
న్యూఢిల్లీ, సాక్షి: రకరకాల పన్నులతో ప్రజలపై భారం మోపడమే తప్ప.. వాళ్లకు ఒనగూరుతోంది ఏంటని? వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘‘ఓవైపు ఆదాయపన్ను, మరోవైపు జిఎస్టి, ఇంకోవైపు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేస్తున్నారు. కానీ ఈ పన్నులతో ప్రజలకు ఒనగురుతున్నది ఏంటి?. కేవలం రోడ్లు భవనాలు నిర్మిస్తున్నామంటే సరిపోదు. మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలి. అదే సమయంలో తగిన ప్రోత్సాహకాలు అందించాలి’’ అని ప్రసంగించారు.
‘‘పెన్షన్‌పై ఎలాంటి పన్నులు వేయవద్దు. లక్ష రూపాయల వరకు పెన్షన్లు టాక్స్ ఫ్రీ చేయాలి. రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే.. సీనియర్ సిటిజన్లో కోసం ఐటీ ఫైలింగ్ కోసం ప్రత్యేక సహాయ యంత్రంగా ఏర్పాటు చేయాలి. పీపీఎఫ్ వడ్డీరేట్లు, ఎఫ్డీ రేట్లకంటే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే పీపీఎఫ్ వడ్డీ రేట్లు పెంచాలి పొదుపును ప్రోత్సహించాలి. సరైన సమయంలో ఆదాయ పన్ను ఫైల్ చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి’’ అని కేంద్రాన్ని కోరారాయన. వీటితో పాటు..
తక్కువ వడ్డీకే వాయిదాలు చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి తగిన ప్రోత్సాహకాలు, నిధులు ఇవ్వాలని, అలాగే.. వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని తగ్గించాలి అని ఆయన వైఎస్సార్‌సీపీ తరఫున కేంద్రాన్ని కోరారు.