రామాయంపేట వద్ద పట్టుబడిన ఎర్రచందనం దుంగలు (ఫైల్)
రామాయంపేట(మెదక్): అటవీ ప్రాంతల నుంచి కలప అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. అడవులను కాపాడే నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని అటవీశాఖ అధికారులను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. ఎవరినీ వదిలిపెట్టకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో విలువైన కలప లేకపోవడంతో రామాయంపేట అటవీ ప్రాంతం మీదుగా ఇతర రాష్ట్రాల నుంచి టేకు, ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. దీంతో ఈ విషయమై జిల్లా అటవీశాఖ ప్రత్యేక చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి ఎక్కడిక్కడ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
అటవీ ప్రాంతం రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంచేందుకు సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో అధికారులు పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో అటవీ ప్రాంతం నుంచి కలప అక్రమ రవాణా తగ్గినప్పటికీ అక్రమార్కులు అడపాదడగా చెట్లను నరుకుతునే ఉన్నారు. వీరికి ఇప్పటికే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం ఆరు రేంజీల పరిధిలో 58 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో విలువైన కలప లేకపోవడంతో ఈ ప్రాంతంలో కలప అక్రమ రవాణా తక్కువగానే సాగుతోంది. సీఎం ఆదేశాల దరిమిలా అన్ని రేంజీల పరిధిలో ప్రత్యేక చర్యలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమ రవాణా జరిగినా ప్రాంతాలను అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. గిరిజనతండాలను ఆనుకునే ఉన్న అటవీ ప్రాంతం నుంచి అక్కడక్కడా చెట్లను నరుకుతున్నట్లు సమాచారం. ఇందుకు గుర్తుగా మొడులు మాత్రమే మిగిలాయి. జాతీయ రహదారిపై నుంచి విలువైన కలప అక్రమ రవాణా జరుగుతుండగా... పలుమార్లు రామాయంపేటవద్ద అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు పట్టుబడ్డాయి. ఇతర రాష్ట్రాలనుంచి గతంలో ఎర్రచందనం, టేకు కలప అక్రమరవాణా జరుగుతుండగా అటవీ అదికారులు రామాయంపేట వద్ద పట్టుకున్నారు. ఇందులో భాగంగా రాత్రివేళ పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతోపాటు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. కలప అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
జిల్లా పరిధిలో అటవీప్రాంతంలో విలువైన కలప లేకపోవడంతో ఈ ప్రాంతంలో అక్రమ రవాణా తగ్గింది. ఏదేమైనా కలప అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్నటువంటి అడవిని కాపాడుకోవడానికిగాను ప్రజలు కూడా తమకు సహకరించాలి. ఎదైనా సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. – పద్మజారాణి, జిల్లా అటవీ అధికారిణి
Comments
Please login to add a commentAdd a comment