
మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది.
సాక్షి, విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది.
వాయుగుండంగా మారిన తర్వాత దిశ గమనం బట్టి ఏపీపై కురిసే వర్షాలపై అంచనా. ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని, మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఈ వాయుగుండం తుపానుగా బలపడవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. నేడో, రేపో మన రాష్ట్రంలోనూ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
చదవండి: దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు