జూలై 22న హతమైన నాలుగు జింకలు
- హతమవుతున్న జింకలు, నెమళ్లు, ఇతర జంతువులు
- వేటాడుతున్న దుండగులు.. చట్టాలు అమలుకాని వైనం
- 2014లో మెదక్ మండలం బ్యాతోల్ అడవుల్లోకి హైదరాబాద్ నుంచి జీపులో వచ్చిన కొందరు ప్రముఖ వ్యక్తులు తుపాకులతో జింకలను వేటాడగా అందులో ఒకటి చనిపోయింది. అప్పట్లో ఈ కేసును రామాయంపేట ఫారెస్ట్ అధికారులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
- 2011లో రామాయంపేటకు చెందిన ఓ వ్యక్తి జింక మాంసాన్ని అమ్ముతుండగా అటవీ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు.
- మెదక్ మండలం ఔరంగాబాద్ శివారులో నాలుగేళ్ల క్రితం వేటగాళ్లు విషంపెట్టి 10 నెమళ్లను చంపేశారు. అప్పట్లో ఈ కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులను నేటికీ అటవీ అధికారులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఇందులో పరోక్షంగా రాజకీయ నాయకుల పలుకుబడిని ఉపయోగించి నిందితులను తప్పించినట్టు సమాచారం.
- మూడేళ్ల క్రితం జహీరాబాద్ ప్రాంతంలో కొందరు వేటగాళ్లు అడవిలోకి వెళ్లగా అప్పట్లో అటవీ అధికారులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
- నాలుగేళ్ల క్రితం తూప్రాన్ సమీపంలో ఓ ముఠా అటవీ అధికారులకు చిక్కింది. వారినుంచి ఉడుము, తాబేళ్లతోపాటు వేట పరికరాళ్లను స్వాధీనం చేసుకున్నారు.
- గత ఏడాది మునిపల్లి మండలం కంకోల్ వద్ద ప్రమాదానికి గురైన ఓ వాహనంలో తుపాకులు, తూటాలు లభించటంతో సదరు వ్యక్తులు అడవుల్లో వేటకోసం వచ్చినట్లు అప్పట్లో అధికారులు భావించారు.
- ఈ ఏడాది జూలై 22న నాలుగు జింకలను మెదక్ మండలం రాయిన్‌పల్లి అడవిలో వేటాడి దారుణంగా చంపి ఓ ఆటోలో తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకోగా డ్రైవర్ ఆటోను వదిలి పరారయ్యాడు.
- తాజాగా ఈనెల 3న మెదక్ మండలం తొగిట శివారులో ముగ్గురు వ్యక్తులు నెమలిని చంపి కాల్చడంతో అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
మెదక్: వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. అమాయక ప్రాణులను దుండగులు వేటాడుతున్నా శిక్షించే వారే లేకుండా పోయారు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా అమలు చేసే దిక్కులేకుండా పోయింది. దుండగులు తుపాకులు, ఉర్లు, విషపు గుళికలతో చంపుతున్నారు. రెండు నెలల క్రితం నాలుగు జింకలను పచ్చటి అడవిలో వేటాడి చంపారు.
ఈ నెత్తుటి మరకలు తుడిచిపెట్టుక పోకముందే తాజాగా మారో జాతీయ పక్షిని చంపేశారు. గడచిన ఐదేళ్లలో జిల్లాలో పదుల సంఖ్యలో వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. అయినా ఇప్పటివరకు ఏ ఒక్కరిపై కూడా కఠిన శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఇందులో కొందరు వినోదం కోసం తుపాకులతో జంతువులను హతమారుస్తుండగా, మరికొందరు అవగాహన రాహిత్యంతో వాటిని మట్టుబెడుతున్నారు.
జోరుగా మాంసం విక్రయాలు
వన్యప్రాణుల మాంసం విక్రయాలు సైతం యథేచ్ఛగా సాగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులపై దాబాలు, హోటళ్లలో పిట్టలు, నెమళ్లు, జింకలు, దుప్పులు, అడవి పందుల మాంసాన్ని విక్రయిస్తున్నారు. అసలు ఈ మాంసం ఎక్కడినుంచి వస్తుందోనని ఇప్పటివరకు అధికారయంత్రాంగం ఆరా తీసిన పాపాన పోలేదు. సుమారు ఐదేళ్లలో జిల్లాలో పదుల సంఖ్యలో జంతువులను వేటాడి పట్టుపడ్డ వారెందరో ఉన్నారు. గతంలో జహీరాబాద్, రామాయంపేట, మెదక్ ప్రాంతాలతోపాటు అనేక చోట్ల వేటగాళ్లు వన్యప్రాణులను చంపిన ఘటనలున్నాయి.
ఘటనలు మచ్చుకు కొన్ని...
వధించకూడదు
వన్యప్రాణుల రక్షణకు ప్రధాన రహదారులకు ఇరువైపులా బోర్డులు ఏర్పాటు చేశాం. వాటిని వధించకూడదని హెచ్చరించాం. అడవి జంతువులను చంపితే కఠిన చర్యలు తీసుకుంటాం. బీట్ ఆఫీసర్లతో మరింత అవగాహన కల్పిస్తాం. - జోజి, డీఎఫ్‌ఓ, (వన్యప్రాణి విభాగం) మెదక్