సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ నెల 26వ తేదీన వాయిగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తం చేస్తోంది వాతావరణ శాఖ.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరో ఐదురోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సైతం ధృవీకరించింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏర్పడందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు.
బుధవారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. ఆతర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని వెల్లడించారాయన. బుధవారం అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, గురువారం భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వివరించారు.
బుధవారం.. కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,పల్నాడు,బాపట్ల,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
గురువారం.. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.
సోమవారం నాటికి ఇలా..
రాత్రి 7 గంటల నాటికి జిల్లా వారీగా విశాఖ జిల్లా ఆనందపురంలో 96 మి.మీ, పెందుర్తి 84, పద్మనాభం 76 మి.మీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ లో 61.5మి.మీ ,అల్లూరి జిల్లా అనంతగిరిలో 61.5 మి.మీ , శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట 56.5 మి.మీ, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 55.7 మి.మీ, నెల్లూరుజిల్లా అనుమసముద్రంపేటలో 55.5 మి.మీ, అనకాపల్లి జిల్లా సబ్బవరంలో 49.7 మి.మీ, మన్యంజిల్లా సాలూరులో 47.5 మి.మీ అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు.
గోదావరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సోమవరం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 36.3 అడుగులు, పొలవరం వద్ద నీటిమట్టం 11.8 మీటర్లు ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.12 లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం కూనవరం ,పి.గన్నవరంలో 2ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మామిడికుదురు, అయినవిల్లి, కుకునూర్, వేలేర్పాడులో 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి తెలిపారు. వరద ఉధృతి హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment