‘ఒక దేశం ఒకే ఎన్నిక’కుకేంద్రం పచ్చజెండా
కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం
శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం!
స్వాగతించిన బీజేపీ, ఎన్డీయే పక్షాలు
ఆచరణసాధ్యం కాదన్న కాంగ్రెస్, విపక్షాలు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు ఈ టర్మ్‌లోనే ఉంటాయని కొద్ది రోజులుగా స్పష్టమైన సంకేతాలిస్తూ వస్తున్న మోదీ సర్కారు ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. దేశమంతటా అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన ’ఒక దేశం ఒకే ఎన్నిక’ ప్రతిపాదనకు జై కొట్టింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతో మన దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నుల్లో భారీ సంస్కరణలకు రంగం సిద్ధమైంది.
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు అన్ని స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేయడం తెలిసిందే. తొలుత దీనికి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని, ఆ మీదట దశలవారీగా నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించింది. ‘కమిటీ సిఫార్సుల మేరకు అన్ని వర్గాలతోనూ సంప్రదింపుల ప్రక్రియ చేపట్టిన అనంతరం కేంద్ర న్యాయ శాఖ బిల్లు ప్రతిని రూపొందించి కేబినెట్ ముందు పెడుతుంది. అనంతరం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతాం‘ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
వచ్చే శీతాకాల సమావేశాలే ఇందుకు వేదిక కావచ్చని చెబుతున్నారు. ఈ మేరకు ఒకే బిల్లు గానీ, అవసరమైతే పలు బిల్లులు గానీ ప్రవేశపెట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు లా కమిషన్ కూడా జమిలిపై త్వరలో నివేదిక సమర్పించనుంది. 2029 నుంచి ఒకేసారి అన్ని ఎన్నికల నిర్వహణ, హంగ్ వచ్చే పక్షంలో ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటు తదితర సిఫార్సులను కమిషన్ చేయవచ్చని సమాచారం.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికలు కీలక వాగ్దానంగా ఉంటూ వస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని బీజేపీ, ఎన్డీయే పక్షాలు స్వాగతించగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు మాత్రం ఇది ఆచరణసాధ్యం కాదంటూ పెదవి విరిచాయి. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ సర్కారు ఆడుతున్న డ్రామాగా దీన్ని అభివర్ణించాయి.
త్వరలో అమలు కమిటీ
జమిలి ఎన్నికలకు ఇప్పటికే చాలా రాజకీయ పక్షాలు సమ్మతి తెలిపాయని కేంద్రం పేర్కొంది. ఇప్పుడు వ్యతిరేకిస్తున్న పారీ్టలు కూడా వైఖరి మార్చుకుంటాయని ఆశాభావం వెలిబుచ్చింది. దేశ ప్రజల్లో అత్యధికులు ఈ ప్రతిపాదనను సమర్థించిన నేపథ్యంలో ఆ దిశగా వాటిపై అంతర్గత ఒత్తిళ్లు వస్తున్నాయని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కోవింద్ కమిటీ సిఫార్సులను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో ఒక అమలు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
‘ఈ అంశంపై రానున్న కొద్ది నెలల పాటు ప్రజలు, పార్టీలు, మేధావులు... ఇలా అన్ని రకాల వేదికల్లోనూ లోతుగా చర్చలు జరుగుతాయి. జమిలి ఎన్నికలకు విస్తృత ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తాం. దీర్ఘకాలంలో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసే ఇలాంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కావాలన్నది మా ప్రభుత్వ విశ్వాసం. ఇది మన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే చర్య‘ అని చెప్పుకొచ్చారు. కమిటీ చేపట్టిన సంప్రదింపుల సందర్భంగా ఏకంగా 80 శాతం మందికి పైగా జమిలికి మద్దతిచ్చారని ఆయన చెప్పారు.
ముఖ్యంగా యువత దీన్ని పూర్తిస్థాయిలో సమర్థించిందన్నారు. కాబట్టే జమిలికి ప్రస్తుతం విపక్షాల వ్యతిరేకంగా ఉన్నా.. విపక్షాలపై కూడా వైఖరి మార్చుకుందామంటూ అంతర్గతంగా ఒత్తిడి వస్తోందని ఒక ప్రశ్నకు బదులుగా మంత్రి అభిప్రాయపడ్డారు. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో జమిలి బిల్లు పెడతారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా బదులివ్వలేదు. మోడీ 3.0 హయాంలోని దీన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు.
1967 దాకా జమిలి ఎన్నికలే
స్వాతంత్య్రం వచ్చాక 1951 నుంచి 1967 దాకా దేశమంతటా లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత మధ్యంతరాలు తదితర కారణాలతో జమిలికి తెర పడింది. ఈ నేపథ్యంలో జమిలి కోసం భారీ కసరత్తే చేయాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరపడం, కొన్నింటిని ఆలస్యం చేయడం వంటి చర్యలు అవసరం అవుతాయి.
రెండు దశల్లో అమలు కోవింద్ కమిటీ సిఫార్సు
కోవింద్ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమర్పించింది. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ‘తొలి దశలో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. 100 రోజు ల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపాలి‘ అని పేర్కొంది.
అన్ని ఎన్నికలకూ ఉమ్మ డిగా ఒకే ఎలక్టోరల్ రోల్ ఉపయోగించాలని పేర్కొంది. ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల సంఘాల మధ్య సమన్వయం అవసరం. ఎందుకంటే ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను సీఈసీ, స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలు నిర్వహిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment