రాజ్యసభలో మరింత కీలకంగా వైఎస్సార్‌సీపీ! | BJP's Rajya Sabha Tally Dips, NDA Now 12 Below Majority Mark | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో 86కి పడిపోయిన బీజేపీ బలం.. మరింత కీలకంగా వైఎస్సార్‌సీపీ!

Published Mon, Jul 15 2024 2:55 PM | Last Updated on Mon, Jul 15 2024 9:08 PM

BJP's Rajya Sabha Tally Dips, NDA Now 12 Below Majority Mark

న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. రాజ్యసభలో మాత్రం మెజార్టీ తగ్గిపోయింది. నామినేటెడ్‌ ఎంపీలైన నలుగురు రాకేష్‌ సిన్హా, రామ్‌ షకల్‌, సోనాల్‌ మాన్‌సింగ్‌, మహేష్‌ జఠ్మలాని పదవికాలం శనివారంతో ముగియడంతో పెద్దల సభలో బీజేపీ బలం 86కు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్రపది ద్రౌపది ముర్ము వీరిని నియమించారు.  వీరు అనంతరం రాజ్యసభలో అధికార ఎన్డీయే కూటమికి మద్దతుగా నిలిచారు. 

అయితే నలుగురు ఎంపీల రాజీనామాలతో రాజ్యసభలో బీజేపీ సంఖ్య 86కు చేరగా.. ఎన్డీయే కూటమికి 101 మంది ఎంపీల బలం ఉంది. మొత్తం 245 సభ్యులు కలిగిన పెద్దల సభలో మెజార్టీ మార్కు 113గా ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో 225 మంది ఉన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇందులో కాంగ్రెస్‌కు 26, తృణమూల్‌ కాంగ్రెస్‌కు 13, ఆమ్‌ ఆద్మీపార్టీ 10, డీఎంకే పార్టీకి 10  మంది సభ్యులు ఉన్నారు. వీరితోపాటు ఇక అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమిలో భాగంగా లేని తెలంగాణలోని బీఆర్‌ఎస్‌, పలువురు నామినేటేట్‌ ఎంపీలు, స్వతంత్రులు ఉన్నారు

అయితే ఎగువ సభలో బిల్లులను ఆమోదించడానికి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీయేతర పార్టీలపై ఆధారపడి ఉంది. దీంతో గతంలో ఎన్‌డీఏకు మిత్రపక్షంగా వ్యవహరించిన​ తమిళనాడులోని అన్నాడీఎంకే, అంశాలవారీగా పలుమార్లు మద్దతిచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇపుడు కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీల ఎంపీలనూ ( అన్నాడీఎంకే 4, వైఎస్సార్‌ సీపీ11) కలిపితే 101 ప్లస్‌ 15.. మొత్తంగా 116 కావటంతో.. బిల్లులు ఆమోదం పొందడానికి ఈ రెండు పార్టీలూ కీలకంగా మారాయి.

గతంలో కూడా పలు సందర్భాల్లో వైఎస్సార్‌సీపీ(11), అన్నాడీఎంకే (4) పలు బిల్లుల విషయంలో ఎన్డీయేకు మద్దతిచ్చాయి. కానీ ఇటీవల ఎన్నికలకు ముందు గత ఏడాది డిసెంబర్‌లో అన్నాడీఎంకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేనతో కూటమి గట్టి మరీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పోటీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీకి ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. బిల్లులు గట్టెక్కాలంటే వైఎస్సార్‌సీపీ సపోర్టు ఎన్డీయేకు తప్పనిసరి. ఎందుకంటే 11 మంది సభ్యులున్న వైస్సార్‌సీపీ...  రాజ్యసభలో నాలుగవ అతిపెద్ద పార్టీ కావటం విశేషం. 

ఇక గతంలో ఎన్డీయేకు మరో మిత్రపక్షంగా ఉన్న ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతాదళ్‌ కూడా ఎన్నికల ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని ఇప్పటికే బీజేడీ తేల్చి చెప్పింది. బీజేడీకి తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్  సమావేశాల్లో బిల్లుల ఆమోదానికి వై ఎస్సార్‌సీపీ , బీజేడీ , బీఆర్ఎస్ మద్దతు కీలకం.

ప్రస్తుతం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 మంది ఎన్నికయ్యేవారు కాగా.. ఈ ఏడాది ఈ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మహారాష్ట్ర, అస్సాం, బీహార్‌లలో రెండు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమికి అస్సాం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర నుంచి ఏడు చోట్ల గెలిచే అవకాశం ఉంది ఇక మహారాష్ట్రలో  మరో రెండు దక్కించుకునే ఛాన్స్‌ ఉంది. దీంతో బీజేపీకి అదనంగా తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు నామినేటెడ్‌ సభ్యుల ఓట్లు,  వైఎస్సార్‌సీపీ ఓట్లు కలిపితే బీజేపీకి మెజారిటీ మార్కును దాటేందుకు కావాల్సినంత బలం ఉండనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement