విశాఖపట్నం, సాక్షి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. కోస్తా, రాయలసీమలపై తీవ్ర ప్రభావం చూపెట్టనుంది. ఇప్పటికే సముద్ర వాతావరణం అలజడిగా మారగా.. విశాఖ తీరం వెంట తేలికపాటి వర్షం మొదలైంది. రేపటి నుంచి నగరం సహా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఓవైపు చలి తీవ్రత.. మరోవైపు తేలికపాటి వర్షం విశాఖను వణికిస్తోంది. అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి నాలుగు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా.. తీరం వెంబడి 35 -45 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే.. రాబోయే మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమ భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే.. దక్షిణ కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు వాతావరణశాఖ అంచనాలకు తగ్గట్లే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం మొదలైంది.
నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రేపు ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే.. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని చెబుతూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
Comments
Please login to add a commentAdd a comment