వన్యప్రాణులకు రక్ష  | Forest Department Save The Animals Medak | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులకు రక్ష 

Published Fri, Feb 22 2019 1:16 PM | Last Updated on Fri, Feb 22 2019 1:16 PM

Forest Department Save The Animals Medak - Sakshi

మెదక్‌జోన్‌: జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుండటం, మరో వైపు వేసవి సమీపిస్తుండటంతో అటవీప్రాంతంలోని చెట్లు చేమలు, పచ్చనిగడ్డి  ఎండిపోయింది. దీంతో వన్యప్రాణులకు ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా మూగజీవాల కోసం ప్రత్యేకమైన దాణాను అందిస్తూ వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మెదక్‌ – కామరెడ్డి జిల్లాల సరిహద్దులోని హవేళిఘణాపూర్‌ మండల పరిధిలోని పోచారం శివారు బోధన్‌ రహదారి పక్కన  మెదక్‌ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో  అభయారణ్యం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  ఇందులో  రెండు డీర్‌ బీడింగ్‌(డీబీసీ)లు ఉన్నాయి. డీబీసీ–1లో 125 హెక్టార్ల అడవి ఉండగా డీబీసీ–2లో 39 హెక్టార్ల అడవి ఉంది.

వీటిచుట్టూ కంచెను సైతం ఏర్పాటు చేసి వాటిలో జింకలను పెంచుతున్నారు. జింకలతో పాటు మరికొన్ని రకాల శాఖాహర జంతువులున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జింకలు 450, నీల్గాయిలు 45, సాంబార్లు 25, అడవిపందులు 1500, నెమళ్లతో పాటు అనేకరకాల పక్షులున్నాయి. కాగా ఇందులోని జంతువులు మొత్తం శాఖాహరం జంతువులే.  వర్షాకాలంలో చెట్ల ఆకులతో పాటు అడవిలో సహజసిద్ధంగా పెరిగే గడ్డిని ఆహారంగా తీసుకుంటాయి.

వేసవికాలం రాగానే అడవిలోని చెట్లకు ఆకులు రాలిపోవటంతో పాటు  గడ్డి ఎండిపోతోంది. డీబీసీల చుట్టూ కంచె వేయడంతో అవి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో సుమారు 5 నుంచి 6 మాసాల వరకు వీటికి దాన (మేత) పెడతారు. ఇది ప్రతిఏటా మార్చి మొదటి వారంలో ప్రారంభిస్తారు. కానీ ఈయేడు ఫిబ్రవరి 2వ తేదీ నుంచే అందిస్తున్నారు. ఈ ఏడాది చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవటంతో  చెట్ల ఆకులతోపాటు గడ్డిసైతం త్వరగా ఎండిపోయింది. దీంతో ప్రతిరోజు 2.5 క్వింటాళ్ల దాన పెడుతున్నారు. అంతే కాకుండా డీబీసీ–1లో 3 హెక్టార్లలో గడ్డిని పెంచుతున్నారు.

అభయారణ్యంలోనే..
అభయారణ్యంలో డీబీసీల్లోనే జంతువులకు తాగునీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అడవిలో  చెక్‌డ్యాంలతో పాటు కుంటలను తవ్వించి అందులో బోర్లు వేయించారు. బోరునీటిని చెక్‌డ్యాంలు, కుంటల్లో నింపుతున్నారు.

ఇవి కాకుండా సాసర్‌ ఫీట్లు సైతం నిర్మించారు.  తాగునీటికి ఇబ్బంది రాకుండా  వాటిలో నీటిని  నింపుతున్నారు.  అడవిలోని ఒక్క బోరు మోటార్‌కు సోలార్‌(పవర్‌)ను ఏర్పాటు చేశారు. డీబీసీ–1 పక్కనే పోచారం ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు నిండితే బ్యాక్‌వాటర్‌ డీబీసీ–1లోకి కొంతమేర వస్తుంది. ఆ నీటిని సైతం అటవీశాఖ అధికారులు జంతువుల తాగునీటి కోసం ఉపయోగిస్తుంటారు.

పర్యాటకుల తాకిడి...
పోచారం అభయారణ్యం(జింకల ప్రత్యుత్పత్తికేంద్రం) హైదరాబాద్‌కు కేవలం  80 కిలోమీటర్ల  దూరం ఉండటంతో వీకెండ్‌లో పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చి జంతువులకు తిలకిస్తున్నారు. ముఖ్యంగా డీబీసీ–1లో   జింకల గుంపులు అధికం ఇందులో 4.5 కిలోమీటర్ల మట్టిరోడ్డును వేశారు. పర్యాటకులు ఇందులో పర్యటించాలంటే వాహనానికి రూ. 100 చెల్లించి ఒక్కో వ్యక్తికి రూ. 20 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. వారివెంట ఒక గైడ్‌ను లోపలికి పంపిస్తారు. అభయారణ్యంలో కాలుపెట్టగానే చంగుచంగున దుముకుతూ జింకలు కళ్లముందే కదలాడుతుంటే పొరవిప్పి నాట్యం చేసే నెమళ్ల వయ్యారం, గుర్రం కన్నా ఎత్తులో ఉండే నీల్గాయిల గాంభీరం, పొదలమాటున  నక్కినక్కి చూసే కొండగొర్ల దాగుడు మూతలతో అభయారణ్యం నిండా జంతువుల  సందడి  కనిపిస్తాయి.  కాగా వీటిని తిలకించేందుకు  చాలా జిల్లాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున  వస్తుంటారు. అంతేకాకుండా ఈ అభయరణ్యానికి ఆనుకుని పోచారం ప్రాజెక్టు సైతం చుట్టూ కొండలు, గుట్టల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టు ఎంతో సహజ సిద్ధంగా ఉంది.

ముందుగానే ఇస్తున్నాం..
అభయారణ్యంలోని జింకల ప్రత్యుత్పత్తి కేంద్రంలోని జింకలకు  2వ తేదీ  నుంచి దాన పెడుతున్నాం. గడ్డినిసైతం పెంచి మేతగా వేస్తున్నాం.   ఈయేడు వర్షాకాలంలో సరైన వర్షాలు లేకపోవడంతో  చెట్ల ఆకులతో పాటు గడ్డి ఎండిపోవటంతో కాస్త ముందుగానే దాన ఇవ్వాల్సి వస్తోంది. రెండు డీబీసీల్లో నిత్యం 2.5 క్వింటాళ్ల దాన అవసరం పడుతోంది. –కృష్ణమూర్తి , బీట్‌ ఆఫీసర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement