దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక నిర్వహించాలన్న ‘జమిలి బిల్లు’ తొలి గండం గట్టెక్కింది. ఇవాళ లోక్‌సభలో బిల్లుల కోసం 269-198తో ఆమోదం లభించింది. దీంతో విస్తృత సంప్రదింపులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లులు వెళ్లనున్నాయి. అయితే అంతకంటే ముందే నిర్దిష్ట గడువులోగా జేపీసీ ఏర్పాటు కావాల్సి ఉంది.
శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. అంటే ఈలోపే జేపీసీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ఆయనకు ఎంతో కీలకం. ఆయన కమిటీని ఏర్పాటు చేసి.. త్వరగతిన పనిని అప్పగించాల్సి ఉంటుంది. జేపీసీలో రాజ్యసభ ఎంపీలు కూడా ఉంటారు. అధికార సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్‌సభ నుంచే 21 మంది ఉంటారు.
ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. మళ్లీ వచ్చే సెషన్‌లో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ తిరస్కరణ
మంగళవారం మధ్యాహ్నాం లోక్‌సభ ముందు జమిలి ఎన్నికల బిల్లులు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్లు (ఆర్టికల్ 129), కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టడానికి అవసరమైన డివిజన్ ఓటింగ్ కంటే ముందు.. సభలో వాడివేడిగా చర్చ నడిచింది. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎన్డీయే సభ్య పార్టీలు మాత్రం మద్దతు ప్రకటించాయి. ఆపై విపకక్షాల అభ్యంతరాల నడుమ.. డివిజన్ ఓటింగ్ అనివార్యమైంది. ఈ ఓటింగ్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికే ఆమోదం లభించింది. అయితే ఈ పరిణామం తర్వాత కాంగగ్రెస్ మరోసారి స్పందించింది. ‘ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం. ఈ బిల్లును మేము ఏ మాత్రం ఆమోదించం’’ అని స్పష్టం చేసింది.
జేపీసీకి డెడ్‌లైన్ ఉంటుందా?
జమిలి ఎన్నికల నిర్వహణపై జేపీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోదు. కేవలం విస్తృత సంప్రదింపుల ద్వారా నివేదికను మాత్రమే రూపొందిస్తుంది. ఇందుకోసం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతుంది. కమిటీలో సభ్యులుకానీ ఎంపీలతో అలాగే రాజ్యాంగపరమైన మేధావులు, న్యాయ కోవిదులతో చర్చిస్తుంది. ఎన్నికల సంఘంలో మాజీ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతుంది. అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు జరపొచ్చని తెలుస్తోంది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ మాత్రం చేపడుతుంది. ఆపై తుది నివేదికను సమర్పిస్తుంది.
జేపీసీకి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే ఆ గడువును పొడిగించే అవకాశమూ ఉంటుంది. ఆపై అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్‌లో బిల్లులపై చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356లకు సవరణ తప్పనిసరిగా జరగాలి.
ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. వచ్చే ఏడాదే ఓటింగ్ !!
Comments
Please login to add a commentAdd a comment