభ్యులను హైదరాబాద్‌లో దింపాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 4న కూడా కోకాపేట గ్రామంలోని అరిస్టోస్‌ పోలోమిలో ఉంటున్న జి.కీర్తిరెడ్డి ఇంట్లోనూ దోపిడీకి పాల్పడ్డాడు.  
  • అలాగే ఈ నెల 5న బోర్‌వెల్‌ వ్యాపారి గుడూరు మధుసూదన్‌రెడ్డి ఇంట్లో కుటుంబసభ్యులకు అదే ఇంట్లో పనిమనిషిగా ఉన్న నేపాల్‌కు చెందిన జానకికి మార్గదర్శనం చేసి వారు తినే ఆహారం, టీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి దోపిడీ చేయడంలో సఫలుడయ్యాడు.  

మూడు వాహనాలు మార్చి... నేపాల్‌కు పారిపోతూ ..
మధుసూదన్‌రెడ్డి ఇంట్లో దోపిడీ చేసిన వెంటనే నేపాలీ వాసులు రాజేందర్, (డ్రైవర్‌),  దేవీరామ్‌ దమ్లా, జానకి, వినోద్‌ కమల్‌ షాహీ, భోజల్‌ బీక, మనోజ్‌ బహదూర్‌ సాహీ రెండు బృందాలుగా విడిపోయి ఢిల్లీ, ముంబై వైపు చెరి కొంత సొత్తు తీసుకొని పారిపోయారు. అయితే నేత్రతో పాటు ప్రకాష్‌ శషి అలియాస్‌ ప్రతాప్, సిటలావర్‌లు మరో బృందంగా ఏర్పడి మరికొంత సొత్తు, నగదుతో అద్దె వాహనంలో బయలుదేరారు. హైదరాబాద్‌ నుంచి నాందేడ్, ఇండోర్, లక్నో, లఖీమ్‌పూర ప్రాంతం మీదుగా నేపాల్‌కు వెళ్లాలనుకున్నారు. గతంలోనూ వీరు ఇలానే నేపాల్‌కు వెళ్లి అక్కడ సొత్తును, డబ్బులు పంచుకొని ఎవరి ఊళ్లకు వారు వెళ్లేవారు.

అయితే ఈ దోపిడీని సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పది బృందాలను ఏర్పాటుచేసి పర్యవేక్షించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్‌ పోలీసులతో పాటు ఎస్‌ఎస్‌బీ అధికారులతో మాట్లాడారు. అప్పటికే యూపీ–నేపాల్‌ సరిహద్దుగా ఉన్న లఖీమ్‌పూర్‌కు నేత్రా బృందం చేరుకోగానే అక్కడే మాటువేసి ఉన్న సైబరాబాద్‌ పోలీసుల బృందం అక్కడి పోలీసుల సహకారంతో పట్టుకుంది. పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం కూడా ఇతర బృందాలు గాలిస్తున్నాయని సీపీ సజ్జనార్‌ తెలిపారు. అయితే ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్, మాదాపూర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ సుధీర్, నార్సింగి డీఐ బాలరాజులను సీపీ సజ్జనార్‌ రివార్డులతో
సన్మానించారు. 

‘లేక్‌ గార్డెన్స్‌’ మోసగాళ్లు

  • సిటీలో ‘ఫ్రెండ్షిప్‌ క్లబ్స్‌’  బాధితులు

సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని లేక్‌ గార్డెన్స్‌ ప్రాంతం నకిలీ కాల్‌ సెంటర్లకు అడ్డాగా మారింది. ఫ్రెండ్షిప్‌ క్లబ్స్‌ పేరుతో ఇక్కడ ఏర్పాటవుతున్న కాల్‌ సెంటర్ల ద్వారా మోసగాళ్లు దేశ వ్యాప్తంగా అనేక మందిని టార్గెట్‌ చేస్తున్నారు. వీరి చేతిలో మోసపోతున్న బాధితుల్లో దక్షిణాదికి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ ప్రాంతంపై దాడి చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇద్దరు సూత్రధారుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

  • నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ తరహాలోనే కోల్‌కతాలో ‘లేక్‌ గార్డెన్స్‌’ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఈ కారణంగానే అనేక మంది మోసగాళ్లు దీనిని అడ్డాగా మార్చుకుంటున్నారు. 
  • వ్యాపార కార్యాలయాల పేర్లతో ఆయా ప్రాంతాల్లోని ఇండిపెండెంట్‌ ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. యజమానులకు అనుమానం రాకుండా పాన్‌కార్డులు, ఆధార్‌లతో పాటు ట్రేడ్‌ లైసెన్సులు అందిస్తున్నారు.  
  • సదరు ఇళ్లల్లో నకిలీ కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకునేవీరు అందుకు ప్రత్యేకంగా మహిళల్ని ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారు. ఈ కాల్‌ సెంటర్ల నుంచే ఫ్రెండ్షిప్‌ క్లబ్స్‌ పేరుతో మోసాలకు తెరలేపుతున్నారు.  
  • వీరు టార్గెట్‌ చేసుకునేవారిలో దక్షిణాదికి చెందిన వారు, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ప్రాథమికంగా ఫోన్‌ కాల్స్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా సెక్స్‌ చాట్, డేటింగ్‌ అంటూ ఎరవేస్తున్నారు.  
  • ఆయా కాల్‌సెంటర్లలో పని చేసే ఉద్యోగినులకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు జీతాలు చెల్లిస్తుండటం గమనార్హం. తమ ఎరలకు ఆకర్షితులై స్పందించిన వారిని ముగ్గులోకి దింపడానికి ఈ యువతులు రంగంలోకి దిగుతారు. 
  • తొలుత బాధితుల నుంచి రిజిస్ట్రేషన్‌ పేరుతో కొంత మొత్తం కట్టించుకుంటారు. ఆపై ఈ కాల్‌ సెంటర్లలోని ఉద్యోగినులు వారితో ‘ప్రత్యేక’ కాల్స్, చాటింగ్స్‌ ప్రారంభిస్తారు. పూర్తిగా తమ ట్రాప్‌లోకి వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. 
  • కొన్ని సందర్భాల్లో వీరు టార్గెట్‌ చేసిన వారికి వీడియో కాల్స్‌ కూడా చేస్తుంటారు. ఆపై డేటింగ్‌ చేద్దాం అంటూ వారి నుంచి అందినకాడికి దండుకుని నిండా ముంచుతున్నారు.  
  • ఓ వ్యక్తి నుంచి డబ్బు వసూలు చేసిన తర్వాత ఇక వారికి స్పందించరు. అతడి సెల్‌ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌లో పెట్టడమో, తమ నంబర్‌ను మార్చేయడమో చేస్తారు. కొన్నిసార్లు బెదిరింపులకూ పాల్పడతారు.  
  • కోల్‌కతాలో వివిధ రకాలైన వ్యాపారాలు చేస్తున్న వారు కూడా ‘అదనపు ఆదాయం’ కోసం ఈ లేక్‌ గార్డెన్స్‌ ప్రాంతంలో నకిలీ కాల్‌ సెంటర్ల దందా చేస్తున్నారు. ఈ కారణంగానే ఇక్కడ ఈ తరహా సెంటర్లు పెరిగిపోయాయి. 
  • ఆ ప్రాంతానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆనంద్‌ కర్, బుద్ధదేబ్‌ పాల్‌ సైతం ఓ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 25 మంది యువతులను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. 
  • ఈ నకిలీ కాల్‌ సెంటర్‌ వల్లో పడిన వారిలో నగరానికి చెందిన పది మంది ఉన్నారు. కొందరు బాధితుల ఫిర్యాదుతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది. వీరిని పట్టుకునేందుకు కోల్‌కతా వెళ్లిన ప్రత్యేక బృందం ఆనంద్, పాల్‌లను అరెస్టు చేసింది.

మందలించినందుకు ఘాతుకం

చైతన్యపురి: పని చేయడం లేదని మందలించినందుకు ఓ వ్యక్తి తన భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా,  చిట్యాల గ్రామానికి చెందిన ఏదూరి   వెంకన్న, సుభద్ర దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చారు. వెంకన్న కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఆరేళ్లుగా వారిరువురు విడివిడిగా ఉంటున్నారు. సుభద్ర   పీఅండ్‌టీ కాలనీలోని అనంతలక్ష్మి ఆపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ పిల్లలతో కలిసి ఉంటుంది. నెలరోజుల క్రితం పెద్దమనుషులు పంచాయితీ చేసి నచ్చజెప్పడంతో వెంకన్న భార్యా పిల్లల వద్దకు వచ్చాడు. 

వెంకన్న ఏపని చేయకుండా ఖాళీగా ఉండటంతో శనివారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. పిల్లలు బయట పడుకోగా వెంకన్న, సుభద్ర గదిలో నిద్రించారు. భార్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్న వెంకన్న పార్కింగ్‌లో ఉన్న బైక్‌ల నుంచి బాటిల్‌లో పెట్రోల్‌ తీసుకువచ్చి నిద్రిస్తున్న సుభద్రపై పోసి నిప్పంటించాడు. నిద్రనుంచి మేల్కొన్న సుభద్ర మంటలతోనే భర్తను పట్టుకుంది. అతను ఆమెను తోసేసి బయట గడియ పెట్టి అక్కడినుంచి పరారయ్యాడు.  తీవ్రంగా గాయపడిన సుభద్రను స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కుమారుడు మహేష్‌ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నిందితుడు  వెంకన్నను సోమవారం ఉదయం ఎల్‌బీనగర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. 

యువతి బలవన్మరణం
ముషీరాబాద్‌: మూడుసార్లు చార్టెడ్‌ అకౌంట్‌ పరీక్షలు రాసినా ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సామ్యానాయక్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాంనగర్‌ లక్ష్మమ్మ పార్కు ప్రాంతానికి చెందిన ఉత్తమ్‌చంద్‌ జైన్‌ కుమార్తె స్వప్న జైన్‌ (24) చార్టెడ్‌ అకౌంటెంట్‌ (సీఏ) పరీక్షలకు సిద్ధమవుతోంది. కుటుంబ సభ్యులు మొదటి అంతస్తులో ఉంటుండగా, స్వప్న రెండో అంతస్తులోని తన గదిలో పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆదివారం మధ్యాహ్నమైనా గదిలోనుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఉత్తమ్‌చంద్‌ జైన్‌ తలుపులు బద్దలు కొట్టిచూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్వప్న జైన్‌ మూడుసార్లు సీఏ పరీక్షలు మూడుసార్లు రాసినా క్వాలిఫై కాకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గచ్చిబౌలిలో అంతర్రాష్ట్ర బెట్టింగ్‌ గ్యాంగ్‌! 

  • అరెస్టు చేసి తీసుకువెళ్లిన రాజస్థాన్‌ ఏటీఎస్‌ అధికారులు 

సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్‌ మ్యాచ్‌ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుని వ్యవస్థీకృతంగా బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రాజస్థాన్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) రట్టు చేసింది. ఆదివారం రాత్రి ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్రలతో పాటు నగరంలో గచ్చిబౌలి ప్రాంతంలోనూ సదరు అధికారులు దాడులు నిర్వహించారు. ముంబైలో మకాం వేసిన బుకీలు పారిపోగా, మిగిలిన చోట్ల 14 మందిని అరెస్టు చేసిన ఏటీఎస్‌ రూ.16 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. గచ్చిబౌలిలో జరిగిన దాడిలో కన్నయ్య లాల్, చలానీ, చంపాలాల్, కిషోర్, భానులను అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ గ్యాంగ్‌ ఆన్‌లైన్‌ ద్వారానూ ఆర్థిక లావాదేవీలకు పాల్పడటంతో ఆ మొత్తం ఎంత అనేది ఆరా తీస్తున్నారు. వీరు బెట్టింగ్‌ నిర్వహణకు అత్యాధునిక పరిజ్ఞానం వాడుతున్నట్లు తేలింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement