మొత్తానికి బీజేపీ చిరకాల వాంఛ నెరవేరటంలో తొలి అడుగుపడింది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు ముసాయిదా బిల్లులు మంగళవారం లోక్‌సభలో ప్రవేశించాయి. అందరూ అనుకున్నట్టే ఈ బిల్లులకు విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వచ్చినంత వేగంగా రెండు బిల్లులూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు వెళ్లబోతున్నాయి. తరచు జరిగే ఎన్నికల వల్ల పాలనా నిర్వహణలో అస్థిరత నెలకొంటున్నదని, కీలకమైన ప్రాజెక్టుల సాకారంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంటున్నదని, ఎన్నికలకు తడిసి మోపెడు వ్యయం అవుతున్నదని ప్రభుత్వ పెద్దలు చాన్నాళ్లుగా వాదిస్తున్నారు.
ఎన్నికల నిర్వహణపై స్పష్టత వుంటే పాలన కుంటు పడదని, అధికార యంత్రాంగంపైనా, ఖజానాపైనా భారం తగ్గుతుందని, వోటింగ్ శాతం పెరుగు తుందని వారి వాదన. ఈ విషయమై కేంద్రం మాజీ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన బృందం సైతం పాలకుల వాదనకు అనుకూలంగా సిఫార్సులు చేసింది. జమిలి ఎన్నికల వల్ల సుస్థిరత ఏర్పడి పెట్టుబడులు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధికి వీలవుతుందని, వనరుల కేటాయింపు సమర్థంగా చేయొచ్చని వివరించింది. మతపరమైన ఉద్రిక్తతలు తగ్గి భద్రతా బలగాల వినియోగం పెద్దగా ఉండబోదన్నది ఆ బృందం అభిప్రాయం.
జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 83, 172, 324 అధికరణాలను సవరించాల్సి వుంటుంది. అందుకోసమే ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. వోటర్ల జాబితాకు సంబంధించి రాజ్యాంగంలోని 325 అధికరణను సవరించే మరో బిల్లు అవసరమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆధ్వర్యంలో లోపరహితమైన జాబితా రూపొంది లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. అంటే జమిలి కేవలం ఈ రెండు సభలకు సంబంధించిందే. ఈ ఎన్నికలు పూర్తయిన వందరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయి.
మొత్తానికి ఎన్నికల జాతర అయిదేళ్లకోసారి మాత్రమే ఉంటుంది. మధ్యలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం కుప్పకూలి అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరైతే వాటిని జరుపుతారట. కానీ ఆ కొత్త ప్రభుత్వాల ఆయుష్షు ఆ మిగి లిన సంవత్సరాలకు మాత్రమే పరిమితమవుతుందట. అంటే అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వం మూడేళ్లకే పతనమైతే... కొత్తగా ఎన్నికలై వచ్చే పాలకులకు కేవలం రెండేళ్లు మాత్రమే పదవీయోగం దక్కుతుందన్నమాట! సారాంశంలో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ఆదర్శం కాస్తా అట కెక్కినట్టే అవుతుంది. మరి ఈ బిల్లులు సాధించదల్చుకున్నదేమిటి?
ఈ బిల్లులు గట్టెక్కటం అంత సులభమేమీ కాదు. ఏ రాజ్యాంగ సవరణ బిల్లుకైనా మూడింట రెండువంతుల మెజారిటీ తప్పనిసరి. ఆ రకంగా చూస్తే 543 మంది సభ్యులున్న సభలో ఈ బిల్లు లకు మద్దతుగా కనీసం 362 మంది వోటేయాలి. కానీ ఎన్డీయే బలం 293. అంటే మరో 69 మంది మద్దతు అవసరమవుతుంది. రాజ్యసభ వరకూ చూస్తే 163 మంది బిల్లులకు అనుకూలంగా వోటే యాలి.
కానీ ఎన్డీయే బలం 121. ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా తప్పనిసరి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చట్టాలు మార్చాలంటే కనీసం సగం అసెంబ్లీలు అందుకు అంగీ కరించాలి. కోవింద్ కమిటీ ముందు 47 రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలు వినిపించాయి. 32 పార్టీలు అనుకూలం కాగా, 15 పార్టీలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’కు వ్యతిరేకమని తేలింది.
ప్రజాస్వామ్యమంటే కేవలం అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలు మాత్రమే కాదన్న సంగతి పాలకులు మరిచిపోయి చాన్నాళ్లయింది. ఎన్నికల్లో చెప్పేది ఒకటైతే, గెలిచాక చేసేది మరొకటి.కేంద్రంలో మాత్రమే కాదు... ఏపీలోని ఎన్డీయే పాలన చూసినా ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఏపీలో నదురూ బెదురూ లేకుండా ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ ఎగనామం పెట్టారు. ఇక ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఈవీఎంలపై అనుమానాలు మొదలవుతున్నాయి. ఏపీలో ఎన్నికలు పూర్తయినవెంటనే ఈసీ ప్రకటించిన ఓట్లకు లెక్కించినప్పుడు అదనంగా మరో పన్నెండున్నర శాతం ఓట్లు వచ్చిచేరాయి.
దేశంలో అత్యధిక నియోజకవర్గాల్లో సగటున వెయ్యి ఓట్లు ఇలా అదనంగా చేరినట్టు బయటపడింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలన్న కనీస సంస్కారం ఈసీకి లేకపోగా... ఈవీఎంలలో పోలైన ఓట్లనూ, వీవీ ప్యాట్ స్లిప్‌లనూ సరిపోల్చాలన్న వినతుల్ని బుట్టదాఖలా చేసింది. పైగా అతి తెలివి ప్రదర్శించి డమ్మీ పోలింగ్ నిర్వహణకు దిగింది! ఏపీకి సంబంధించినంతవరకూ అయితే గడువుకు ముందే వీవీ ప్యాట్ స్లిప్‌లను ధ్వంసం చేశారు. ఈవీఎంల డేటా తొలగించారు. ఈ వైపరీ త్యాలపై తామేం చేయాలన్న స్పృహ, వివేకం కేంద్ర పాలకులకు లేకపోగా... ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ లోనే దేశ భవిష్యత్తు సర్వం ఆధారపడి వున్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నారు.
పైగా ఈ మాదిరి ఎన్నికలు ప్రాంతీయ ఆకాంక్షలనూ, అవసరాలనూ పాతరపెడతాయన్న ఆరోపణలకు సరైన జవాబు లేదు. ఈ విధానం దేశ ఫెడరల్ స్వభావాన్ని దెబ్బతీస్తుందన్న విమ ర్శను బేఖాతరు చేస్తున్నారు. అసలు 140 కోట్ల జనాభా... 30 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతా లున్న దేశాన్నీ... లెక్కకు మిక్కిలివున్న పార్టీలనూ ‘జమిలి’ చట్రంలో బిగించి ఒక్క వోటుకి కుదించాలన్న ప్రతిపాదనే వింతై నది.
దానిపై బిల్లులు పెట్టేముందు విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయం సాధించాలన్న కనీస ఇంగితజ్ఞానం కొరవడితే ఎలా? అగ్రరాజ్యమైన అమెరికాలోనే నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుపుతూ, రాష్ట్రాల సెనేట్‌లకూ, స్థానిక సంస్థలకూ, ప్రతినిధుల సభకూ నిర్ణీత కాలంలో విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తుండగా దాదాపు 97 కోట్లమంది వోటర్లున్న ఈ అతి పెద్ద దేశంలో జమిలికి తహతహలాడటంలోని మర్మమేమిటి?
Comments
Please login to add a commentAdd a comment