
అమరావతి, సాక్షి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయుగుండంగా మారి.. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది.
రేపటి నుంచి ఏపీపై వాయుగుండం ప్రభావం కనిపించనుంది. రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.
తీరప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. కోస్తాంధ్రలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తాంధ్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.

Comments
Please login to add a commentAdd a comment